రాష్ట్రానికి కేంద్రం శుభవార్త

– 8 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల బియ్యం కొనుగోలుకు ఆమోదం

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జులై 22: రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం భుభవార్త తెలిపింది. రాష్ట్రంలో రబీ సీజన్‌కు సంబంధించి అదనంగా వడ్ల కొనుగోలు చేసేందుకు కేంద్రం గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇప్పటికే ఉన్న కొనుగోలు లక్ష్యానికి అదనంగా 8 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో రైతులకు పెద్ద ఊరట లభించనుంది. కేంద్ర ప్రభుత్వం సవరించిన వరి కొనుగోలు అంచనాను బియ్యం రూపంలో 43 లక్షల మెట్రిక్‌ ‌టన్నులుగా నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా తెలంగాణలో రైతులు పండించిన ధాన్యానికి మరింత మార్కెట్‌ ‌భరోసా లభించనుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా వాహనాల స్థాన నిర్దారణ వ్యవస్థ అమలుపై కూడా కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. 2026 సెప్టెంబర్‌ 30 ‌నాటికి రాష్ట్రంలోని అన్ని అర్హత గల వాహనాల్లో వీఎల్టీఎస్‌ ‌వ్యవస్థను పూర్తిగా అమలు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ వ్యవస్థ ద్వారా వాహనాల కదలికలను రియల్‌ ‌టైమ్‌లో పర్యవేక్షించే అవకాశం ఉండటంతో భద్రతా ప్రమాణాలు మరింత మెరుగుపడనున్నాయి.  అంశాలపై పార్లమెంట్‌లో కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ‌కలిశారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వడ్ల కొనుగోలు అంచనాను పెంచినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రబీ సీజన్‌లో రైతులు పండించిన ధాన్యానికి సరైన మద్దతు ధరతో కొనుగోలు జరిగేలా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వ్యవసాయ రంగానికి ఊతమివ్వనుంది. అదనపు కొనుగోళ్లతో రైతులకు ఆర్థిక భరోసా పెరగడంతో పాటు రాష్ట్రంలో ధాన్యం సేకరణ పక్రియ మరింత సాఫీగా సాగేందుకు అవకాశం ఏర్పడింది.

రైతుల ప్రయోజనాల మే ఈ నిర్ణ‌యం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

న్యూదిల్లీ : రాష్ట్రం నుంచి బియ్యం సేకరణను మరో 8 లక్షల మెట్రిక్ టన్నులు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతుల మేలు కోసం, బీజేపీ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకోవడం సంతోషకరమన్నారు. ఖరీఫ్ సీజన్ 2025-26కు సంబంధించి సీజన్ ప్రారంభానికి ముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమక్షంలో తెలంగాణ నుంచి 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం (52 లక్షల మెట్రిక్ టన్నుల వరి) సేకరించాలని సంయుక్తంగా నిర్ణయం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఈసారి ధాన్యం ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకుని రా|ష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఈనెల 8న కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమై బియ్యం సేకరణ పరిమాణాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశామని ఆయన తెలిపారు. తమ విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం బియ్యం సేకరణ లక్ష్యాన్ని 35 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 43 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నదన్నారు. తెలంగాణ రైతుల పరిస్థితులను అర్థం చేసుకుని బియ్యం సేకరణ పెంపు నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి కిషన్‌రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. తమ విజ్ఞప్తికి వెంటనే స్పందించి సానుకూల నిర్ణయం తీసుకునేలా సహకరించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కాగా, తెలంగాణ నుంచి బియ్యం సేకరణను 43 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచిన కేంద్ర నిర్ణయం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తమ పార్టీ ప్రజాప్రతినిధులు చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి ఈ కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రైతులు, ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *