విగ్రహాల ప్రతిష్ఠాపనలో ఇబ్బందులుండొద్దు

– నిబంధనలకు విరుద్ధమైతే ముందే నోటీసులివ్వాలి
– సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29: మహనీయుల విగ్రహాల ప్రతిష్ఠాపనలో ఎదురవుతున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని షెడ్యూల్డ్ కులాల, తెగల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మహనీయుల విగ్రహాలు కేవలం శిల్పాలు కావని, అవి సామాజిక చైతన్యానికి, స్వాభిమానానికి, రాజ్యాంగ విలువలకు ప్రతీకలని పేర్కొన్నారు. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో మహనీయుల విగ్రహాల ప్రతిష్ఠాపనలో ఎదురవుతున్న ఇబ్బందులపై సచివాలయంలో శుక్రవారం మంత్రి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో దళిత సంఘాల ప్రతినిధులు, యువకులు, ప్రజా సంఘాల నాయకులు విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి ఎదురవుతున్న స్థల సమస్యలు, అనుమతుల జాప్యం, స్థానికంగా తలెత్తుతున్న అభ్యంతరాలు, పోలీసు అనుమతులు, రెవెన్యూ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై మంత్రి అడ్లూరి మాట్లాడుతూ మహనీయుల ఆశయాలను గ్రామస్థాయి నుంచి యువతలోకి తీసుకెళ్లే ప్రక్రియలో విగ్రహాల ప్రతిష్ఠాపనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన అంశాలలో అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ దేశంలో సామాజిక ఐక్యత, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం లక్ష్యాలతో సాగిందన్నారు. విగ్రహాల ప్రతిష్ఠాపనలో అనవసర జాప్యం జరగకుండా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, జీహెచఎంసీ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలని, క్షేత్రస్థాయిలో సమస్యలను చట్టబద్ధంగా, సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. నిబంధనలకు అనుగుణంగా లేని స్థలాల విషయంలో ముందుగానే సంబంధిత సంఘాలకు నోటీసులు ఇవ్వాలన్నారు. చివరి నిమిషంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, దళిత సంఘాలతో చర్చించి ముందస్తు పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనవసరంగా దళిత సంఘాల నాయకులపై కేసుల నమోదు సరికాదని మంత్రి స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారంపైనే ప్రధాన దృష్టి పెట్టాలని, శాంతి భద్రతల పరిరక్షణతోపాటు ప్రజల మనోభావాలను గౌరవించాలని సూచించారు. ఎక్కడైనా వివాదాస్పద పరిస్థితులు నెలకొంటే ప్రభుత్వ దృష్టికి తేవాలన్నారు. మహనీయుల ఆశయాల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదని మంత్రి స్పష్టం చేశారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ (వెల్ఫేర్) సబ్యసాచి ఘోష్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి, ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్, హైదరాబాద్ డీసీపీ-2 కాజల్, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కె.చంద్రారెడ్డి, ఏసీఎల్‌బీ జి. జితేందర్ రెడ్డి, ఎస్సీడీడీ వీసీ అండ్ ఎండీ (ఎఫఏసీ) హనుమంత్ నాయక్, ఎస్సీడీడీ డిప్యూటీ డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి, రామారావు, జీహెచఎంసీ అదనపు కమిషనర్ సంతోష్, ఎల్‌బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహాతో, ఎల్‌బీనగర్ సీపీ శ్రీనివాస్ యాదవ్, సైబరాబాద్ ఎస్‌బీ డీసీపీ వైవీఎస్ సుధీంద్ర, ఓఎస్డీ వై.జే.విజయ్ కుమార్ తదితరులతోపాటు ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు దొమ్మాటి సుదర్శన్‌బాబు, మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్, కళానిధి మాస్టర్ జీ, నల్ల సూర్యప్రకాశ్, సొసైటీ ఫర్ సోషల్ జస్టిస్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి జీటీ శేఖర్, ఆల్ ఇండియా ఎస్సీ/ఎస్టీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.నాను, జి.బి.శ్యామ్ రావు, డాక్టర్ అంబేద్కర్ అండ్ జగ్జీవన్ రామ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాల్, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వీకర్ సెక్షన్ అసోసియేషన్ (ఆదర్శ్‌నగర్) తాలూకా అనిల్, ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ కుర్మల్‌గూడ నాయకులు సంగం మహేష్, కుర్మ మహేందర్, రాపాక అశోక్ తదితర దళిత సంఘాల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
——————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *