అక్కడ ఘనం.. ఇక్కడ భయం

– మజ్లిస్ భయంతోనే విమోచన దినం నిర్వహించడంలేదు
– బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫైర్
– బీజేపీ మహిళా మోర్చా ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : కర్ణాటక, మహారాష్ట్రల్లో తెలంగాణ విముక్తి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ఎంఐఎం భయంతో నిర్వహించడం లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించనున్న సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి అసెంబ్లీ ప్రాంగణంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు మంగళవారం నిర్వహించిన మహిళా శక్తి స్కూటీ ర్యాలీని ఆయన ప్రారంభించి ర్యాలీలో బైక్ నడిపారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ నిజాం సైన్యం, రజాకార్లు గ్రామాలపై పడి ప్రజల, హిందువుల ఆస్తులను లూటీ చేస్తూ జాతీయ జెండా ఎగరేసినవారిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపుతూ మహిళలను చిత్రహింసలకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దురాగతాలకు వ్యతిరేకంగా తెలంగాణ ఆడబిడ్డలు ధైర్యంగా పోరాడి తరిమికొట్టారని గుర్తుచేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జోక్యంతో సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రాంతానికి విముక్తి లభించి ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారని తెలిపారు. నాటి హైదరాబాద్ సంస్థానంలో ఉన్న నేటి మరాఠ్వాడా, కర్ణాటక ప్రాంతాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా హైదరాబాద్ ముక్తి దినోత్సవాలను నిర్వహిస్తున్నాయని, కానీ నిజాం పాలన ప్రధాన కేంద్రమైన హైదరాబాద్‌లోనే తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం దురదృష్టకరమని అన్నారు. అమరవీరుల ఆత్మబలిదానాలు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కొన్నేళ్లుగా అధికారికంగా హైదరాబాద్ ముక్తి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ఈ చారిత్రక వేడుకలకు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
నాటి త్యాగాలను నేటి తరానికి తెలపాలి : రామచందర్ రావు
హైదరాబాద్ విముక్తి, భారత యూనియన్‌లో విలీనం వెనుక ఉన్న త్యాగాలను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని దశాబ్దాలుగా డిమాండ్ ఉన్నా ఎంఐఎం భయం, ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగానే గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు దీనిని నిరాకరిస్తున్నాయని మండిపడ్డారు. మహిళా శక్తి స్కూటీ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రం దిశగా అడుగులు వేస్తున్న సమయంలో హైదరాబాద్‌ను ప్రత్యేక రాజ్యంగా ఉంచి పాకిస్థాన్‌తో కలపాలని నిజాం కుట్ర పన్నారని విమర్శించారు. నిజాం, రజాకార్ల పాలనలో తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా మహిళలు క్రూర హింసను ఎదుర్కొన్నారని రామచందర్ రావు తెలిపారు. తెలంగాణ బిడ్డలు ఎంతో ధైర్యంతో పోరాడారని, ఎందరో జాతీయవాదులు ప్రాణత్యాగం చేశారని, నిజాంకు వ్యతిరేకంగా గళమెత్తిన షోయబుల్లా ఖాన్‌ను సైతం హత్య చేశారని తెలిపారు. ప్రజల అసాధారణ ధైర్యం, త్యాగాలు చరిత్రలో నిలిచిపోయేవి అయినా గత ప్రభుత్వాలు ఆ వారసత్వాన్ని గౌరవించడంలో, వారి పోరాట గాథను సమాజానికి తెలియజేయడంలో విఫలమయ్యాయన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిల కృషితోనే కేంద్రం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నదని, తద్వారా ఈ ఉజ్వల చరిత్రకు సరైన గుర్తింపు దక్కిందని తెలిపారు. విమోచన సందేశాన్ని, చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మహిళా శక్తి స్కూటీ ర్యాలీని విజయవంతంగా నిర్వహించిన మహిళా మోర్చా బృందాన్ని, పాల్గొన్న ప్రతి ఒక్కరినీ రామచందర్ రావు అభినందించారు.
—————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *