– పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18 : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి సీతక్క విమర్శించారు. సచివాలయంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావుతో కలిసి గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 2005లో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎంజీఎన్ఆర్ఈజీఎస్ గ్రామీణ పేదలకు జీవనాధారంగా నిలిచిందని, అలాంటి చట్టానికి తూట్లు పొడిచే విధంగా కేంద్రం చర్యలు తీసుకుంటోందని అన్నారు. వంద రోజుల ఉపాధి హక్కును కల్పించే చట్టాన్ని నిర్వీర్యం చేయడంతోపాటు పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించి దాని ఆత్మను, స్పూర్తిని బలహీనపరిచే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. వీబీజీ-రాంజీ పేరుతో కేంద్రం తీసుకొస్తున్న కొత్త విధానం పేదల ఉపాధి అవకాశాలను దెబ్బతీయడమే కాక రాష్ట్రాలపై అదనపు ఆర్థిక, పరిపాలనా భారం మోపే ప్రమాదం ఉందన్నారు. నూతన విధానాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో ఇప్పటికే తీర్మానం చేసినప్పటికీ జూలై 1 నుంచి అమలు చేయాలని కేంద్రం రాష్ట్రాలపై ఒత్తిడి తేవడం బాధాకరమన్నారు. ఈ అంశంపై సమగ్రంగా అధ్యయనం చేసి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని సీతక్క తెలిపారు. మంత్రులు ఉత్తమ్, తుమ్మల, వివేక్ వెంకటస్వామి, తాను సభ్యులుగా ఉన్న ఈ కమిటీ వివిధ రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలను పరిశీలించి, చర్చలు జరిపి తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాష్ట్రాలపై అదనపు భారం మోపకుండా, కూలీల హక్కులకు భంగం కలగకుండా ఏ మార్పులు తీసుకురావాలన్న దానిపై కేంద్రం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కూలీల సంఖ్య తగ్గేలా పలు సాంకేతిక అవరోధాలు సృష్టిస్తున్నారని, రోజుకు రెండుసార్లు ఆన్లైన్లో కూలీల ఫొటోలు క్యాప్చర్ చేయాలనే నిబంధన వల్ల అనేక ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తోందని, ప్రతి రోజూ సమీక్షలు నిర్వహిస్తూ గ్రామీణ కూలీలకు మరింత ఉపాధి కల్పించే చర్యలు చేపడుతోందని చెప్పారు. గత ఏడాది మొత్తం 7.5 కోట్ల పనిదినాలు కల్పించగా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు అదే స్థాయిలో 7.5 కోట్ల పనిదినాలు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. గ్రామీణ పేదల జీవనోపాధికి ఆధారమైన ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే చర్యలను కేంద్రం వెంటనే విరమించుకోవాలని సీతక్క డిమాండ్ చేశారు. దీనిపై కేంద్రానికి అధికారికంగా లేఖ రాస్తామని, ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిన అనంతరం వీబీజీ-రాంజీ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
జార్ఖండ్ మంత్రితో ఫోన్లో మాట్లాడిన రాష్ట్ర మంత్రి సీతక్క
వీబీజీ రామ్ జీ పథకం అమలులో తలెత్తుతున్న అంశాలపై మంత్రి సీతక్క జార్ఖండ్ పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దీపికా పాండే సింగ్తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా పథకం అమలుతో గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు, కార్మికులు, ఉపాధి హామీ పథకంపై ఆధారపడిన కుటుంబాలు ఎదుర్కొనే ఇబ్బందులపై మంత్రులిద్దరూ విస్తృతంగా చర్చించారు. ఈ పథకం వల్ల నష్టపోయే అవకాశం ఉన్న వర్గాల ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. పథకంలోని పలు నిబంధనలపై రాష్ట్రాలకు ఉన్న అభ్యంతరాలను సమగ్రంగా సేకరించి కేంద్రానికి తెలియజేయాలని నిర్ణయించారు. గ్రామీణ పేదల ప్రయోజనాలకు భంగం కలగకుండా తగిన మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరాలని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా, ఈ అంశంపై దేశంలోని ఇతర రాష్ట్రాలతోనూ చర్చించి ఉమ్మడి కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా పథకాన్ని అమలు చేయడం సముచితం కాదని అభిప్రాయపడ్డారు. గ్రామీణ పేదల హక్కులు, ఉపాధి అవకాశాల పరిరక్షణ కోసం అవసరమైతే కేంద్ర ప్రభుత్వానికి ఉమ్మడిగా నిరసన తెలియజేయాలని కూడా ఇద్దరు మంత్రులు నిర్ణయించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





