హేత్వాభాష!-బమ్మిడి జగదీశ్వరరావు

·        మెరుపు తీగెలు

“నీకు తెలుసు కదా? మావాడ్ని దుంపల బళ్ళో కాదు, మొదట్నుంచీ ఇంగ్లీష్ మీడియంలోనే ప్రవేటు స్కూళ్ళల్లోనే చదివించాము” అన్నాడు మిత్రుడు. తలాడించాను నేను.

“ఒక్కడే చాలనుకున్నాం, బాగా చదివించాలని మాత్రం అనుకున్నాం” అంది మిత్రుడిభార్య. నవ్వుతూ చూశాను.

“మావాడి నర్సరీ యల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ దాక ఎమ్మెన్నార్‌లో తరువాత నలందాకి షిఫ్ట్ చేసేశాం” మిత్రుడు చెపుతుంటే, “హైస్కూల్ భాష్యంలో చదివాడు, అప్పుడు మీరొకసారి మాతో వచ్చారు, నాకు గుర్తుంది” అంది మిత్రుడి భార్య. నాకు గుర్తులేకపోయినా మొహమాటానికి “ఔనౌను” అన్నాను.

నా ఎదురుగా ప్లేటులో స్నాక్స్ వున్నాయి. సాసర్లో టీ వుంది. మాటల మధ్యలో నేను వున్నాను.

ఇంతలోనే అప్పుడే గుర్తుకువచ్చినట్టు “మావాడి ప్లే స్కూల్ కూడా ఆంగ్లో ఇండియన్స్ దగ్గరే, మీరప్పుడు యిక్కడ లేరు” అంది మిత్రుడి భార్య. అది సరే అన్నట్టు భార్యవంక చూసి “మావాడి ఇంటర్మీడియట్ చైతన్యలో, హాస్టల్లో పెట్టేశాం” అన్నాడు మిత్రుడు.

“డిగ్రీ కూడా ప్రవేటు కాలేజీ…” దంపతులిద్దరూ కూడబలుక్కొని చెప్పకముందే “తెల్సు తెల్సు నాకు తెలుసు” అన్నాను, ‘చాల్చాలు ఆపండి’ అన్నట్టు.

అయినా యిద్దరూ ఆగలేదు, “బియ్యీడీ కూడా విజయవాడ ప్రవేటు కాలేజీలో… అదేం పేరూ?” మర్చిపోయినందుకు మిత్రుడి భార్య నొచ్చుకుంది. “ఈ మధ్య మతిమరుపు వస్తోంది, మా యిద్దరికీ…” సంజాయిషీగా కాదు, సమస్యగా చెప్పాడు మిత్రుడు.

నేను వూపిరి పీల్చుకొని చల్లగా అయిన టీ అందుకున్నాను.

“మావాడి ఎడ్యుకేషన్‌కి చాలా ఖర్చయింది…” మళ్ళీ కూడబలుక్కొని చెపుతున్న భార్యాభర్తల్ని ఆపుతూ, “మొత్తానికి మీవాడికి వుద్యోగం వచ్చింది, అదీ సంతోషమైన విషయం” ముగింపు పలకాలని అన్నాను.

“మీరే మావాడికి మంచి సంబంధం చూడాలి” అంది మిత్రుడి భార్య. ‘నేను పెళ్ళిళ్ళ బ్రోకర్ని కాదే?’ అని అనలేకపోయాను. “మావాడికి సంబంధాలు తన్నుకుంటూ వస్తాయి, కాకపోతే మంచి కుటుంబం నుండి అయితే మంచిది” అన్నాడు మిత్రుడు. తలాడించాను.

చల్లగయిన టీని మంచి నీళ్ళలా గడగడా తాగేసి “యింతకీ మీవాడికి యెందులో జాబు…” నా ప్రశ్న పూర్తికాలేదు.

“గవర్నమెంటు జాబ్ కొట్టాడు, స్కూల్ అసిస్టెంట్” మిత్రుడి గొంతులో గర్వం. “జిల్లాలోనే వుంటాడు, పిల్లలతో పాటుగా సెలవులూ వుంటాయి. హేపీ వుద్యోగం.” మిత్రుడి భార్య చెప్పడం పూర్తికాలేదు. “సాఫ్ట్ వేర్ బూమ్ పోయింది, యెప్పుడు వుంటుందో వూడుతుందో తెలీని జాబులకంటే టీచర్ జాబులకే యెక్కువమంది ఆడపిల్లల తండ్రులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు” మిత్రుడి గొంతులోనూ అదే గర్వం.

“దుంపల బళ్ళోనా?” అని అడగలేకపోయాను. నాలోని ‘సంస్కార సన్నాసి’ నన్ను ఆపేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *