ఈ అలవాట్లకు స్వస్తి చెబితే మీ గుండె పదిలం

– బీపీ, బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలను తెలుసుకోవాలి
– వైద్యుల సూచన‌లు పాటించాలి
– ప్రపంచ హృదయ దినోత్సవం నేపథ్యంలో ప్ర‌త్యేక క‌థ‌నం

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: ఛాతీలో నొప్పి వచ్చిన రోజో, గుండెపోటు వచ్చిన రోజో గుండె జబ్బు మొదలవదని, దానికి దారితీసే ముప్పు చాలా ఏళ్ల ముందు నుంచే మనకు తెలియకుండానే పెరుగుతూ ఉండొచ్చని కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ క్లినికల్ డైరెక్టర్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్ట‌ర్‌ చాణక్య కిషోర్ కమ్మరిపల్లి హెచ్చరించారు. అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, ధూమపానం, అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన జీవనశైలి వంటి అంశాలు ఎలాంటి స్పష్టమైన హెచ్చరికలు లేకుండానే గుండె, రక్తనాళాల ఆరోగ్యంపై క్రమంగా ప్రభావం చూపుతాయని తెలిపారు. ప్రపంచ హృదయ దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో గుండె జబ్బుల చికిత్స గురించి మాత్రమే కాకుండా వాటి ముప్పును పెంచే రోజువారీ అలవాట్లపైనా దృష్టి పెట్టాలని సూచించారు. మన గుండె కోసం కొన్ని అలవాట్లకు దూరం కావాల్సిన సమయం వచ్చింది అన్నారు. 1.ధూమపానాన్ని పూర్తిగా మానేయడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. 2.రోజువారీ ఉప్పు వినియోగాన్ని క్రమంగా తగ్గించుకోవడం. 3.చక్కెర కలిపిన పానీయాలు, స్వీట్లు, అధికంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తినడం బాగా తగ్గించాలి. అప్పుడప్పుడు స్వీట్ తినడం వేరు…రోజూ తినడం వేరు. 4.ఉదయం వ్యాయామం చేసినప్పటికీ ఆ తర్వాత ఎనిమిది, పది గంటలు కూర్చునే ఉండటం మంచిది కాదు. వ్యాయామంతోపాటు రోజంతా శరీరాన్ని కదిలించడం కూడా ముఖ్యం. మధ్య మధ్యలో చిన్న వాకింగ్ బ్రేక్స్ తీసుకోవడం, వీలైనప్పుడు మెట్లు ఉపయోగించడం, ఎక్కువసేపు ఒకేచోట కూర్చోకుండా ఉండటం అలవాటు చేసుకోవాలి. 5.నిరంతరం తగినంత నిద్ర లేకపోవడం లేదా నాణ్యమైన నిద్ర అందకపోవడం అనేక కార్డియోవాస్క్యులర్ రిస్క్ ఫ్యాక్టర్లతో సంబంధం కలిగి ఉంటుంది. పని, వినోదం, మొబైల్, స్క్రీన్ టైమ్ కోసం ప్రతిరోజూ నిద్రను తగ్గించుకోవడం మంచిది కాదు. 6. నిరంతర ఒత్తిడి రక్తపోటు, నిద్ర, ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యం, శారీరక శ్రమ వంటి అంశాలపై ప్రభావం చూపడం ద్వారా పరోక్షంగా గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీయవచ్చు. సమస్యలను పూర్తిగా తొలగించడం కంటే వాటిని ఆరోగ్యకరమైన పద్ధతిలో ఎదుర్కోవడం నేర్చుకోవడం ముఖ్యం. 7.మద్యం గుండెకు మంచిదనే నమ్మకంతో తాగడం ప్రారంభించడం లేదా కొనసాగించడం సరికాదు. అధిక మద్యపానం రక్తపోటును పెంచడంతోపాటు గుండె లయలో మార్పులు, ఇతర ఆరోగ్య సమస్యలకు దోహదం చేయవచ్చు. ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తమ వ్యక్తిగత ముప్పు గురించి వైద్యుడిని సంప్రదించడం మంచిది. 8. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం ఏళ్ల తరబడి ఎలాంటి లక్షణాలు లేకుండానే ఉండొచ్చు. ఆరోగ్యంగా అనిపిస్తోందనే కారణంతో పరీక్షలను వాయిదా వేయకూడదు. ఛాతీలో నొప్పి వచ్చిన తర్వాతే గుండె ఆరోగ్యం గురించి ఆలోచించకుండా రక్తపోటు, బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ స్థాయులను తెలుసుకోవాలి. ముఖ్యంగా కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారు లేదా ఇతర రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్నవారు వైద్యుల సూచన మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. ప్రపంచ హృదయ దినోత్సవం సమీపిస్తున్న వేళ ఈ ఎనిమిది అలవాట్లనూ ఒక్కసారిగా మార్చేయాలనే ఒత్తిడి అవసరం లేదు. ముందుగా ఒక్కదానితో మొదలుపెట్టండి. నా గుండె కోసం నేను ఏ అలవాటుకు బ్రేకప్ చెప్పగలను అని ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే గుండె జబ్బుల నివారణ మనం ప్రతిరోజూ తీసుకునే చిన్నచిన్న నిర్ణయాల నుంచే మొదలవుతుందనేది గుర్తుంచుకోవాలి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *