ఘనంగా సారస్ మేలా ప్రారంభం  

– పల్లె ఉత్పత్తులకు పట్టం కట్టిన సారస్
– నగర మార్కెట్‌తో అనుసంధానం  
– 20కి పైగా రాష్ట్రాల నుంచి 200కు పైగా స్టాళ్లు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: నగరంలో గ్రామీణ భారతదేశపు కళలు, చేనేతలు, సంప్రదాయ రుచులు, మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులతో సారస్ మేలా బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఒకవైపు హస్త కళల చేతివృత్తులు, మరోవైపు తెలంగాణ సంప్రదాయ వంటకాలు, తిరునల్వేలి హల్వా, ఈశాన్య రాష్ట్రాల మోమోలు, ఇతర రాష్ట్రాల రుచులు, పేరిణి నృత్యం,  శివతాండవం వంటి తెలంగాణ నృత్యాలు, పల్లె పదాలు, జానపద పాటల మధ్య  మొదలైంది. ప్రారంభ సూచకంగా సెర్ప్ డైరెక్టర్లతో కలిసి సీఈఓ దివ్య దేవరాజన్ జ్యోతి ప్రజ్వలన చేసి  ప్రారంభించారు. ఐమాక్స్ థియేటర్ పక్కన ఉన్న హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో  18వ తేదీ వరకు జరిగే ఈ మేలాను  పంచాయతీరాజ్,  గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సెర్ప్ నిర్వహిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల గ్రామీణ మహిళలు, కళాకారులు, స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను నగర మార్కెట్‌కు అందుబాటులోకి తెచ్చే విధంగా సారస్ ఫెయిర్ కొనసాగుతోంది. ఈసారి 200కు పైగా స్టాళ్లలో చేనేతలు, హస్తకళలు, ఆహార ఉత్పత్తులు, హెర్బల్ ఉత్పత్తులు, గ్రామీణ తయారీ వస్తువులు, లైవ్ ఫుడ్ అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ నుంచి 95 స్టాళ్లు ఏర్పాటు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి 100కు పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. వివిధ ప్రభుత్వ, అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో మరో 43 స్టాళ్లు ఏర్పాటు చేశారు. పోచంపల్లి, గద్వాల, నారాయణపేట చేనేతలతో పాటు చెక్క బొమ్మలు, జూట్‌, లెదర్ బ్యాగులు, మట్టి వస్తువులు, బంజారా కళాకృతులు, ఎంబ్రాయిడరీ, పచ్చళ్లు, పిండి వంటలు, మిల్లెట్ ఆధారిత ఆహార ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. వివిధ రాష్ట్రాల ప్రత్యేక ఉత్పత్తులు ఒకే వేదికపై అందుబాటులో ఉన్నాయి. ఈ మేలా కేవలం కొనుగోలు, విక్రయాలకు పరిమితం కాకుండా గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యక్ష మార్కెట్ అనుభవాన్ని అందించే వేదికగా నిలుస్తోంది. వినియోగదారుల అభిరుచులు, ధరలు, ప్యాకేజింగ్, ఉత్పత్తుల నాణ్యతపై నేరుగా స్పందన తెలుసుకునే అవకాశం లభిస్తోంది. తద్వారా భవిష్యత్‌లో బల్క్ ఆర్డర్లు, మార్కెట్ లింకేజీలు, వ్యాపార అవకాశాలకు మార్గం ఏర్పడనుంది.మేళాలో ప్రతిరోజూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
 మొదటిరోజు శివతాండవం పేరిణి నృత్యం హైలెట్ గా నిలిచాయి. 12వ తేదీన బతుకమ్మ వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. మంత్రి సీతక్కతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు
గిరిజన ఆభరణాలతో సారిక ప్రత్యేక ఆకర్షణ
సారిక ముడావత్ (35) గిరిజన ఆభరణాల తయారీతో కనుమరుగవుతున్న కళారూపానికి జీవం పోస్తున్నారు. ఈ మేలాలో ప్రతి ఏడాది కనీసం రూ.లక్ష ఆదాయం ఆర్జిస్తున్నానని ఆమె తెలిపారు. గత నాలుగేళ్లుగా సారస్ మేళాలో పాల్గొంటున్న సారిక, పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పటికీ ప్రస్తుతం పూర్తిస్థాయిలో గిరిజన ఆభరణాల తయారీ, విక్రయాలపై దృష్టి సారించారు. ప్రభుత్వం కల్పిస్తున్న మార్కెటింగ్ అవకాశాలను వినియోగించుకుంటున్నారు. నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన స్వయం సహాయక సంఘం సభ్యురాలైన సారిక ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, పంచాయతీరాజ్ మంత్రి దనసరి అనసూయ సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.
 చెరియాల్ మాస్కులతో సంప్రదాయ కళకు ఆధునిక హంగులు
మంగా పసుల (40) చెరియాల్ మాస్కులు, వాల్ డెకార్ తయారు చేస్తున్నారు. కలప, చింతగింజల మిశ్రమంతో రూపొందించే ఈ కళాఖండాలు జానపద నాటక సంప్రదాయాలను ఆధునిక ఇంటీరియర్లకు చేరువ చేస్తున్నాయి. చెరియాల్ చిత్రకళా సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ప్రకాశవంతమైన రంగులు, కథనాత్మక రూపాలు, భావోద్వేగాలను పలికించే ముఖ కవళికలతో వీటిని తీర్చిదిద్దుతున్నారు. గిఫ్ట్‌గా ఇచ్చేందుకు అనువుగా చిన్న సైజు ఫ్రేమ్‌లను కూడా తయారు చేస్తున్నామని మంగా తెలిపారు.
గుజరాత్ నుంచి వచ్చి ఖడ్లీ ఉత్పత్తుల విక్రయం 
గుజరాత్‌కు చెందిన రంజన్ పర్మార్ (45) సారస్ మేళాలో చేతితో తయారు చేసిన ఖడ్లీ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. కుషన్ కవర్లు, బ్యాగులు, దుస్తులు తదితర అనేక రకాల ఉత్పత్తులు ఆమె స్టాల్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అని రంజన్ తెలిపారు. మేళా ద్వారా మంచి అమ్మకాలు సాధించి, జ్ఞాపకాలతో పాటు ఆదాయంతో స్వస్థలానికి తిరిగి వెళ్తామనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.
బాక్స్ ఐటమ్ 4: తెలంగాణ ఇకత్‌కు దేశవ్యాప్తంగా మార్కెట్ 
జనగామకు చెందిన రామలక్ష్మి మసురం (35) చేతితో తయారు చేసిన ఇకత్ వస్త్రాలను మేళాలో ప్రదర్శిస్తున్నారు. భర్త సహకారంతో దేశవ్యాప్తంగా జరిగే ఎక్స్‌పోల్లో పాల్గొంటూ తెలంగాణకు చెందిన హస్తకళా, చేనేత ఉత్పత్తులను వివిధ ప్రాంతాలకు పరిచయం చేస్తున్నారు. స్వచ్ఛమైన కాటన్ హ్యాండ్‌లూమ్, కొత్త డిజైన్లతో కూడిన సరసమైన ధరల ఉత్పత్తులు, ప్రింటెడ్ చీరలు, ప్రింటెడ్ తెల్ల చీరలు, బెడ్‌షీట్లు, టవల్స్, చీరలు, డ్రెస్ మెటీరియల్స్, బ్లౌజులు తదితర ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. స్టాల్ ఏర్పాటుకు ఎలాంటి రుసుము వసూలు చేయకపోవడంతో ఇది తమకు ఎంతో లాభదాయకమైన వ్యాపార అవకాశంగా మారిందని రామలక్ష్మి తెలిపారు.
—————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *