తెలంగాణ మాకు కీలకమైన రాష్ట్రం

– అధిష్ఠానం ప్రత్యేక దృష్టి పెట్టింది
– ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులకు రాష్ట్రమే కారణం
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

దిల్లీ, ప్రజాతంత్ర, జూన్ 1 : దక్షిణాదిలోనూ ఎన్డీయే ప్రభావం పెరుగుతోందని, రాబోయే రోజుల్లో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కార్యక్రమాలను జాతీయ అధ్యక్షుడు నితిన్ నబి రూపొందించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు తెలిపారు. దిల్లీలో అన్ని రాష్ట్రాల అధ్యక్షులు, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శులతో నబి దిల్లీలో సోమవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామచందర్‌రావు మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అనే అంశాలపై నితిన్ నబిన్ మార్గదర్శనం చేశారన్నారు. ఈరోజు జాతీయ పార్టీ దృష్టిలో తెలంగాణ ఒక ముఖ్యమైన రాష్ట్రంగా ఉందని, సంస్థాగతంగా కూడా బలంగా ఉందని, అందుకే పార్టీ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని దిల్లీలో తెలంగాణవాసులతో కలిసి మంగళవారం ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి నితిన్ నబిన్ హాజరవుతారన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన మేధావులు, విద్యార్థులు, న్యాయవాదులు తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు.

కేంద్రం నేరుగా ధాన్యం కొనదు

ధాన్యం కొనుగోళ్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కేంద్రంపై విమర్శలు, ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామని రామచందర్‌రావు అన్నారు. ఎంఎస్‌పీని నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వమే అయినా కొనుగోలు ప్రక్రియ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలి.. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన తర్వాతే కేంద్రం రీయింబర్స్‌మెంట్ చేస్తుంది అని స్పష్టం చేశారు. గత ఏడాది ఈ ఇబ్బందులు లేవని, ఈరోజు రైతులకు ఈ పరిస్థితి రావడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమేనన్నారు. ఈసారి ఎక్కువ పంట పండిందని చెబుతున్నారని, ఎంత పండినా ఎంత ధాన్యం పండింది, ఎంత కొనుగోలు చేయాలి అనే వివరాలు రాష్ట్రం కేంద్రానికి ముందుగానే తెలియజేయాలన్నారు. మార్చి 25న ప్రారంభం కావాల్సిన కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ 25న ప్రారంభించారని, ఆ కారణంగా రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు నెల కిందటే తీసుకొచ్చి రాశులుగా పోసి ఉంచాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో అకాల వర్షాలతో తడిసి మొలకెత్తే పరిస్థితి దాపురించిందన్నారు. రైతులు ఎంత పంట పండిస్తున్నారో కలెక్టర్లు, వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వానికి ముందుగానే సమాచారం తెలుసుకోవాలి.. ఎంత దిగుబడి వస్తుంది, మార్కెట్‌కు ఎంత ధాన్యం వస్తుంది అనే అంచనాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయి. అయినప్పటికీ తగిన ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. తమ పార్టీ నాయకులు రైతు గోస- బీజేపీ భరోసా చేపట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర వీడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది మిల్లర్లతో కుమ్మక్కై తక్కువ ధరలకు అమ్ముకునే పరిస్థితిని సృష్టించిందని ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని ఉన్న ధాన్యాన్ని వెంటనే తరలించాలన్నారు. మంత్రులు, అధికారులు వేర్వేరు లెక్కలు చెబుతున్నారంటూ కేవలం అబద్ధాల ప్రచారంతో గందరగోళం సృష్టించి రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని అన్నారు. కాగా, ఇటీవల మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కి వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలు, పోస్టర్లతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. కొన్ని పార్టీలు, కొన్ని శక్తులు బీజేపీలో అంతర్గత విభేదాలు ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై తాము ఇప్పటికే పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశామన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *