న్యాయ‌వాదుల హ‌క్కుల కోసం ప‌నిచేస్తా

– న‌ల్ల‌గొండ బార్ అసోసియేష‌న్ అభివృద్ధికి కృషి చేస్తా
– బార్ కౌన్సిల్ స‌భ్యుడు సామ‌ల రాంరెడ్డి

న‌ల్ల‌గొండ‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 22: ఉమ్మడి నల్లగొండ జిల్లా వాస్తవ్యుడిగా నల్లగొండ బార్ అసోసియేషన్ అభివృద్ధికి తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని తెలంగాణ బార్ కౌన్సిల్ నూతన సభ్యుడు సామల రాంరెడ్డి అన్నారు.తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికైన అనంతరం తొలిసారిగా బుధవారం నల్లగొండ బార్ అసోసియేషన్‌కు విచ్చేసిన సందర్భంగా వారికి నల్లగొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి, గజమాలతో,శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్వకేట్ ఆకవరపు సతీష్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు సామల రాంరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నిక కావడానికి నల్లగొండ బార్ సభ్యులు అందించిన సహకారం వెలకట్టలేనిది అన్నారు. బార్ కౌన్సిల్ సభ్యునిగా న్యాయవాదుల సంక్షేమం కోసం,వృత్తి అభివృద్ధి, న్యాయ సేవల బలోపేతం కోసం క్రియాశీలకంగా పనిచేస్తానన్నారు. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయవాదుల సమస్యలను బార్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. నల్లగొండ బార్ అసోసియేషన్‌కు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధి, యువ న్యాయవాదులకు శిక్షణా కార్యక్రమాలు,లీగల్ ఎడ్యుకేషన్ సెమినార్లు, న్యాయవాదుల సంక్షేమ పథకాల అమలు, గ్రంథాలయ అభివృద్ధి, డిజిటల్ సౌకర్యాల కల్పన, మహిళా న్యాయవాదుల వృత్తి అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకునేలా బార్ కౌన్సిల్‌లో తన వంతు కృషి చేస్తానన్నారు.అదేవిధంగా నల్లగొండ బార్ అసోసియేషన్ ప్రతిష్ఠను మరింత పెంచేందుకు, జిల్లా న్యాయవాదులందరికీ అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి వారధిగా పనిచేస్తానని,బార్ అసోసియేషన్‌తో సమన్వయం చేసుకుంటూ ప్రతి అంశంలో సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.న్యాయవాదుల గౌరవం, స్వేచ్ఛ‌, వృత్తి విలువలను పరిరక్షించడంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.న్యాయవాదులపై ఎక్కడ అన్యాయం జరిగినా,వారి వృత్తి హక్కులకు భంగం కలిగినా బార్ కౌన్సిల్ తరఫున బలంగా స్పందిస్తానని చెప్పారు.న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించడంలో న్యాయవాదుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొంటూ, సేవా భావంతో పనిచేసే న్యాయవాదులకు బార్ కౌన్సిల్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. నల్లగొండ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.అశోక్ కుమార్ మాట్లాడుతూ, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన న్యాయవాది తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నిక కావడం గర్వకారణమన్నారు. సామల రాంరెడ్డి అనుభవం,సేవా దృక్పథం న్యాయవాదులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నల్లగొండ బార్ అసోసియేషన్ అభివృద్ధికి అవసరమైన నిధులు, మౌలిక వసతులు, న్యాయవాదుల సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ బార్ కౌన్సిల్ పూర్తి సహకారం అందించాలని కోరారు. భవిష్యత్తులో తెలంగాణ బార్ కౌన్సిల్ మరియు నల్లగొండ బార్ అసోసియేషన్ మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాలని, జిల్లా న్యాయవాదుల సమస్యల పరిష్కారంలో సామల రాంరెడ్డి కీలక పాత్ర పోషిస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పజ్జూరి స్వామి గౌడ్,నూకల సంధ్యారాణి, జాయింట్ సెక్రెటరీ అమరావతి,కార్యవర్గ సభ్యులు జనిగల రాములు,జి.కిషోర్, స్వామి దాస్, సీనియర్ న్యాయవాదులు అక్కినపల్లి మురళీధర్ రావు,రామచంద్ర రావు, జవహర్లాల్, జి మోహన్, వెంకట్రాంరెడ్డి, అనంతుల శంకరయ్య,మరియు జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *