పీవీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

– విద్యార్థులకు కేటీఆర్ ఉద్బోధ‌

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18 : మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యార్థులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉద్బోధించారు. బేగంపేటలోని స్వామి రామానంద తీర్థ మెమోరియల్ స్కూల్‌ను గురువారం ఆయన సందర్శించి విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. అనంతరం తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ 16 భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన పీవీ నరసింహారావు దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోవాలి అని ఆకాంక్షించారు. రాష్ట్రంలో 2023లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రారంభించిన సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని, విద్యారంగంలో అనేక కార్యక్రమాలు చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. భవిష్యత్తులోనూ విద్యార్థుల సంక్షేమానికి దోహదపడే ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా అమలు చేస్తామని తెలిపారు.

 

పిల్లలతో గడిపే ప్రతి క్షణం ఆనందాన్ని ఇస్తుంది.. సమాజ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పోషకాహారం కూడా అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది అని పేర్కొన్నారు. స్వామి రామానంద తీర్థ మెమోరియల్ స్కూల్‌కు అవసరమైన అదనపు తరగతి గదులు, ఆధునిక లైబ్రరీ నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు అండగా నిలుస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను, పాఠశాల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ఎమ్మెల్సీ సురభి వాణిదేవి సేవలను ప్రశంసించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *