ప్రజల గడపకు పాలన: జిల్లాల వికేంద్రీకరణకు పదేళ్లు

“ఒకప్పుడు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే వంద కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సిన ప్రాంతాలు ఉన్నాయి. జిల్లా స్థాయి కార్యాలయాలు దూరంగా ఉండటం వల్ల రెవెన్యూ, సంక్షేమం, భూములు, విద్య, వైద్యం వంటి సమస్యల పరిష్కారానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత కలెక్టరేట్లు, జిల్లా స్థాయి కార్యాలయాలు ప్రజలకు భౌగోళికంగా చేరువయ్యాయి. జిల్లా అధికారులకు కూడా తమ పరిధిలోని సమస్యలను దగ్గరగా పర్యవేక్షించే అవకాశం పెరిగింది..”

జీడిపల్లి రాంరెడ్డి Ma, Mcj
ప్రిలాన్స్ జర్నలిస్ట్ , సిద్దిపేట,,
మొబైల్ : 9666680051

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు పది జిల్లాలే ఉండేవి. భౌగోళికంగా వాటి పరిధి చాలా విస్తృతం. మారుమూల ప్రాంతాల ప్రజలు జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే గంటల తరబడి ప్రయాణించాల్సి వచ్చేది. చిన్న ప్రభుత్వ పని కోసం కూడా ఒక రోజు సమయం వెచ్చించి, ప్రయాణ ఖర్చులు భరించి, జిల్లా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. అందుకే తెలంగాణ ఉద్యమకాలంలోనే ‘పాలన ప్రజలకు దగ్గరగా ఉండాలి.. అభివృద్ధి వికేంద్రీకరించాలి’ అనే ఆకాంక్ష బలంగా వినిపించింది. ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌తోపాటే అనేక ప్రాంతాల్లో ప్రత్యేక జిల్లాల ఉద్యమాలు కూడా సాగాయి. సిద్దిపేట, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, మంచిర్యాల, జనగామ, భూపాలపల్లి తదితర ప్రాంతాల్లో జిల్లా కేంద్రాలు దూరంగా ఉన్నాయంటూ ప్రజలు జిల్లా సాధన సమితులు, జేఏసీలుగా ఏర్పడి ఉద్యమించారు. ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు రావాలంటే, ప్రభుత్వ పాలన అందుబాటులోకి రావాలంటే చిన్న జిల్లాలు అవసరమనే భావన బలపడింది.

కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే సిద్దిపేటను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను అప్పటి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారు. 2001లో టీఆర్ఎస్ ఏర్పాటు తర్వాత ప్రత్యేక తెలంగాణతో పాటు పరిపాలనా వికేంద్రీకరణ అంశం మరింత ముందుకొచ్చింది. స్వరాష్ట్రం వస్తే కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేసుకొని ప్రజలకు పాలనను చేరువ చేస్తామని తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పలుమార్లు ప్రకటించారు.2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం పది జిల్లాలతో ఆవిర్భవించింది. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ తీసుకున్న అత్యంత ప్రభావవంతమైన పరిపాలనా నిర్ణయాల్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఒకటి. విస్తృతమైన కసరత్తు, ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, స్థానిక డిమాండ్ల అనంతరం 2016 అక్టోబర్ 11న దసరా సందర్భంగా 21 కొత్త జిల్లాలు ప్రారంభమయ్యాయి. దీంతో తెలంగాణలో జిల్లాల సంఖ్య 10 నుంచి 31కి పెరిగింది. అదే సమయంలో కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు కూడా ఏర్పడ్డాయి. ఆ తర్వాత 2019లో ములుగు, నారాయణపేట జిల్లాల ఏర్పాటుతో తెలంగాణ 33 జిల్లాల రాష్ట్రంగా మారింది.

ఇది కేవలం తెలంగాణ మ్యాప్‌ను మార్చిన కార్యక్రమం కాదు. ప్రభుత్వానికి–ప్రజలకు మధ్య ఉన్న భౌగోళిక దూరాన్ని తగ్గించాలన్న పరిపాలనా ఆలోచన. అధికారిక ప్రభుత్వ పత్రాలు కూడా ఈ పునర్వ్యవస్థీకరణ ప్రధాన లక్ష్యం మెరుగైన పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత సమర్థంగా చేరవేయడమేనని పేర్కొన్నాయి.ఒకప్పుడు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే వంద కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సిన ప్రాంతాలు ఉన్నాయి. జిల్లా స్థాయి కార్యాలయాలు దూరంగా ఉండటం వల్ల రెవెన్యూ, సంక్షేమం, భూములు, విద్య, వైద్యం వంటి సమస్యల పరిష్కారానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత కలెక్టరేట్లు, జిల్లా స్థాయి కార్యాలయాలు ప్రజలకు భౌగోళికంగా చేరువయ్యాయి. జిల్లా అధికారులకు కూడా తమ పరిధిలోని సమస్యలను దగ్గరగా పర్యవేక్షించే అవకాశం పెరిగింది.

పరిపాలనా వికేంద్రీకరణ అక్కడితో ఆగలేదు. రాష్ట్రంలో మండలాలు, రెవెన్యూ డివిజన్లు, గ్రామ పంచాయతీల సంఖ్య కూడా పెరిగింది. తెలంగాణ ప్రభుత్వ సామాజిక–ఆర్థిక నివేదిక ప్రకారం 2016 తర్వాత జిల్లాలు 10 నుంచి 31కి, అనంతరం 33కి పెరగడంతో పాటు మండలాలు, రెవెన్యూ డివిజన్లు, గ్రామ పంచాయతీల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. దీనివల్ల పాలనా యూనిట్లు చిన్నవై, స్థానిక పరిస్థితులపై అధికార యంత్రాంగానికి మరింత దృష్టి పెట్టే అవకాశం ఏర్పడింది.

భద్రాద్రి కొత్తగూడెం, కుమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు వంటి గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక జిల్లా గుర్తింపు రావడం కూడా ఈ ప్రక్రియలో కీలక పరిణామం. ఒకప్పుడు సుదూర జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన ప్రజలకు కలెక్టరేట్, రెవెన్యూ, పోలీసు, వైద్య, సంక్షేమ పరిపాలన దగ్గరగా వచ్చే అవకాశం ఏర్పడింది. కొత్త జిల్లా కేంద్రాల చుట్టూ ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లు, విద్యా–వైద్య మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందడం స్థానిక ఆర్థిక కార్యకలాపాలకు కూడా ఊతమిచ్చింది.

అయితే జిల్లాల సంఖ్య పెరగడమే వికేంద్రీకరణ విజయానికి పూర్తి కొలమానం కాదు. కొత్త జిల్లాల్లో ప్రభుత్వ శాఖలకు తగిన సిబ్బంది ఉన్నారా? జిల్లా స్థాయి కార్యాలయాలన్నీ పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయా? ప్రజల సమస్యలు నిజంగా వేగంగా పరిష్కారమవుతున్నాయా? గ్రామ, మండల స్థాయిలో నిర్ణయాధికారం పెరిగిందా? అనే అంశాలపై నిరంతర సమీక్ష అవసరం. వికేంద్రీకరణ ఒకసారి జిల్లాలను ఏర్పాటు చేయడంతో ముగిసే ప్రక్రియ కాదు; దానికి అవసరమైన సిబ్బంది, నిధులు, అధికారాలు కూడా కింది స్థాయికి చేరినప్పుడే దాని ప్రయోజనం పూర్తిగా ప్రజలకు అందుతుంది.

అయినా తెలంగాణ చరిత్రలో 2016 అక్టోబర్ 11 ఒక కీలక పరిపాలనా మలుపుగా నిలిచింది. ఉద్యమ కాలంలో ప్రత్యేక జిల్లాల కోసం వినిపించిన ప్రజల గొంతుకు రాష్ట్ర ఏర్పాటు తర్వాత పాలనా రూపం లభించింది. ఒకప్పుడు జిల్లా కోసం ధర్నాలు చేసిన ప్రాంతాల్లో కలెక్టరేట్లు ఏర్పడ్డాయి. దూరంగా కనిపించిన జిల్లా పాలన స్థానికంగా అందుబాటులోకి వచ్చింది.అందుకే తెలంగాణలో పది జిల్లాల నుంచి 33 జిల్లాలకు జరిగిన ప్రయాణాన్ని కేవలం సంఖ్యల మార్పుగా చూడలేం. అది తెలంగాణ ఉద్యమంలో వినిపించిన స్వయంపాలన, స్థానిక గుర్తింపు, ప్రజలకు చేరువైన పరిపాలన అనే ఆకాంక్షలకు ఒక రూపం. జిల్లా కోసం ఒకప్పుడు పోరాడిన ప్రజల గళం చివరకు తెలంగాణ పరిపాలనా పటంలో స్థానం సంపాదించింది. అదే ఈ పునర్వ్యవస్థీకరణలోని ప్రధాన అధ్యాయం—పాలన కేంద్రం నుంచి బయటకు వచ్చింది… ప్రజల గడప వైపు నడిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *