జూరాల ఆయకట్టు పంటలను కాపాడాలి

– రైతుల పక్షాన పోరాడుతున్న నేతల అరెస్టు దుర్మార్గం
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21 : కళ్లముందే పంటలు ఎండిపోయి అల్లాడుతున్న అన్నదాతల గోసను ప్రభుత్వం తీర్చాల్సిందిపోయి న్యాయమైన డిమాండ్‌తో నిరసనకు సిద్ధమైన బీఆర్ఎస్ శ్రేణులను అణచివేసేందుకు రేవంత్ సర్కారు కుట్ర చేస్తోందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్ర‌క‌ట‌న‌లో మండిపడ్డారు. మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సి.లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు, ఇత‌ర‌ నాయ‌కులను అక్రమంగా నిర్బంధించడం రేవంత్ రాక్షస మనస్తత్వానికి నిదర్శనమన్నారు. తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే జిల్లాలోని అనేక మండలాల్లో బీఆర్ఎస్ నాయ‌కుల‌ ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలకు చీకటి ఆదేశాలిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూరాలలో తొమ్మిది టీఎంసీల నీటి లభ్యత ఉన్నా విడుదల చేయకుండా కుంటిసాకులతో రేవంత్ సర్కారు పంటల ఉసురు తీస్తోందన్నారు. తమ పంటలను కాపాడుకునే తపనతో గుండెపగిలిన రైతులు జూరాల గేట్లు ఎత్తే ప్రయత్నం చేస్తే వారిపై అక్రమ కేసులు బనాయించిన ప్రభుత్వం అన్నదాతలను అన్ని విధాలా అరిగోస పెడుతోందని ఆయన విమర్శించారు. తెలంగాణ గడ్డపై ఉన్న జూరాల ప్రాజెక్టు పరిసరాల్లోకి రైతులు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి వందలాదిమంది పోలీసులను మోహరించడం ముమ్మాటికీ సిగ్గుమాలిన చర్య అని అన్నారు. తాగునీటికి కేవలం రెండు టీఎంసీలు సరిపోతాయని తెలిసినా తొమ్మిది టీఎంసీలు ఉన్న జూరాల నుంచి చుక్క నీరు విడుదల చేయకుండా ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు రైతులను సంక్షోభంలోకి నెట్టడం క్షమించరాని పాపం అని అన్నారు. అరెస్టు చేసిన తమ నేతలను విడుదల చేయడంతోపాటు జూరాల ఆయకట్టు రైతులకు వెంటనే నీరు విడుదల చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. లేకపోతే అన్నదాతల ఆగ్రహానికి ఈ కాంగ్రెస్ సర్కారు కుప్పకూలడం ఖాయం అని కేటీఆర్ హెచ్చరించారు.

నీళ్లివ్వాలని అడిగితే అరెస్టు చేస్తారా? : హరీష్‌రావు 

రైతుల పక్షాన పోరాడుతున్న తమ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఇతర నాయకులను అక్రమంగా నిర్బందించడం దుర్మార్గం అని శాసన సభలో బీఆర్ఎస్ ఉపనాయకుడు టి.హరీష్‌రావు ఒక ప్ర‌క‌ట‌న‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జలాలను శ్రీశైలం నుండి 738 కి.మీ దూరంలో ఉన్న పెన్నా బేసిన్‌లోని కుప్పం వరకు తరలిస్తుంటే పక్కనే ఉన్న పాలమూరుకు మాత్రం ఎందుకు తరలించడం లేదు అని ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్ పాలనా వైఫల్యం కాదా.. పాలకుల చేతగానితనం కాదా.. అని నిలదీశారు. పాలమూరు ప్రాజెక్టులో భాగంగా నార్లపూర్, ఏదుల, కరివెన, వట్టెం కలిపి మొత్తం 50 టీఎంసీల సామర్థ్యంతో జలాశయాలను కేసీఆర్ నిర్మిస్తే వాటిని నీళ్లతో నింపే సోయి కూడా మీకు లేదా అని ఆయన ప్రశ్నించారు. గత రెండున్నరేళ్లు కృష్ణానదిలో పుష్కలంగా నీళ్లు పారినా ఎందుకు మోటర్లను నడపలేదు.. శ్రీశైలం నిండు కుండలా ఉన్నా రైతులకు నీళ్లు ఎత్తిపోసే ఆలోచన ఎందుకు చేయలేదు.. కృష్ణా జలాలను ఏపీకి వదిలిపెట్టి తెలంగాణ రైతుల ప్రయోజనాలను ఎందుకు గాలికొదిలేశారు అని నిలదీశారు. ముఖ్యమంత్రి గానీ, నీళ్ల మంత్రిగాని దీనికి సమాధానం చెప్పాలన్నారు. పాలమూరు ప్రాజెక్టును పడావు పెట్టి రైతుల నోట్లో మట్టి కొట్టారన్నారు. పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి పాలమూరు రైతులకు చేస్తున్న నమ్మకద్రోహం ఇది అని హరీష్‌రావు మండిపడ్డారు. రైతులంటే ఎందుకు అంత నిర్లక్ష్యం రేవంత్ రెడ్డీ అని ప్రశ్నించారు. జూరాల ప్రాజెక్టు ఆనకట్ట పరిసరాల్లో పోలీసు బలగాలను భారీగా మోహరించారని, కనిపిస్తే అరెస్టులు చేస్తున్నారని, ఎందుకింత దౌర్జన్యం అని అడిగారు. రైతులు నీళ్లు అడుగుతుంటే వాళ్ల చేతికి సంకెళ్లు వేస్తారా అని ఆయన అడిగారు. తప్పు మీరు చేస్తే శిక్ష రైతులు అనుభవించాలా ఆయన అన్నారు. ఎల్‌నినో సాకు చెప్పి పంటలకు నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని, పంట పొలాలకు నీళ్లు ఇవ్వడం చేతగాని ప్రభుత్వం ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సిగ్గుచేటు అని విమర్శించారు. జూరాల ఆయకట్టు రైతులకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని, అదుపులోకి తీసుకున్న తమ పార్టీ నాయకులను, రైతులను విడుదల చేయాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *