– ఆ సంస్థ తప్పిదాల వల్ల 27 మంది బలి
-పేరు మార్చుకుని పరీక్షల కాంట్రాక్ట్ పొందింది
– గ్లోబరీనా తప్పిదాలకు కెటిఆర్ క్షమాపణలు చెప్పాలి
– ధర్మేంద్ర రాజీనామాను బీఆర్‌ఎస్ ఎందుకు డిమాండ్ చేయదు
– ‘సర్’ ప్రక్రియలో ఎస్సీ, ఎస్టీ ఓట్లు తొలగించే కుట్ర
– అందుకే అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాం
– మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 23: గ్లోబరీనా ముమ్మాటికీ కేటీఆర్ బినామీ సంస్థ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోమారు ఆరోపించారు. గురువారం మీడియాతో చిట్‌చాట్ మాట్లాడుతూ గ్లోబరీనా తప్పిదాల వల్ల 27 మంది చనిపోయారని, ఆ సంస్థ పేరు మార్చుకొని పరీక్షల కాంట్రాక్టు పొందిందని, వీటి ఆధారంగానే నీట్ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. గ్లోబరీనా తప్పిదాలపై కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమరవీరుల స్తూపం వద్ద కేటీఆర్ ముక్కు నేలకు రాయాలన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో బీఆర్‌ఎస్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నేత కేటీఆర్, బీజేపీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ బర్త్ డే పై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ’కేటీఆర్ పుట్టిన రోజు దావత్ ఇస్తాడో లేదో అడగాలి. కేటీఆర్ ఇచ్చే దావత్ నేను తీసుకోలేనేమో. ఆయనవి అన్నీ వేరే పార్టీలు’ అంటూ సెటైర్ వేశారు. హరీష్ గొప్పవాడైతే మంత్రి పదవి నుంచి ఎందుకు తీసేశారని ప్రశ్నించారు. అతి తెలివి తేటలతో ఏదిపడితే అది మాట్లాడతానంటే నడవదని హరీష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ నేతలు కన్నెపెల్లి పంపు హౌజ్ గురించి మాట్లాడుతున్నారని, మేడిగడ్డ గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. మేడిగడ్డ కట్టింది, కూల్చింది బీఆర్‌ఎస్ వాళ్లే అని వ్యాఖ్యానించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పక్రియ అయిపోయే వరకూ ఎమ్మెల్యేలను గ్రామాల్లోనే ఉండమని చెప్పానని ముఖ్యమంత్రి అన్నారు. ‘సర్’ నాయకులకు సంబంధించింది కాదని, ప్రజలకు సంబంధించిందని స్పష్టం చేశారు. ’తెలిసీ తెలియక నాకు రెండు ఓట్లు ఉన్నాయని అంటున్నారు. కలెక్టర్ అనుమతి తీసుకొని నా గ్రామంలో ఉన్న ఓటును కొడంగల్‌కు మార్చుకున్నాను. గతంలో కొడంగల్ ప్రాంతం కర్ణాటకలోని జిల్లాలో ఉండేది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు చేసినప్పుడు కొడంగల్ పాలమూరులోకి వచ్చిందని చెప్పారు. బీజేపీ కుట్రపూరితంగా ఓట్లను తొలగించే అవకాశముందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రాంతంలో అమాయకుల ఓట్లు పోయే అవకాశముందన్నారు. ‘సర్’ ఉద్దేశం ప్రక్షాళన అని.. దానిని కుట్ర పూరితంగా వాడుతున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లు పోతే కాంగ్రెస్ ఓట్లు పోయినట్టే అన్నారు. అవగాహన లేకపోవడం, సరైన సమయంలో స్పందించకపోవడం వల్ల ఓట్లు పోయే అవకాశముందన్నారు. ఓటు హక్కు లేకపోతే ఆధార్ పోతుంది.. ఓటు హక్కు లేకపోతే గుర్తింపే ఉండదు.. ఓటు హక్కు లేకపోతే సంక్షేమం రాదు’ అని అన్నారు.
బీజేపీలో అంతర్గత కలహాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ నాయకులకు ఒకరంటే ఒకరికి పడదన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లు ఎక్కడుంటాయో బీజేపీకి తెలుసని వెల్లడించారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు 5 లక్షలు ఇవ్వాలని డిసైడ్ అయిందని చెప్పారు. బీఆర్‌ఎస్ నేతలు.. బ్రోకర్లకు అమ్ముకొని దళారీ వ్యవస్థ తెచ్చారని మండిపడ్డారు. మేం ఏం చేస్తున్నామో అదే చెప్తున్నాం అని రేవంత్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 70 శాతం ఎస్‌ఐఆర్ పూర్తయిందని తెలిపారు. ప్రక్షాళన పేరుతో వోట్లు తొలగించే అవకాశం ఉందని.. అలా జరగకుండా ఉండేందుకు బీఎల్‌వోలను పెట్టామన్నారు. వోట్లు లేకుంటే ప్రభుత్వ పథకాలు ఎలా వస్తాయని సీఎం ప్రశ్నించారు. గతంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న ఆంధ్ర ఓట్లన్నీ తొలగించారు. కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళితే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పేదలకు ఇచ్చే ఇళ్లను బీఆర్‌ఎస్ నేతలు దళారులకు అమ్ముకున్నారు. జన్వాడ ఫాంహౌస్ భూములపై కేటీఆర్ విచారణ కోరాలి. మేం అధికారంలోకి వచ్చాకే ఇందిరాపార్కు వద్ద ధర్నా చౌక్‌ను తిరిగి ఓపెన్ చేశాం. నాడు వాళ్లు మూసిన ధర్నా చౌక్‌లోనే కేటీఆర్ ధర్నా చేస్తామంటున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు.
——————
పేరు మార్చుకున్న గ్లోబరీనా.. ఆ సంస్థ నిర్మించిన ఫామ్‌హౌజ్‌లోనే కెటిఆర్
సిఓఇఎంటి సంస్థ తెలంగాణలోనే పుట్టిందని, ఆ సంస్థతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సంబంధాలున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ ఆరోపించారు. ఆ సంస్థ నిర్మించిన ఫామ్‌హౌస్‌లోనే కేటీఆర్ ఉంటున్నారని, సంస్థకు సంబంధించిన భూములు కూడా ఆయన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. 2019లో ఇంటర్ పరీక్షల నిర్వహణకు గ్లోబరీనా సంస్థకు అక్రమంగా టెండర్లు కేటాయించారని, ఆ సంస్థపై జేఎన్‌టీయూ హైదరాబాద్, జేఎన్‌టీయూ కాకినాడలో కేసులు నమోదైనా చర్యలు తీసుకోలేదన్నారు. 26 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన వ్యవస్థపై అప్పటి ప్రభుత్వం స్పందించలేదని, దీనిపై కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు ఆయనకు లేదని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ధర్నా చేస్తున్న విద్యార్థులపై జరిగిన దాడిని బీఆర్‌ఎస్ ఖండించలేదని, బీజేపీని ప్రశ్నించే ధైర్యం కూడా ఆ పార్టీకి లేదని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ మహాధర్నా చేపట్టడం సిగ్గుచేటని విమర్శించారు. శాంతియుతంగా నిరసనలు చేపడితే ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు సృష్టించదని, కానీ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కొత్త పేరుతో మరో సంస్థను ఏర్పాటు చేసి సీబీఎస్‌ఈతో కూడా వ్యవహరిస్తోందని వెంకట్ ఆరోపించారు. ఇప్పుడు విద్యార్థుల కోసం పోరాడుతున్నట్లు కేటీఆర్ మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కూడా కేటీఆర్ ప్రమేయంపై అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పాలనలో పేపర్ లీకేజీలు ఎక్కువగా జరిగాయని విమర్శించారు. ఇదిలా ఉంటే.. కేటీఆర్ తన పుట్టిన రోజు కోసం పది రోజుల ముందే దుబాయ్ వెళ్లారని, అక్కడ సినీ పరిశ్రమకు చెందిన కొందరితో కలిసి పార్టీ జరుపుకున్నారన్నారు. దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మూడు రోజుల పాటు పూర్తిగా రెస్ట్ మోడ్‌లో ఉన్నారని, ఆ తర్వాత ఒక్కసారిగా విద్యార్థుల ధర్నా పేరుతో డ్రామా ప్రారంభించారని బల్మూరి విమర్శించారు.
గ్లోబరీనాతో నాకు సంబంధం లేదు : కేటీఆర్
2019 ఇంటర్ ఫలితాల్లో కేటీఆర్ బినామీ సంస్థ గ్లోబరీనా అవకతవకలకు పాల్పడిందని సీఎం రేవంత్ చేసిన ఆరోపణలపై బీ ర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండి పడ్డారు. ముఖ్యమంత్రి హోదాకు తగిన విధంగా ఒక్కసారైనా వ్యవహరించాలని సూచించారు. పేపర్ లీక్ వంటి అత్యంత దురదృష్టకర ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తూ తప్ప్పుడు ప్రచారం చేయడం ముఖ్యమంత్రి పదవికే మచ్చ తెచ్చే చర్య అని అన్నారు. గ్లోబరీనా సంస్థతో బీఆరఎస్‌కు, తన కుటుంబానికి లేదా తనకు ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయంలో చేసిన ఆరోపణలపై క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. దీనికి సంబంధించి తమ న్యాయ బృందం త్వరలోనే ముఖ్యమంత్రికి లీగల్ నోటీసు పంపనున్నట్లు వెల్లడించారు. అలాగే, ముఖ్యమంత్రి తరచూ తనపై అసభ్యకరమైన, ఆధారరహిత ఆరోపణలు చేస్తున్నప్పటికీ వాటికి తాను ఎక్కువగా స్పందించలేదని కేటీఆర్ పేర్కొన్నారు. తన మౌనం ఆరోపణలను అంగీకరించినట్లు కాదని, నిరాధార విమర్శల స్థాయికి దిగజారి వాదించడం తనకు ఇష్టం లేదని వ్యాఖ్యానించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





