వోటు హక్కుకు ఉరి?

“ఎస్ఐఆర్‌ నిర్ణయ ప్రక్రియపై సుప్రీంకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తితో స్వతంత్ర విచారణ జరిపించాలి. అర్హుల పేర్ల పునరుద్ధరణకు గడువు విధించాలి. ప్రజా పరిశీలన పరిధిని కుదించిన నిబంధన సవరణను రద్దు చేసి, ఫామ్‌ 17సి సహా ఎన్నికల రికార్డులను తగిన గోప్యతా రక్షణలతో అందుబాటులోకి తేవాలి. కమిషనర్ల ఎంపికలో ప్రధాన న్యాయమూర్తి భాగస్వామ్యాన్ని పునరుద్ధరించి, సెక్షన్‌ 16లోని రక్షణ పరిధిని పునఃపరిశీలించాలి. ఎన్నికల రోజున వోటు వేసే అవకాశం ఎంత ముఖ్యమో, ఆ అవకాశం ఎందుకు దక్కలేదని అడిగిన పౌరుడికి సమాధానం లభించడం కూడా అంతే ముఖ్యం. ఆ సమాధానం చెప్పగల వ్యవస్థలోనే వోటు హక్కుకు భరోసా ఉంటుంది..”

వోటరు జాబితా సవరణ నుంచి తుది లెక్కింపు వరకు పారదర్శకతే ఎన్నికల విశ్వసనీయతకు ఆధారం

నోముల శ్రీనివాస్ రెడ్డి
అడ్వకేట్ · 9441357274

ప్రభుత్వాలను ఎన్నుకునే అధికారం పౌరుడి వోటుతోనే మొదలవుతుంది. ఆ వోటు వేయాలంటే అతని పేరు జాబితాలో ఉండాలి. వేసిన వోట్లు ఎన్ని, లెక్కించిన వోట్లు ఎన్ని అనే వివరాలను పరిశీలించే వీలుండాలి. ఈ రెండింటికీ బాధ్యత వహించే ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాలి. ప్రత్యేక సమగ్ర సవరణలో వోటర్ల పేర్ల తొలగింపు, ఫామ్‌ 17సి బహిర్గతంపై వివాదం, ఎన్నికల పత్రాల పరిశీలనను కుదించే నిబంధన, కమిషనర్ల నియామక విధానంలో మార్పులు ఈ బాధ్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఎన్నికల సంఘంపై ప్రజలకు విశ్వాసం ఉండాలంటే తన నిర్ణయాలకు ఆధారాలను చూపించి, వాటి పర్యవసానాలకు సమాధానం చెప్పాలి.

ఎస్ఐఆర్‌కు నిర్ణయాధారం ఏమిటి?

రాజ్యాంగంలోని అధికరణ 324 ప్రకారం వోటరు జాబితాల తయారీ, ఎన్నికల నిర్వహణపై పర్యవేక్షణ ఎన్నికల సంఘానికి అప్పగించిన బాధ్యత. కోట్లాది మంది పౌరులను ప్రభావితం చేసే ప్రత్యేక సమగ్ర సవరణకు ఏ స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు? ఏ ప్రమాణాలను ఆమోదించారు? ఆ నిర్ణయం దస్త్రాల్లో ఎలా నమోదైంది? సమాచార హక్కు కింద కోరిన వివరాలపై తలెత్తిన సందేహాలకు సంబంధిత ఉత్తర్వులు, నిర్ణయ దస్త్రాలను వెల్లడించడం ద్వారా సంఘం సమాధానం ఇవ్వాలి. కేంద్రం నుంచి వచ్చిన సూచనల ఆధారంగా అనుమానాస్పదంగా గుర్తించిన నమోదులను ఎలా పరిశీలించాలో క్షేత్రస్థాయి వోటరు నమోదు అధికారులకు స్పష్టత ఉండాలి. పౌరుడి వివరణ విని, ఆధారాలను పరిశీలించి, కారణాలతో నిర్ణయం తెలియజేసే బాధ్యత వారిదే.

పేరులో స్వల్ప అక్షరదోషం, తోబుట్టువుల సంఖ్య, తాతామామ్మలతో వయస్సు అంతరం వంటి అంశాలను ‘తార్కిక వైరుధ్యాలు’గా గుర్తించడంపై అభ్యంతరాలు వచ్చాయి. కంప్యూటర్‌ చూపించే వైరుధ్యాన్ని పరిశీలనకు సూచనగా తీసుకోవచ్చు. దాన్నే పౌరుడి అనర్హతకు ఆధారంగా తీసుకుంటే అర్హుల పేర్లూ గల్లంతయ్యే ప్రమాదం ఉంది. ఇరవై ఏళ్ల కిందటి కుటుంబ వోటరు రికార్డులు లేదా పుట్టిన తేదీ పత్రాలు వెతికి తెచ్చుకోవడం పేదలకు, వలస కుటుంబాలకు మరింత కష్టం. నోటీసు అందిందో లేదో నిర్ధారించాలి. అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ ఆధారాలను స్వీకరించాలి. పేరు తొలగిస్తే కారణం ఏమిటో, దానిపై ఎక్కడ అప్పీలు చేయాలో పౌరుడికి అర్థమయ్యే భాషలో తెలియజేయాలి.

పశ్చిమ బెంగాల్‌లో ఎస్ఐఆర్‌ పరిశీలన అనంతరం సుమారు 27 లక్షల మంది పేర్లు తొలగించబడినట్లు వచ్చిన సమాచారం ఈ సమస్య తీవ్రతను తెలియజేస్తున్నది. అప్పీళ్లను విచారించేందుకు ఏర్పాటైన ట్రైబ్యునళ్లు సైతం నోటీసుల జారీలో డిజిటల్‌ వ్యవస్థ లోపాలను గుర్తించాయి. పోలింగ్‌ ముగిశాక అప్పీలు నెగ్గిన పౌరుడు జాబితాలో తన పేరును తిరిగి పొందవచ్చు. ఆ ఎన్నికలో వోటు వేసే అవకాశం మాత్రం తిరిగి రాదు. అందుకే తొలగింపుల సంఖ్యతో పాటు ఎన్ని అప్పీళ్లు వచ్చాయి, ఎన్ని పరిష్కరించారు, ఎన్ని పేర్లు పునరుద్ధరించారు అనే వివరాలను ఎన్నికలకు ముందే వెల్లడించాలి.

పేరు పునరుద్ధరణకు స్పష్టమైన మార్గం

గతంలో వోటరుగా నమోదైన వ్యక్తి పేరు జాబితా నుంచి తప్పిపోయినప్పుడు, కొత్త నమోదుకు ఉద్దేశించిన ఫామ్‌–6లో తొలిసారి నమోదు చేసుకుంటున్నట్లు ప్రకటించాల్సి వస్తే చట్టపరమైన సందిగ్ధత ఏర్పడుతుంది. తెలిసి తప్పుడు ప్రకటన చేస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్‌ 31 కింద శిక్షకు అవకాశం ఉన్నందున, పునరుద్ధరణకు స్పష్టమైన ప్రక్రియ అవసరం. నవంబర్‌ 6న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, దిల్లీ సహా ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ముసాయిదా జాబితా నుంచి గైర్హాజరు, చిరునామా మార్పు, మరణం లేదా నకిలీ నమోదు కారణాలతో తప్పిపోయినవారికి గణన పత్రం సమర్పించే మరో అవకాశం ఇచ్చారు. ఇతర ప్రాంతాల్లో ఇదే సమస్య ఎదుర్కొంటున్న అర్హులకూ తగిన మార్గాన్ని ప్రకటించాలి. సాధ్యమైనచోట పాత ఈపీఐసీ నంబరుతోనే పేరు పునరుద్ధరించాలి.

ఫామ్‌ 17సి ప్రజలకు ఎందుకు అందుబాటులో ఉండాలి?

2024 సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్‌ రోజు ప్రకటించిన ప్రాథమిక శాతాలకు, తర్వాత విడుదల చేసిన తుది గణాంకాలకు మధ్య వ్యత్యాసంపై ప్రశ్నలు వచ్చాయి. ఆ వ్యత్యాసాన్ని పరిశీలించాలంటే ప్రతి పోలింగ్‌ కేంద్రంలో నమోదైన వోట్ల సంఖ్య అందుబాటులో ఉండాలి. ఈ లెక్క ఫామ్‌ 17సి మొదటి భాగంలో నమోదవుతుంది. నిబంధన 49ఎస్‌ ప్రకారం పోలింగ్‌ ముగిశాక ప్రిసైడింగ్‌ అధికారి దాని ధ్రువీకృత ప్రతిని అభ్యర్థుల పోలింగ్‌ ఏజెంట్లకు ఇస్తారు. ఆ ప్రతులను అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టాలని ఏడీఆర్‌ సుప్రీంకోర్టును కోరింది. బూత్‌వారీ లెక్కలను నియోజకవర్గ మొత్తం లెక్కతో పోల్చగలిగితే, గణాంకాల్లో మార్పు ఎక్కడ జరిగిందో ప్రజలు పరిశీలించగలరు.

ఫామ్‌ 17సి ప్రతులను ఆన్‌లైన్‌లో పెడితే వాటిని మార్చి తప్పుడు ప్రచారం చేయవచ్చనే అభ్యంతరానికి అధికారిక ధ్రువీకరణతో సమాధానం ఇవ్వవచ్చు. తొలి దశలో నియోజకవర్గాల వారీగా ధ్రువీకరించిన మొత్తం వోట్ల సంఖ్యను, తర్వాత పోలింగ్‌ కేంద్రాల వారీగా పత్రాలను ప్రచురించవచ్చు. ప్రాథమిక గణాంకాలను ఎప్పుడు సేకరించారు, తుది లెక్కకు ఏ సమాచారం తర్వాత చేరిందో కూడా తెలియజేయాలి. పోలింగ్‌ శాతం ఒక్కటే వెల్లడిస్తే పౌరుడికి మొత్తం వోట్ల లెక్కను సరిచూసే అవకాశం పరిమితమవుతుంది. ఎంతమంది వోటర్లు నమోదయ్యారు, వారిలో ఎంతమంది వోటు వేశారు అనే రెండు సంఖ్యలూ అందుబాటులో ఉండాలి.

ప్రజా పరిశీలనకు కుదించిన పరిధి

హర్యానా ఎన్నికల అనంతరం ఎన్నికల పత్రాల వెల్లడిపై పంజాబ్‌, హర్యానా హైకోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో, కేంద్రం 2024 డిసెంబర్‌ 20న ఎన్నికల నిర్వహణ నిబంధన 93(2)(ఎ)ను సవరించింది. ప్రజా పరిశీలనకు అందుబాటులో ఉండే పత్రాలను నియమాల్లో ప్రత్యేకంగా పేర్కొన్న వాటికి పరిమితం చేసే పదాలను చేర్చింది. సీసీటీవీ దృశ్యాలు, ప్రిసైడింగ్‌ అధికారుల డైరీలు వంటి రికార్డులను కోరితే ఆ మార్పు అడ్డంకిగా మారుతుందన్నది విమర్శ. వోటు రహస్యాన్ని, వ్యక్తిగత గోప్యతను కాపాడుతూ ఏ రికార్డును ఏ పద్ధతిలో పరిశీలించవచ్చో స్పష్టమైన నియమాలు పెట్టాలి. ఎన్నికల నిర్వహణపై సందేహం వచ్చినప్పుడు దాన్ని నివృత్తి చేయగల రికార్డులు ప్రజలకు అందుబాటులో ఉండాలి.

నియామకంలో స్వతంత్రత, నిర్ణయాల్లో జవాబుదారీతనం

అనూప్‌ బరన్‌వాల్‌ కేసులో 2023లో సుప్రీంకోర్టు, పార్లమెంటు చట్టం చేసే వరకు ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ సిఫారసు మేరకు ఎన్నికల కమిషనర్లను నియమించాలని తీర్పునిచ్చింది. అదే ఏడాది వచ్చిన చట్టం ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ప్రధాని నామినేట్‌ చేసే కేంద్ర కేబినెట్‌ మంత్రిని చేర్చింది. దాంతో ముగ్గురు సభ్యుల ఎంపిక కమిటీలో ప్రభుత్వ పక్షానికి రెండు స్థానాలు లభించాయి. అదే చట్టంలోని సెక్షన్‌ 16 అధికారిక విధుల నిర్వహణకు సంబంధించిన చర్యలపై కమిషనర్లకు వ్యక్తిగత సివిల్‌, క్రిమినల్‌ వ్యాజ్యాల నుంచి రక్షణ ఇస్తుంది. ఆ రక్షణ పరిధి, నియామక కమిటీ కూర్పు ఎన్నికల సంఘం జవాబుదారీతనాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో పార్లమెంటు సమీక్షించాలి.

ఎస్ఐఆర్‌ నిర్ణయ ప్రక్రియపై సుప్రీంకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తితో స్వతంత్ర విచారణ జరిపించాలి. అర్హుల పేర్ల పునరుద్ధరణకు గడువు విధించాలి. ప్రజా పరిశీలన పరిధిని కుదించిన నిబంధన సవరణను రద్దు చేసి, ఫామ్‌ 17సి సహా ఎన్నికల రికార్డులను తగిన గోప్యతా రక్షణలతో అందుబాటులోకి తేవాలి. కమిషనర్ల ఎంపికలో ప్రధాన న్యాయమూర్తి భాగస్వామ్యాన్ని పునరుద్ధరించి, సెక్షన్‌ 16లోని రక్షణ పరిధిని పునఃపరిశీలించాలి. ఎన్నికల రోజున వోటు వేసే అవకాశం ఎంత ముఖ్యమో, ఆ అవకాశం ఎందుకు దక్కలేదని అడిగిన పౌరుడికి సమాధానం లభించడం కూడా అంతే ముఖ్యం. ఆ సమాధానం చెప్పగల వ్యవస్థలోనే వోటు హక్కుకు భరోసా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *