విమోచన దినాన్ని కనుమరుగు చేస్తున్న ప్రభుత్వం

– నాటి నిజాం పాలిత రాష్ట్రాల్లో విమోచన దినం పాటింపు
– మజ్లిస్ ఆదేశాలతో ఇక్కడి ప్రభుత్వాలు నిర్వహించడంలేదు
– బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: దేశమంతా 1947 ఆగస్టు 15న స్వాతంత్య్ర సంబరాలు జరుపుకుంటే నాటి హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ గడ్డ మాత్రం ఆ వేడుకల్లో పాల్గొనే పరిస్థితి లేకుండా నిజాం రాచరిక సంకెళ్లలో, రజాకార్ల ఆగడాలకు గురై మరో 13 నెలల పాటు నరకయాతన అనుభవించిందని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ గుర్తుచేశారు. నేటి యువతరానికి, జెన్-జీ, జెన్-ఆల్ఫా తరాలకు దేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందంటే ఆగస్టు 15 అని మాత్రమే తెలుసని, నాటి పరిస్థితుల్లో తెలంగాణ అందులో భాగస్వామి కాలేదన్న చేదు నిజాన్ని చాలామంది గ్రహించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన ఈ చారిత్రక ఘట్టాలు, రాజకీయ పరిస్థితులపై మాట్లాడారు. దేశం స్వతంత్రమైన వేళ హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో విలీనం చేయకుండా ఒక ప్రత్యేక దేశంగానో లేదా ఇస్లామిక్ రాజ్యంగానో మార్చాలని నిజాం కుట్రలు పన్నారని మండిపడ్డారు. ఖాసిం రజ్వీ నేతృత్వంలోని నిజాం ప్రైవేట్ సైన్యం రజాకార్లు దాదాపు 13 నెలల పాటు సాగించిన కిరాతక మారణకాండలో తెలంగాణ ప్రజలు తీవ్ర చిత్రహింసలు అనుభవించారని, ఈ చరిత్రను ఆనాటి కాంగ్రెస్ పార్టీ కాలగర్భంలో తొక్కివేసిందని ఆరోపించారు. ఉక్కు మనిపి సర్దార్ వల్లభాయ్ పటేల్ దృఢ సంకల్పంతో ముందుకొచ్చి దేశ కడుపులో ఏర్పడ ‘క్యాన్సర్ కణితి’ని శస్త్రచికిత్స చేసి తొలగించాల్సిందేనని పట్టుబట్టి 1948 సెప్టెంబర్ 13న ఆపరేషన్ పోలో’కు ఆదేశాలు ఇచ్చి భారత సైన్యాన్ని పంపించారని, సైన్యం ధాటికి తలొగ్గి సెప్టెంబర్ 17న నిజాం సైన్యం లొంగిపోయి సంస్థానాన్ని భారత్ లో విలీనం చేసింద‌ని స్పష్టం చేశారు. హైదరాబాద్ సంస్థాన పరిధిలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక జిల్లాల్లో సెప్టెంబర్ 17ను అక్కడి ప్రభత్వాలు అధికారికంగా విమోచన దినోత్సవంగా జరుపుతుంటే తెలంగాణలో మాత్రం ఎందుకు జరపడం లేదని ఆయన నిలదీశారు. అక్కడ లేని ఎంఐఎం ఇక్కడ ఉండటమే దీనికి ప్రధానా కారణమని ఆరోపించారు. మలిదశ ఉద్యమంలో నాటి రోశయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించకపోతే ప్రభుత్వాన్ని కుప్పకూలుస్తామని హెచ్చరించిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో తాను ప్రస్తావిస్తే ఊసరవెల్లిలా రంగులు మార్చి జరిపే ప్రసక్తే లేదు అని మడమ తిప్పారని విమర్శించారు. “కారు ప్రభుత్వం నడిపితే, స్టీరింగ్ నా చేతుల్లో ఉంది” అని ఆనాడు అసదుద్దీన్ ఒవైసీ మాటలను గుర్తుచేస్తూ.. మజ్లిస్ కు తొత్తులుగా మారి తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వారికే కొమ్ముకాశారని విరుచుకుపడ్డారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సైతం అదే బాటలో నడుస్తూ ‘ప్రజాపాలన’ పేరిట పేరిట విమోచన దినోత్సవ ప్రాధాన్యతను కనుమరుగు చేసి మైనారిటీల బుజ్జిగింపు రాజకీయాలు చేస్తున్నారని లక్ష్మణ్ విమర్శించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *