– ప్రపంచస్థాయి సమస్యలకు పరిష్కారాలు కనుగొనే ‘ఎకో సిస్టమ్’
– గ్లోబల్ కంపెనీల అవసరాలకనుగుణంగా అడ్వాన్స్డ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
– ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9 : గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల గమ్యస్థానంగానే కాక హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి సమస్యలకు పరిష్కారాలు కనుగొనే ‘గ్లోబల్ కాన్ఫిడెన్స్ సెంటర్’గా తీర్చిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. గ్లోబల్ మార్కెట్ అవసరాలు, సవాళ్లు, భవిష్యత్ సాంకేతిక మార్పులకు అనుగుణంగా దిగ్గజ కంపెనీలను ఆకర్షించే కాంప్రహెన్సివ్ ఎకో సిస్టంను రాష్ట్రంలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. హైటెక్ సిటీలో 30వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన నెదర్లాండ్స్ గ్లోబల్ ఫిన్‌టెక్ దిగ్గజం ‘బ్యాక్‌బేస్’ డెవలెప్ మెంట్ సెంటర్‌ను ఆయన శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఆనతికాలంలోనే టెక్నాలజీ, డిజిటల్ బ్యాంకింగ్, ఫిన్‌టెక్ రంగాల్లో హైదరాబాద్‌ను గ్లోబల్ కంపెనీలకు ఒక ప్రముఖ గమ్యస్థానంగా తీర్చిదిద్దామన్నారు. బ్యాక్‌బేస్ లాంటి దిగ్గజ కంపెనీల విస్తరణే ఇందుకు నిదర్శనమన్నారు. కేవలం పెట్టుబడులను ఆకర్షించడం, పెద్ద కంపెనీలను రప్పించడమే కాకుండా డిజిటల్ బ్యాంకింగ్ సొల్యూషన్స్, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ అండ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి రంగాల్లో ఉపాధి అవకాశాలను దక్కించుకునేలా తెలంగాణ యువతను సంసిద్ధం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. గ్లోబల్ కంపెనీల అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలో అడ్వాన్స్డ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అందుబాటులోకి తెచ్చేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నామన్నారు. సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారాలు చూపే సత్తా టెక్నాలజీకి ఉందని, ఆ దిశగా కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో ముందుకొచ్చే వారికి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు నెక్ట్స్ జనరేషన్ డిజిటల్ బ్యాంకింగ్ సొల్యూషన్స్, సాఫ్ట్ వేర్ ఉత్పత్తులను అందించడంలో ఈ బ్యాక్‌బేస్ డెవలప్మెంట్ సెంటర్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇక్కడ కొత్తగా 300మంది హై-స్కిల్డ్ వర్క్‌ఫోర్స్‌కు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో నెదర్లాండ్స్ డిప్యూటీ కాన్సుల్ జనరల్ యాన్ క్రెమర్స్, బ్యాక్‌బేస్ సీటీఓ గ్రెగ్ ఫాహి, చీఫ్ ఆఫ్ స్టాఫ్ రీన్హార్డ్ షీల్, ఇండియా సైట్ హెడ్ సురభి శర్మ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





