– రేపు ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీకి మంత్రి పొన్నం శ్రీకారం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు మహిళలు ఆర్థిక వృద్ధి సాధించే లక్ష్యంతో ప్రభుత్వం కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కుట్టు వృత్తిపై ఆసక్తి, నైపుణ్యం ఉన్న పేద, నిరుద్యోగ బీసీ మహిళలకు 100 శాతం ప్రభుత్వ సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టు మిషన్లను అందించే పథకాన్ని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనుంది. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున మొత్తం 1,19,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లను బీసీ మహిళలకు అందించనున్నారు. లబ్దిదారులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా పూర్తిగా ప్రభుత్వ సబ్సిడీతో కుట్టు మిషన్లను అందజేయడం ఈ పథకం ప్రత్యేకత. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర సచివాలయంలోని జీ-29లో ఈ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. కుట్టు వృత్తిలో నైపుణ్యం ఉన్న మహిళలకు ఆధునిక ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించడం ద్వారా ఇంటి వద్దనే స్వయం ఉపాధి పొందే అవకాశం కల్పించడంతోపాటు, వారి ఆదాయాన్ని పెంచి కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మహిళలను లబ్దిదారులుగా కాక ఆదాయాన్ని ఆర్జించే వారిగా, భవిష్యత్ మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. పథకం విధివిధానాలు, బడ్జెట్, లబ్దిదారుల ఎంపిక, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ తదితర పూర్తి వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెల్లడించనున్నారు. కార్యక్రమంలో బీసీ మంత్రులు, బీసీ ఎంపీలు, బీసీ ఎమ్మెల్యేలు, బీసీ ఎమ్మెల్సీలు, బీసీ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొననున్నారు.
————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




