– బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అన్నీ పేపర్ లీకులే-
– ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో టెన్త్ తెలుగు, హిందీ పేపర్ లీక్
– మరి ఆనాడెందుకు రాజీనామా చేయలేదు?
– విద్యార్థుల ముసుగులో కమ్యూనల్, కమ్యూనిస్టు శక్తులు
– ధర్నా చౌక్ ఎత్తేసినోడే ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయడమా?
– కేటీఆర్ నిర్వాకంతో 27మంది చనిపోతే చర్యలేవి?
– మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి సంజయ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 24 : బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో, రేవంత్ రెడ్డి రెండున్నరేళ్ల పాలనలో పరీక్షా పత్రాలు లీకయ్యాయని, మరి ఆనాడు కేసీఆర్, కేటీఆర్, రేవంత్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు పైడి రాకేశ్ రెడ్డి, పాల్వాయి హరీష్, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమరయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, అధికార ప్రతినిధులు సీహెచ్.విఠల్, జె.సంగప్ప తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జెన్ జీ తరం పిల్లల్లారా.. బీఆర్ఎస్ అంటేనే పేపర్ లీకేజీలు, పశ్నాపత్రాలు అమ్ముకుని దోచుకున్నరు.. కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలోనూ అదే జరిగింది. ఆ రెండు పార్టీలను నిలదీయండి అని పిలుపునిచ్చారు. నిరసనలు, ధర్నాలను నిషేధిస్తూ ధర్నా చౌక్‌నే ఎత్తేసిన బీఆర్ఎస్ నేతలు ఇయాల సిగ్గు లేకుండా అదే ధర్నా చౌక్‌లో నిరసన చేశారని ఎద్దేవా చేశారు. దిల్లీలో కాక్రోచ్ పార్టీ పేరుతో జరిగిన నిరసనలో కమ్యూనిస్టు, కమ్యూనల్ పార్టీలు చొరబడి హింసను సృష్టించడమే కాక పార్లమెంటుపై దాడికి యత్నించాయని మండిపడ్డారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారం లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రుల భావోద్వేగాలతో ముడిపడిన అంశం.. అందరికంటే ఎక్కువగా ప్రధాని మోదీ బాధపడుతున్నారని చెప్పారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేశారని, సీబీఐ ఇప్పటికే 11మంది ఫ్యాకల్టీసహా 17 మందిని అరెస్టు చేసిందని తెలిపారు. విద్యార్థులు ఆందోళనను అర్దం చేసుకున్నాం.. విద్యాశాఖ మంత్రి ధరేంద్ర ప్రదాన్ క్షమాపణ చెప్పారు.. విద్యార్థుల విద్యా సంవత్సరం నష్టపోకుండా 40 రోజుల్లోనే పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించామని వివరించారు. దిల్లీలో జరిగిన ఆందోళనలో పోలీసులు, జర్నలిస్టులు, మహిళా జర్నలిస్టులపై దాడులతో ఆందోళనకారులు అసభ్యంగా ప్రవర్తించారని, పోలీసుల తలలు పగిలినా ఫైరింగ్ చేయలేదని చెప్పారు. 118 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని, విధి లేని పరిస్థితుల్లో అరాచక శక్తులపై తప్పనిసరి లాఠీఛాóర్జి చేయాల్సి వచ్చిందని అన్నారు. పాకిస్తాన్ నుండి సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేస్తూ ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని, అందుకే పాకిస్తాన్‌కు చెందిన 480 సోషల్ మీడియా అకౌంట్లను కేంద్రం బ్లాక్ చేసిందని చెప్పారు. నీట్‌కు.. ఆర్టికల్ 370 రద్దుకు సంబంధం ఏమిటి? నీట్‌కు ఆజాద్ కాశ్మీర్‌కు సంబంధం ఏమిటి.. నీట్‌కు బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంకకు సంబంధం ఏమిటి అని సంజj పశ్నించారు. విపక్షాలు పార్లమెంటులో ఎందుకు చర్చలకు సిద్ధంగా లేవని నిలదీశారు. నీట్ పేపర్ లీకై రెండు నెలలు దాటినా కాంగ్రెస్, ప్రతిపక్షాలు ఏనాడూ పెదవి విప్పలేదని, కాక్రోచ్ పార్టీ ధర్నాలతో మొన్న అకస్మాత్తుగా పీఎం ఇంటిని ముట్టడించేందుకు కాంగ్రెస్ కుట్ర చేసిందని అన్నారు.. మోదీని దించి రాహుల్‌ను పీఎం చేయాలన్నదే వాళ్ల ఏకైక లక్ష్యమని వ్యాఖ్యానించారు. యూపీఏ హయాంలో 72 సార్లు పేపర్లు లీకైనయ్.. మరి ఆనాడు మన్మోహన్ సింగ్, విద్యాశాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేయలేదు.. ఇక రాజస్తాన్, పంజాబ్, కేరళ, కర్నాటక, యÖపీ, బెంగాల్‌లలో ప్రశ్న పత్రాలు లీక్ అయితే ఆయా బాధ్యులు రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. అశోక్ గెహ్లాట్ సీఎంగా ఉండగా 18సార్లు పేపర్లు లీక్ అయితే ఆనాడు రాహుల్ , ప్రియాంక ఏమన్నారో దేశమంతా చూసిందంటూ కాంగ్రెస్ చేస్తే సంసారం.. ఇతరులు చేస్తే వ్యభిచారమా అని అడిగారు. తాను రాష్ట్రంలో గ్రూప్-1 పేపర్ లీక్‌పై పోరాటం చేస్తుంటే ఏమైందో మీరే చూశారన్నారు. కాగా, కేటీఆర్‌కు 50వ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ కనీసం పుట్టిన రోజున కూడా నిజాలు చెప్పలేదని ఎద్దేవా చేశారు. ట్విట్టర్ టిల్లు బినామీ సంస్థ గ్లోబరీనా నిర్వాకం వల్ల 27మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే కనికరం లేకుండా వాళ్ల తల్లిదండ్రులపై లాఠీఛార్జి చేయించిన ఘటన మర్చిపోగలమా అన్నారు.అపుడు ఎందుకు రాజీనామా చేయలేదని కేటీఆర్‌ను ప్రశ్నించారు. పేపర్ లీక్‌పై సీఎం రేవంత్ వ్యాఖ్యలు సుద్దపూసను తలపిస్తున్నాయని, కాంగ్రెస్ రెండేళ్ల పాలనలోనే టెన్త్ తెలుగు, హిందీ పేపర్ లీకైందని, గ్రూప్-1లో అక్రమాలు జరిగి నాలుగు లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తు నాశనమైందని, మరి ఆనాడు మీరెందుకు రాజీనామా చేయలేదని నిలదీశారు. మొన్న ‘నీట్’లో ర్యాంకులు సాధించిన గురుకుల విద్యార్థులందరినీ పిలిచి సన్మానం చేసినవ్.. వారిని అడుగు.. ‘నీట’ ఎట్లా జరిగిందో చెబుతారన్నారు. గ్లోబరీనా గురించి మాట్లాడుతున్న సీఎం ఆ నిందితులను ఎందుకు అరెస్టు చేయడం లేదన్నారు. విద్యార్థులారా కుటిల రాజకీయ నేతల ట్రాప్‌లో పడకండి.. మెడికల్ కౌన్సెలింగ్‌కు సిద్ధం కండి అని పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





