మెరుపు తీగెలు

బుజ్జిగాడు నిద్రలేచాడు. లేచాడు అంటే లేవలేదు. బెడ్‌‌మీద పడుకొనే వున్నాడు. కళ్ళు తెరిచి వున్నాయి. ఎదురుగా అమ్మ ముఖం, నవ్వుతూ.

బుజ్జిగాడు నవ్వలేదు. ఆవలింత తియ్యలేదు. బద్దకంగా అటూయిటూ దొర్లలేదు. విప్పారిన కళ్ళతో చూశాడు. చూస్తూనేవున్నాడు. ‘ఏమిటమ్మా తల్లీ’ అని గోముగా నుదురుకు నుదురు ఆనించి ముక్కుకు ముక్కు రాస్తూ ముద్దు చేసింది అమ్మ. అలా చేసినప్పుడు చక్కిలిగిలితో మెలికలు తిరిగిపోయే బుజ్జిగాడు యిప్పుడు మాత్రం బిగదీసుకుపోయినట్టు అలా వుండిపోయాడు.

ఎప్పుడూ అమ్మ ముద్దుకు ముద్దు బాకీ తీర్చే బుజ్జిగాడు అడిగినా తిరిగి ముద్దు పెట్టలేదు. అదోలా వున్నాడు. ఏదోలా చూస్తున్నాడు. ఏమైందమ్మా అన్నట్టు కళ్ళతోనే ప్రశ్నించింది అమ్మ.

‘బడికి వెళ్ళవా బుజ్జీ’ అని మళ్ళీ అమ్మే అడిగింది. తేడా గ్రహించినట్టు నుదురుమీద పొట్టమీద అరచేతిని ఆనించి వొళ్ళు చూసింది. టెంపరేచర్ కూడా నార్మల్‌గానే వుంది.

‘మమ్మీలు ముద్దు చేస్తే అంతే…’ అన్నాడు అమ్మ వెనకాల చేరిన నాన్న, తనని ముద్దు చెయ్యడం లేదన్నట్టు అలిగి బుగ్గలు వేలేసినట్టు ముఖం పెట్టాడు. అంతలోనే ముఖం చిట్లించాడు. ఏదో వాసన… అన్నట్టు ముక్కుపుటాలు కదిలించాడు. ‘కంపు’ అన్నాడు. అమ్మ అప్పటికి యెరుకలోకి వచ్చి నిజమేనన్నట్టు ఆశ్చర్యంగా ఆలోచనగా తలాడించింది.

ఇంతలో నాయినమ్మ వచ్చింది. తన అనుభవం వల్లనేమో యిట్టే గ్రహించింది. ‘గుడ్డెట్టీసాడు’ అంది. ‘అందుకే పట్టుకోడి పెట్టాలా మంచం దిగడం లేదు’ అని బెడ్ షీట్‌‌తో సహా ముందుకు లాగింది. కదలకుండా ముందుకొచ్చాడు బుజ్జిగాడు. ఆవిడ అనుమానం నిజం చేస్తూ బెడ్ అంతా తడి… మరక… అమ్మకు ప్రేమంతా పోయి కోపం వచ్చింది. ‘రాస్కెల్’ అని తిట్టింది. ‘షిట్’ అన్నాడు నాన్న.

‘నడిచి నడిచి బంగురుతున్నావేం?’ అంది నాయనమ్మ. ‘వయసుకొచ్చిన కొద్దీ బయిసిమాలిపోతున్నాడు పిల్లాడు’ అని తిట్టింది. సిగ్గుతో కళ్ళు మూసుకున్నాడు బుజ్జిగాడు. మూసిన కళ్ళలోంచి చప్పున యిన్ని నీళ్ళు కారాయి. అమ్మ మనసు వేడితాకిన కర్పూరంలా కరిగింది. ‘కడుపు గుప్ మన్నప్పుడే లేచి వెళ్ళొచ్చు కదరా’ అంది హీన స్వరంతో. అమ్మ మాటలో మందలింపు కన్నా అనునయమే యెక్కువ వుంది.

ఏడుస్తూ బుజ్జిగాడు చెప్పాడు. ‘రోజూలాగే స్టమక్ నొప్పి పెట్టగానే వాష్‌రూమ్‌కు వెళదామని అనుకున్నానా…?’ అని ఆగాడు. ‘ఊ… నిన్నెవరయినా వెళ్ళొద్దని ఆపేసారా?’ నాయనమ్మ గట్టిగానే అడిగింది. అవునన్నట్టు కాదన్నట్టు గందరగోళంగా తలూపాడు బుజ్జిగాడు.

అమ్మా నాన్నా నాయినమ్మా అంతా అర్థంకానట్టు చూస్తుంటే, ‘మీరు చెప్పిందే చేశాను’ అన్నాడు బుజ్జిగాడు. తనది తప్పు లేదన్నట్టు.

‘మేమేం చెప్పాం?’ ఆగలేక వెంటనే అడిగింది నాయనమ్మ.

‘హచ్… వస్తే…’ అని ఆగి చూశాడు బుజ్జిగాడు. ‘ఊ… తుమ్మొస్తే, దానికేం తలుపా ద్వారబందమా? తుమ్మేయ్…’ అంది నాయనమ్మ. అది కాదన్నట్టు అడ్డంగా తలూపిన బుజ్జిగాడు ‘తుమ్మినప్పుడు లేవొద్దు, కొద్దిసేపు ఆగి ఆతర్వాత వెళ్ళమన్నారా?, ఆ… నేను ఆగాను, కాని … ఆగలేదు’ కళ్ళలో నీళ్ళూరుతుంటే బుజ్జిగాడికి మాటలు రాలేదు. వాడి చుట్టూ వున్నవాళ్ళకి కూడా!

-బమ్మిడి జగదీశ్వరరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *