‘టవర్స్‌’తో నెరవేరుతున్న సొంతింటి కల

– 16 నియోజకవర్గాల్లో 7340 ఫ్లాట్ల కేటాయింపు
– నాలుగు రోజులపాటు కొనసాగిన లాటరీ ప్రక్రియ
– పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎంపిక

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 31 : ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న అల్పాదాయ వర్గాల సొంత ఇంటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌లో 7,340 మందికి ఇండ్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి అయ్యింది. నగరంలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు రోజులపాటు నిర్వహించిన లాటరీ ప్రక్రియ సోమవారం ముగిసింది. రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగస్టు 28న లాటరీ ద్వారా ఇండ్ల కేటాయింపు ప్రక్రియను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కంటోన్మెంట్ నియోజకవర్గంలో మినహాయించి మిగిలిన 15 నియోజకవర్గాల్లో 480 ఇండ్ల చొప్పున కేటాయించారు. కంటోన్మెంట్ పరిథిలో తొలి విడతలో 140 ఇండ్లను మాత్రమే నిర్మిస్తున్నందున ఆ సంఖ్యలోనే ఇండ్లను కేటాయించారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న వారికే ఇండ్లు కేటాయించాలన్న ఉద్దేశంతో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో పైలట్ ప్రాజెక్టులను చేపట్టి హౌసింగ్ బోర్డు ద్వారా దరఖాస్తులను స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇలా అందుబాటులో ఉన్న స్థలాల్లో ప్రతిపాదించిన మొత్తం 7,340 ఇండ్లకు 60,720మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రాథమిక పరిశీలనలో అర్హులైన వారి పేర్లతో పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, బహిరంగంగా లాటరీ నిర్వహించి ఇండ్లను కేటాయించారు. లాటరీ ప్రక్రియపై దరఖాస్తుదారుల్లో సంతృప్తి వ్యక్తం కాగా లాటరీ ద్వారా ఇండ్లు పొందిన కుటుంబాల్లో పండగ సీజన్ మరింత సంతోషాలు నింపింది. ఔటర్ పరిథిలో మొత్తం 25 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 16 నియోజకవర్గాల్లో ఇండ్ల కేటాయింపు పూర్తి కాగా, 4 నియోజకవర్గాల్లో ప్రస్తుతం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలోనే వెలువడనున్నది.

ఆన్ లైన్‌లో వివరాలు.. అభ్యంతరాల స్వీకరణ

లాటరీ ద్వారా ఇండ్లు పొందిన వారి వివరాలన్నిటినీ tghb.telangana.gov.inలో ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నామని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వి.పి.గౌతం తెలిపారు. ఇలా ఎంపికైన ప్రజలు తమ అభ్యంతరాలను తెలియచేసే అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. ఈ అభ్యంతరాలను కూడా వెబ్ సైట్ ద్వారా సమర్పించవచ్చన్నారు. లాటరీలో ఎంపికైన దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించడానికి అధికారుల బృందం క్షేత్రస్థాయి పరిశీలనను చేపడుతుందని వెల్లడించారు. ఇండ్లు వచ్చిన వారు తమ ఇండ్లకు వచ్చే అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.

త్వరలో మరిన్ని ప్రాజెక్టులు

తొలి విడతలో దరఖాస్తు చేసుకుని లాటరీలో ఎంపిక కాని వారు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని గౌతం తెలిపారు. ఇది ప్రారంభం మాత్రమే. అర్హులైన అల్పాదాయ కుటుంబాలకు సొంతింటిని అందించే ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుంది. రాబోయే ప్రాజెక్టుల్లో మరిన్ని కుటుంబాలకు అవకాశం లభిస్తుంది అని తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *