– రాష్ట్ర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణలో అందరి భాగస్వామ్యం
– ‘గ్రీన్’ అంటే ఖరీదైనదనే భావన మారాలి
– ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వార్షికోత్సవంలో ఉప ముఖ్యమంత్రి భట్టి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 31 : తెలంగాణ నవ యువ రాష్ట్రమైనప్పటికీ అత్యంత ఉన్నతమైన ఆశయాలు, స్పష్టమైన పర్యావరణ-పారిశ్రామిక లక్ష్యాలతో ముందుకు సాగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ 25 సంవత్సరాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో సోమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రాన్ని కేవలం దేశంలోని ఇతర రాష్ట్రాలతోనే కాక కొరియా, జపాన్ వంటి అత్యంత అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలతో పోటీపడేలా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆయన ప్రకటించారు. తెలంగాణను ఆర్థికంగా, పారిశ్రామికంగా, సుస్థిర గ్రీన్ టెక్నాలజీలో ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు చేపడుతున్న ఈ ప్రయాణంలో పారిశ్రామికవేత్తలు, నిపుణులు, ప్రజలందరూ భాగస్వాములై తమ వంతు సహకారాన్ని అందించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను, పర్యావరణ అనుకూల పరిశ్రమలను ఆకర్షించడమే లక్ష్యంగా ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ పేరుతో ఒక బృహత్తర గ్లోబల్ సమ్మిట్‌ను డిసెంబర్ 7, 8 9 తేదీలలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రపంచస్థాయి పెట్టుబడిదారులు, పారిశ్రామిక దిగ్గజాలు, సుస్థిర నిర్మాణ రంగానికి చెందిన నిపుణులు ఈ సదస్సులో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. పర్యావరణహిత నిర్మాణాలు కేవలం ఖరీదైన భవనాలు, విలాసవంతమైన అపార్టుమెంట్లకే పరిమితం కాకుండా సామాన్యుల ఇళ్లు, ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు, గృహ నిర్మాణాల్లోనూ భాగం కావాలని పిలుపునిచ్చారు. ‘గ్రీన’ అంటే ఖరీదైనదనే అపోహ మారాలని, సుస్థిర నిర్మాణాలు సమాజంలోని అందరికీ అందుబాటులోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు ఇప్పటివరకు ఎన్ని ఇళ్లు, కార్యాలయాలు, పరిశ్రమలు నిర్మించామన్న దానిపైనే ప్రధానంగా దృష్టి పెట్టేవారమని, కానీ ఇకపై ఏం నిర్మిస్తున్నాం.. భవిష్యత్ తరాలపై దాని ప్రభావం ఏమిటి అనే ప్రశ్నలు వేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒక భవనం కేవలం కాంక్రీట్, ఉక్కుతో కట్టిన కట్టడం కాదు.. అది దశాబ్దాలపాటు విద్యుత్, నీటిని వినియోగిస్తూ, వ్యర్థాలను ఉత్పత్తి చేస్తూ ప్రజల జీవన విధానాన్ని ప్రభావితం చేస్తుంది అని చెప్పారు. అందువల్ల ఆర్కిటెక్ట్, ఇంజనీర్ తీసుకునే ప్రతి నిర్ణయం రాబోయే అనేక దశాబ్దాలకు పర్యావరణ నిర్ణయంగా మారుతుందన్నరు. గ్రీన్ బిల్డింగ్స్ అభివృద్ధికి అదనంగా చేర్చే ఫ్యాషన్ అంశం కాదని, మొదటి నుంచే సరైన పద్ధతిలో నిర్మించడమే దాని లక్ష్యమని స్పష్టం చేశారు. తక్కువ శీతలీకరణ అవసరమయ్యేలా భవనాలను రూపొందించడం, సహజ కాంతిని, నీటిని, విద్యుత్‌ను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా పర్యావరణంపై, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై భారాన్ని తగ్గించవచ్చన్నారు. అత్యంత చౌక అయిన విద్యుత్ యూనిట్ అంటే మనం ఉత్పత్తి చేయాల్సిన అవసరం లేని విద్యుత్ యూనిట్ అని ఆయన అభివర్ణించారు.
స్వచ్ఛమైన విద్యుత్ వైపు తెలంగాణ అడుగులు
రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న నగరాలు, పరిశ్రమలు, డేటా సెంటర్ల అవసరాలకు తగినట్లుగా సౌర, పవన, హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తిపై ప్రభుత్వం దృష్టిసారించినట్లు చెప్పారు. సుస్థిర మౌలిక వసతుల ప్రయోజనాలు హైదరాబాద్‌కే పరిమితం కాకుండా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు కూడా చేరాలని ఆకాంక్షించారు. సరిగ్గా డిజైన్ చేయని భవనం ప్రారంభంలో చౌకగా కనిపించినా, భవిష్యత్తులో అధిక విద్యుత్, నీటి బిల్లుల రూపంలో మూల్యం చెల్లించాల్సి వస్తుందని, కాబట్టి భవనం జీవితకాల నిర్వహణ వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. విద్యుత్ ఆదా చేయడం అంటే విద్యుత్ ఉత్పత్తి అవసరాన్ని తగ్గించడమేనని గుర్తుచేశారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్పిటల్స్, సామూహిక గృహ నిర్మాణాల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయడానికి ఐజీబీసీతో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. సుస్థిర నిర్మాణాలను విస్తృత స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వం, పరిశ్రమలు, ఐజీబీసీ¾, విద్యా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





