వాస్తవం, వ్యంగ్యం- ఒక కథనశిల్పి

‘చెమ్మ’ : వారాల ఆనంద్

రాచకొండ విశ్వనాథ శాస్త్రి రచనల్లో మనకు ముందుగా కనిపించేది జీవితం. జీవితాన్ని దాటి ఆయన రచనల్ని ఊహించలేం. ఆయన కథల్లో కనిపించే జీవితం మనచుట్టూ నడిచే మనుషుల మాటల్లో, వారి బాధల్లో, చిన్నచిన్న ఆశల్లో, బతుకు పోరాటాల్లో కనిపించే వాస్తవం. అందుకే రావిశాస్త్రి రచనల్లో వాస్తవికత, వ్యంగ్యం, సరళత, సాధికారికత విడదీయలేని లక్షణాలుగా వుంటాయి. ఆయన సృజించిన పాత్రలు మనకు చాలాకాలంగా తెలిసిన మనుషుల్లానే అనిపిస్తాయి. వారి భాష, ఆలోచనలు, బలహీనతలు, కోరికలు అన్నీ మనచుట్టూ వుండేవారివిగానే వుంటాయి. అంతే కాదు ఆయన వ్యంగ్యం ఏదో పైపైన నవ్వించే హాస్యం కాదు. ఒకనవ్వు మనుషుల్లోపల వుండే వ్యధను కోపాన్ని దాచుకున్న వ్యంగ్యం. వ్యక్తుల్లో వుండే కపటత్వం నుంచి సామాజిక వ్యవస్థలోని వైరుధ్యాల వరకు ఆయన వ్యంగ్యదృష్టి విస్తరిస్తుంది. అందుకే ఆయన వ్యంగ్యం పాఠకుడిని నవ్వించడంతో ఆగదు ఆ నవ్వు వెనుక ఉన్న వాస్తవాన్ని ఆలోచింపజేస్తుంది.

రాచకొండ భాషలో కనిపించే సరళత ఆయన సాహిత్య సృజనకు ప్రధాన బలం. తనకి భాష సాధనం కాదు అది పాత్రలను, పరిస్థితులను, జీవితాన్ని సహజంగా ధ్వనించే మాధ్యమం. అందుకే ఆయన వాక్యం పాఠకుడి చెవికి ఇంతకు ముందు ఎప్పుడో విన్నమాటలా అనిపిస్తుంది. ఆ సరళతలోనే ఆయన శైలి ఇమిడి వుంది. సాధికారికత ఆయన రచనలకున్న అంతరంగ బలం. ముఖ్యంగా అట్టడుగు, అణగారిన వర్గాల జీవితాలను చిత్రించేటప్పుడు ఆయనది బయటినుంచి చూసే ఉపరితల చూపుకాదు వారి జీవితాల లోపలికి వెళ్లి మాట్లాడేదృష్టి. వారి బాధకు, కోపానికి, ఆత్మగౌరవానికి ఆయన కథలో స్థానం లభిస్తుంది. ఆయన రచనలనిండా జీవితానుభవం వ్యక్తమవుతుంది.

రాచకొండ విశ్వనాథశాస్త్రి గొప్పతనం ఏమిటంటే వాస్తవాన్ని వాస్తవంగానే చూపిస్తూ, దానిలోని వైరుధ్యాలను వ్యంగ్యంతో వెలికితీసి, సరళమైన భాషలో చెప్పి, సామాన్యుడి జీవితానికి సాహిత్య గౌరవాన్ని కల్పించడం. అందుకే ఆయన రచనలు తమ కాలాన్నే కాదు  మన సమాజాన్ని మనమే మరోసారి అద్దంలో చూసుకునేలా  చేస్తాయి. అందుకే తెలుగుకథ, నవలాసాహిత్యంలో సామాజిక వాస్తవికతను కళాత్మకంగా, మానవ మనస్తత్వపు లోతులను తాత్త్విక దృష్టితో చిత్రించిన రచయితల్లో రాచకొండ విశ్వనాథశాస్త్రి విశిష్ట స్థానం పొందారు. ఆయన రచనలు చదివిన తర్వాత పాఠకుడికి కథ అయిపోదు. మనిషిని గురించిన అనేక ప్రశ్నలు అప్పుడే మొదలవుతాయి.

ఆయన కథల్లో ఎలాంటి పెద్ద సంచలనాలు ఉండవు. కథలో మలుపులేమో చాలా సహజంగా వస్తాయి. వాటిల్లో రచయితకాదు పాత్రలే కథను ముందుకు తీసుకెళ్తాయి. రచయితగా ఆయన  ఎక్కడా బలవంతంగా వ్యాఖ్యానం చేయడు.

రావిశాస్త్రి ఆరు సారాకథల్లో ‘సారా’ కేవలం మద్యపాన పదార్థం కాదు. అది పేదల జీవితాన్ని పట్టిపీడించే ఆర్థిక, సామాజిక వ్యవస్థకు ప్రతీక. సారాచుట్టూ తిరిగే మనుషుల జీవితాల్లోని దారిద్ర్యం, వ్యసనం, కుటుంబ విషాదం, దోపిడీ, అధికార యంత్రాంగం వంటి అంశాలను రావిశాస్త్రి గొప్ప వాస్తవికతతో ఆవిష్కరిస్తాడు. ఇందులో వ్యక్తి చేసే తప్పిదం వెనుక ఉన్న సామాజిక పరిస్థితులను కూడా ప్రశ్నించే దృష్టి కనిపిస్తుంది. ఇక ‘సారో కథలు’ల్లోనూ అట్టడుగు జీవితాలే కేంద్రంగా నిలుస్తాయి. రావిశాస్త్రి పాత్రలను ఉపరితలం నుండి పరిశీలించడు. వారిభాషలోనే, వారి అనుభవాల మధ్యనుంచే కథ చెబుతాడు. అందువల్ల పాత్రలు కాగితంపై సృష్టించిన కల్పిత వ్యక్తులుగా కాకుండా మనకు తెలిసిన మనుషులుగా అనిపిస్తాయి. వ్యంగ్యం ఆయన చేతిలో కేవలం నవ్వించే సాధనం కాదు. సామాజిక అసమానతను బట్టబయలు చేసే పదునైన ఆయుధం అనొచ్చు.

 

ఇక ‘అల్పజీవి’ నవల విషయానికి వస్తే అది రావిశాస్త్రి సృజనాత్మక ప్రపంచానికి మరింత విస్తృతమైన ప్రతినిధి.‘అల్పజీవి’ అనే పదమే ఈ నవలలోని కేంద్రభావాన్ని సూచిస్తుంది. వ్యక్తి తనకన్నా పెద్దవైన అనేక  వ్యవస్థల మధ్య ఎలా చిన్నవాడిగా, అసహాయుడిగా మారిపోతాడో నవల చూపిస్తుంది. మధ్యతరగతి జీవితంలోని భయాలు, ఆశలు, రాజీలు, ఉద్యోగ వ్యవస్థ, సామాజిక ఒత్తిళ్లు ఇందులో ప్రతిఫలిస్తాయి. అది వ్యక్తి అస్తిత్వ సంక్షోభానికి రూపకం. ఇందులో కథానాయకుడు నిర్దిష్ట వ్యక్తికాదు. స్వాతంత్ర్యానంతర భారతంలో మధ్యతరగతి మనిషికి అతను ప్రతినిధి. ఆర్థిక అస్థిరత, సామాజిక గౌరవం కోసం నిరంతర ఆరాటం, ఆత్మన్యూనత, నిర్ణయాల పట్ల సంకోచం ఇవి అతని వ్యక్తిగత లోపాలు కావు. సమాజం అతనిపై మోపిన అదృశ్య భారాలు. అల్పజీవిలో కథకన్నా కథనం విశేషమయింది. బాహ్య సంఘటనల కంటే అంతర్ముఖ సంభాషణలు ఎక్కువ ప్రాధాన్యం పొందుతాయి. నిశ్శబ్దం కూడా ఇక్కడ కథన పద్ధతిగా పనిచేస్తుంది. పాత్ర మాట్లాడనిచోట సరిగ్గా పాఠకుడు ఆలోచించడం ప్రారంభిస్తాడు. ఇదే రావిశాస్త్రి శిల్పం. ఈ పద్ధతిలో పాశ్చాత్య మనోవైజ్ఞానిక నవలల ప్రభావం కనిపించినా, ఆయన కథనస్వరం మాత్రం పూర్తిగా తెలుగు సామాజిక అనుభవంలోనే పాతుకుపోయి ఉంటుంది.

 

1922 జూలై 30న అనకాపల్లి సమీపంలోని తుమ్మపాల గ్రామంలో జన్మించిన ఆయన, తరువాత శ్రీకాకుళం, విశాఖ ప్రాంతాల సామాజిక జీవితాన్ని తన రచనలకు ప్రధాన భూమికగా చేసుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రంలో బి.ఏ. ఆనర్స్ చదివిన రావిశాస్త్రి, 1946లో మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. న్యాయవాదిగా తన వృత్తిజీవితాన్ని కొనసాగిస్తూ, సమాజంలోని వర్గ వైరుధ్యాలను, పేదలపై జరిగే దోపిడీని, న్యాయవ్యవస్థలోని సంక్లిష్టతలను దగ్గరగా గమనించారు. 1950లో స్వతంత్రంగా న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. ఆయన రచనల్లో ‘ఆరు సారా కథలు’, ‘ఆరు సారో కథలు’, ‘ఆరు చిత్రాలు’, ‘మరో ఆరు చిత్రాలు’, ‘బాకీ కథలు’, ‘ఋక్కులు’, ‘కలకంఠి’, ‘కథాసాగరం’ వంటి రచనలు ఆయన కథా ప్రతిభకు నిదర్శనాలు. విరసం (విప్లవ రచయితల సంఘం) వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. 1993 నవంబర్ 10న మరణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *