అలసిపోని నీ అపజయాల వాగు
అనునిత్యం పొంగిపొర్లుతుంటే
ఆగని నీ ప్రయత్నాల అలలు
అందులో ఎగిసెగిసి పడుతుంటే
అందమైన నీ విజయ సంగీతం
నీ చేతి గీతల బతుకు రాతను చెరిపేస్తూ
చరిత విను వీధుల్లో
శ్రావ్య గానమై వినిపిస్తుంది
నీ జీవితమే.. గాయాల గేయాల
స్ఫూర్తి సాహిత్యమై కొన్నితరాల
గుండెల్లో డోలనాలు చేస్తుంది..!
కట్టుకున్న భార్యే
ఎగతాళి చేసింది ఎడిసన్ ను.!
చివరికి ఏమయ్యింది…?
ఎన్నో ఎగతాళిల కన్నీటి
సంద్రపు లోతుల్ని చేదిస్తూనే…
అదిగో మన ఇంట్లోనే ‘బల్బు ‘
సజీవ సాక్ష్యమయ్యింది..!
ఎడిసన్ మౌనశిల్పం
పెద్ద శబ్దరత్నమై
జగతికి వెలుగయ్యింది..!
ఏడు పదుల వయసులో
సామాన్య గాంధీ పోరాటయానం
ఎన్నో లక్షల అవమానాల
గ్రహణాలను దాటేసింది
వేల సంవత్సరాలకు సరిపడా
అహింసా కావ్య వనంలో
ప్రేమ వెన్నెలను కురిపించింది
ప్రపంచ పటానికే ఉద్యమ దిక్సూచిగా
ఐన్ స్టీన్ జీవిత ఫిజిక్స్ కే
శాంతి నియమాలు నేర్పింది..!
అమ్మ కడుపులో నవమాసాల
పురిటి నొప్పుల బర్నింగ్..!
అది దాటాకే మన పుట్టుక
ఏడుపు మెరుపుల షైనింగ్..!
లాంగ్ పెయిన్ పెన్ను లోనే
జీవం ప్రాణమున్న పెయింటింగ్
జీవితం ఓ ట్వంటీ ట్వంటీ
బంతులు పరుగులే
అక్కడ మ్యాటర్
పాఠాలు అనుభవాలే
ఇక్కడ ఫ్యూచర్
వసంత కోయిల రాగాన్ని
ఏ యుద్ధం ఆపగలదు
ఏకాంత అడవిలో పుష్ప పరిమళాన్ని
ఏ స్వప్నం కప్పేయగలదు
పరిణామం సహజం
ఫలితం తాత్వికం
ప్రయత్నమే సత్యం
ఈ ప్లానెట్ పై నువ్వే ఓ స్టార్
ఇది నమ్మితే నువ్వే ఓ మాస్టర్
-ఫిజిక్స్ అరుణ్ కుమార్





