లష్కర్ బోనం.. దక్కన్ సంస్కృతి వైభవం!

తెలంగాణ మాతృదేవతారాధన వైజ్ఞానికచారిత్రకసామాజిక ప్రస్థానం

తెలంగాణ జానపద సంస్కృతికి, ఆధ్యాత్మిక వైభవానికి అత్యున్నత ప్రతీకగా నిలిచే ఉత్సవం ‘బోనాలు’. దక్కన్ పీఠభూమి సామాజిక చరిత్రలో, ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల పరిణామక్రమంలో ఈ పండుగ ఒక బలమైన సామాజిక సంశ్లేషణగా రూపాంతరం చెందింది. కేవలం ఒక సాదాసీదా మతపరమైన ఆచారంగానే కాక, సమాజంలోని శ్రామిక వర్గాల అస్తిత్వానికి, ప్రకృతి ఆరాధనకు, వర్షాకాలంలో ప్రబలే మహమ్మారుల నివారణకు సంబంధించిన వైజ్ఞానిక కోణాలకు ఈ పండుగ నిదర్శనంగా నిలుస్తుంది.  భాషా శాస్త్రవేత్తలు, జానపద చరిత్ర పరిశోధకుల విశ్లేషణల ప్రకారం సంస్కృత పదమైన ‘భోజనం’ అనే పదానికి ప్రాకృత వికృతి రూపమే ‘బోనమ్’ లేదా ‘బోనం’. ఈ ఉత్సవంలో అమ్మవారికి సమర్పించే పవిత్ర నైవేద్యాన్నే బోనంగా వ్యవహరిస్తారు. దీని తయారీ విధానంలో అత్యంత నిష్ఠ, సంప్రదాయ పద్ధతులు కనిపిస్తాయి. కొత్త మట్టి కుండతోపాటు ఇత్తడి పాత్రలో వరి అన్నాన్ని పాలు, బెల్లం జోడించి వండుతారు. ఈ కుండల వెలుపలి భాగాన్ని సున్నం, పసుపు, కుంకుమలతో అలంకరించి, వేప ఆకులను చుట్టి, పైభాగంలో వెలిగించిన దీపాన్ని (పిండి ప్రమిద లేదా మట్టి ప్రమిద) ఉంచుతారు.

మహిళలు ఈ శుభప్రదమైన బోనపు కుండలను తమ తలపై మోస్తూ, డప్పు వాయిద్యాలు, మంగళ హారతుల నడుమ ఊరేగింపుగా ఆలయాలకు తరలివెళతారు. అమ్మవారికి నైవేద్యంతో పాటు పసుపు, కుంకుమ, గాజులు, చీర సమర్పించడం మాతృస్వామ్య వ్యవస్థ ఆచారాలను ప్రతిబింబిస్తుంది. బోనం సమర్పణ అనేది సకల జీవులను రక్షించే ప్రకృతి మాతకు సమర్పించే ఒక కృతజ్ఞతా నివేదనగా భావించబడుతుంది. ఆషాఢ మాసంలో వివాహితలైన ఆడపిల్లలు తమ పుట్టింటికి వచ్చినట్టుగానే, జగన్మాత అయిన మహంకాళి తన పుట్టింటికి వస్తుందని, అందుకే ఆమెకు ప్రేమతో సమర్పించే విందు భోజనమే ఈ బోనం అని భక్తుల నమ్మకం.

మాతృస్వామ్య మూలాలు

బోనాల ఉత్సవాలు ఆదిమ మానవ కాలంలోని ‘ఆరాధన, నివేదన’ పద్ధతులను పోలి ఉన్నాయని చరిత్రకారులు భావిస్తున్నారు. నాగరికత ఆవిర్భవించక మునుపు, మానవుడు వేట ఆహార సేకరణ దశలో ఉన్నప్పుడు ప్రకృతి శక్తులను చూసి భయపడేవాడు. ఈ శక్తులను వశం చేసుకునే క్రమంలోనే ఆరాధనలకు అంకురార్పణ జరిగింది. భూమికి, స్త్రీకి పునరుత్పత్తి శక్తులు ఉన్నాయని ప్రాచీన మానవుడు గుర్తించడం వల్లనే మాతృదేవతారాధన వ్యవస్థ ప్రాణం పోసుకున్నది. కాలక్రమేణా సమాజం పితృస్వామ్య వ్యవస్థ వైపు అడుగులు వేసినప్పటికీ, మాతృస్వామ్య వ్యవస్థ మూలాలు జానపద ఆచారాల్లో అలాగే ఉండిపోయాయి. ఈ పురాతన మాతృదేవతే నేటి గ్రామ దేవతగా అవతరించింది.

మానవ సమాజం వేట దశ నుంచి స్థిర వ్యవసాయ దశలోకి ప్రవేశించినప్పుడు, సేద్యం పనుల విరామ సమయాల్లో ఉత్సవాలు, సమావేశాలు నిర్వహించే ఆచారం మొదలైంది. వ్యవసాయం చేయడం ద్వారానే మానవులు గుంపులుగా నివాసం ఉంటూ గ్రామాలుగా ఏర్పరచుకున్నారు. ఈ వ్యవసాయ దేవతలే కాలక్రమేణా గ్రామాలను రక్షించే గ్రామ దేవతలుగా మార్పు చెందారని హెన్రీ వైట్ హెడ్ తన ‘ది విలేజ్ గాడ్స్ ఆఫ్ సౌత్ ఇండియా’ అనే గ్రంథంలో అభిప్రాయపడ్డారు. నిత్య శ్రమతో అలిసిపోయిన జానపదుని మనస్సుకు సంతోషాన్ని ఇచ్చి, అలసటను తీర్చే సాధనాలుగా ఈ జాతరలు ఉపయోగపడ్డాయి. గ్రామ పొలిమేరలను కాపాడే దేవతలను ఆరాధించడం వల్ల వీరికి ‘పొలిమేరమ్మ’, ‘పోలేరమ్మ’ అనే పేర్లు వచ్చాయి. ప్రతి గ్రామానికి గంగమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, మహంకాళి వంటి రక్షక దేవతలు ఉండడం వారి చుట్టూ మాంత్రికత, తంత్రము వంటి ఆచారాలు అల్లబడి ఉండడం జానపద సంస్కృతిలో భాగమైంది.

 క్రీ.శ. 1516 గొబ్బూరు శిలాశాసనంలో బోనాల ప్రస్తావన

బోనాల పండుగ ఆవిర్భావం కేవలం 19వ శతాబ్దపు ప్లేగు మహమ్మారితోనే ప్రారంభమైందని అంతకుముందు ప్రజాబాహుళ్యంలో ఒక బలమైన నమ్మకం ఉండేది. అయితే ఇటీవలి కాలంలో పురావస్తు ఆధారాలు ఈ పండుగ చరిత్రను మరింత ప్రాచీన కాలంలోకి, ముఖ్యంగా మధ్యయుగాల నాటి విజయనగర సామ్రాజ్య కాలంలోకి తీసుకువెళ్లాయి. భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) ఎపిగ్రఫీ విభాగం సేకరించిన ఆధారాల ప్రకారం, విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలానికి చెందిన ఒక విశిష్ట శిలాశాసనం లభ్యమైంది. కర్ణాటక-తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన గొబ్బూరు వద్ద కనుగొనబడి, ప్రస్తుతం హైదరాబాదులోని రాష్ట్ర పురావస్తు మ్యూజియంలో భద్రపరచబడిన ఈ తెలుగు శాసనం క్రీ.శ. 1516 మే 4 నాటిదిగా నిర్ధారించబడింది. . ఈ శాసన ఆధారాల ద్వారా బోనాలు, రంగం వంటి ఆచారాలు క్రీ.శ. 1516 కి ముందే అత్యంత ప్రాచుర్యం పొంది ఉన్నాయని స్పష్టమవుతున్నది. అందువల్ల 19వ శతాబ్దపు ప్లేగు మహమ్మారి అనేది ఈ పండుగ  ఆవిర్భావానికి కారణం కాదని, అది అప్పటికే ఉన్న ఒక పురాతన ఆచారానికి పునరుజ్జీవనం కలిగించిన ఒక చారిత్రక సందర్భం మాత్రమేనని చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారు.

హైదరాబాద్ బోనాల ఆధునిక చరిత్ర

హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంటనగరాల ఆధునిక చరిత్రలో బోనాలు సామూహిక జన ఉత్సవంగా మారడానికి క్రీ.శ. 1813 లో సంభవించిన ప్లేగు మహమ్మారి ఒక ప్రధాన కారణమైంది. ఈ అంటువ్యాధి కారణంగా జంటనగరాల్లో వేలాది మంది ప్రజలు మరణించారు. దీనితో తీవ్ర అభద్రతా భావం నెలకొన్నది. అదే సమయంలో, హైదరాబాద్‌కు చెందిన ఒక సైనిక దళం (మిలిటరీ బెటాలియన్) మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో విధుల్లో భాగంగా మోహరించబడింది. జంటనగరాలలో తమ కుటుంబాలు ప్లేగు బారిన పడుతున్నాయనే వార్తలతో ఆందోళన చెందిన సైనికులు, ఉజ్జయినిలోని ప్రసిద్ధ మహంకాళి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. తమ స్వస్థలంలో ప్లేగు మహమ్మారి నశిస్తే, సికింద్రాబాద్‌లో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి, వార్షిక నైవేద్యాలు (బోనాలు) సమర్పిస్తామని మొక్కుకున్నారు.

భక్తుల విశ్వాసాల ప్రకారం, ఈ పూజల అనంతరం జంటనగరాలలో ప్లేగు వ్యాధి ఉధృతి క్రమంగా తగ్గిపోయింది. విధులను పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన సైనికులు క్రీ.శ. 1815 లో సికింద్రాబాద్ (బ్రిటిష్ సైనిక స్థావరం కావడంతో దీనిని లష్కర్ అని పిలిచేవారు) లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి కాష్ఠ (చెక్క) విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ ఘట్టం ద్వారానే ‘లష్కర్ బోనాలు’ ప్రారంభమయ్యాయి. ఇది క్రమంగా దక్కన్ ప్రాంతమంతటా విస్తరించింది. బోనాల పండుగ వెనుక కేవలం హిందూ సంప్రదాయాలే కాక, హైదరాబాద్ సాంస్కృతిక సామరస్యం కూడా ముడిపడి ఉన్నది. చరిత్రలో వివిధ దేవాలయాల ఆవిర్భావం, వాటికి లభించిన రాజపోషణ దీనికి రుజువుగా నిలుస్తాయి. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం సుమారు 700 సంవత్సరాల క్రితం, హైదరాబాద్ నగరం ఏర్పడక ముందే ఒక చిన్న గ్రామంలో వెలిసింది. ఒక రైతు తన పొలంలో బావి తవ్వుతుండగా అమ్మవారి స్వయంభూ విగ్రహం లభ్యమైంది.

శివసత్తుల సలహాతో ఆ విగ్రహాన్ని బావిలోనే ఉంచి పూజలు చేయడం ప్రారంభించారు. నేటికీ బల్కంపేట ఆలయంలో అమ్మవారి స్వయంభూ మూర్తి శిరసు వెనుక భాగం నుంచి నిత్యం జలధార ప్రవహిస్తూ ఉంటుంది. దీనిని భక్తులు పవిత్ర తీర్థంగా స్వీకరిస్తారు. కట్ట మైసమ్మ ఆలయాన్ని లోయర్ ట్యాంక్ బండ్ వద్ద నిర్మించారు. కట్ట అనగా చెరువు లేదా నది గట్టు. హుస్సేన్ సాగర్ నిర్మాణ సమయంలో చెరువు కట్టను రక్షించే రక్షక దేవతగా మైసమ్మను ఆరాధించడం ప్రారంభించారు. క్రీ.శ. 1908 లో సంభవించిన మూసీ నది వరదల సమయంలో నగర రక్షణ కోసం ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్, దైవజ్ఞుల సలహా మేరకు కట్ట మైసమ్మ దేవికి పట్టువస్త్రాలు, పండ్లు, సంప్రదాయ నైవేద్యాలను సమర్పించి శాంతి పూజలు నిర్వహించారు. ఈ సమర్పణ జరిగిన వెంటనే నదిలో నీటి ఉధృతి తగ్గిపోయిందని, నగరం సురక్షితంగా నిలిచిందని చారిత్రక కథనాలు చెబుతున్నాయి.

పాతబస్తీలోని హరిబౌలి అక్కన్న-మాదన్న దేవాలయం 17వ శతాబ్దంలో కుతుబ్ షాహీ పాలకుడు అబుల్ హసన్ తానీషా వద్ద మంత్రులుగా పనిచేసిన అక్కన్న, మాదన్నల చేత నిర్మించబడింది. మొఘలాయిల దాడిలో ధ్వంసమై శతాబ్దాల పాటు మరుగున పడిపోయిన ఈ ఆలయాన్ని క్రీ.శ. 1948 లో ఒక వృద్ధురాలి కల ఆధారంగా తవ్వకాలు జరిపి పునరుద్ధరించారు. ఈ పునరుద్ధరణ పనుల్లో స్థానిక ముస్లిం సోదరులు కూడా సహకరించి మత సామరస్యానికి అద్దం పట్టారు. ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో సికింద్రాబాద్ మహంకాళి ఆలయానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఉచిత బస్సు సర్వీసులు నడిపేవారు. అలాగే  నిజాం ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సమీపంలో ఒక రాతి శాసనాన్ని వేయించారు. ఆ శాసనంలో వర్షాకాలంలో అంటువ్యాధులు వ్యాపించకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ తమ వీధుల ముందు కళ్లాపి చల్లి, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆశించారు. ఇది నాటి పాలకులకు ప్రజారోగ్యం పట్ల ఉన్న శ్రద్ధను, బోనాల ఆచారాల్లోని శాస్త్రీయతను ప్రతిబింబిస్తుంది.

బోనాల ఉత్సవాల విశిష్ట ప్రక్రియలుజానపద రూపాలు

బోనాల ఉత్సవాలు కేవలం పూజా విధానానికే పరిమితం కాకుండా, అనేక జానపద కళల ప్రదర్శనకు వేదికగా నిలుస్తాయి. గ్రామ దేవతల తమ్ముడిగా భావించే పోతరాజు పాత్ర బోనాల జాతరకు ప్రధాన ఆకర్షణ. ఒంటి నిండా పసుపు పూసుకొని, నుదుట పెద్ద కుంకుమ బొట్టు పెట్టి, కాళ్లకు గజ్జెలు కట్టి, చేతిలో కొరడాతో డప్పు వాయిద్యాల శబ్దాలకు అనుగుణంగా రౌద్ర నృత్యం చేసే పోతరాజు భక్తులను భయానికి గురిచేస్తాడు. వీరు ఫలహారం బండ్ల ముందు నడుస్తూ, కొరడాతో విన్యాసాలు చేస్తూ దుష్టశక్తులను పారదోలుతారని భక్తుల నమ్మకం.

బోనాల పండుగ మరుసటి రోజు ఉదయం జరిగే అత్యంత ఆసక్తికరమైన ఘట్టం ‘రంగం’. ఒక వివాహిత లేదా అవివాహిత స్త్రీ (మాతంగి) పచ్చి మట్టి కుండపై నిలబడి పూనకంతో భవిష్యత్తును అంచనా వేస్తుంది. రాబోయే సంవత్సరంలో వర్షాలు, పంటల సమృద్ధి, అంటువ్యాధుల ప్రభావం,  ప్రజారోగ్యం గురించి అమ్మవారి స్వరూపంగా సమాధానాలు ఇస్తుంది. రాగి లేదా ఇత్తడి పాత్రను అమ్మవారి రూపంలో సర్వాంగ సుందరంగా అలంకరించి, పూజారి దానిని మోస్తూ చేసే జాతరను ఘటం అంటారు. హరిబౌలి అక్కన్న-మాదన్న ఆలయ ఘటం ఊరేగింపు పాతబస్తీలోని చార్మినార్ గుండా సాగుతూ నయాపూల్ వద్ద మూసీ నదిలో నిమజ్జనంతో ముగుస్తుంది. అలాగే వెదురు బద్దలు, రంగు కాగితాలతో తయారు చేసిన ‘తొట్టెలు’ మాతృత్వానికి, సంతాన సౌభాగ్యానికి ప్రతీకగా సమర్పించబడతాయి.

 బోనాల పండుగ వెనుక దాగివున్న వైజ్ఞానిక సత్యాలుప్రజారోగ్య కోణాలు

బోనాల పండుగ జరిగే ఆషాఢ మాసం వర్షాకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ రుతు మార్పిడి సమయంలో వాతావరణం చల్లబడడం వల్ల గాలి, నీటి ద్వారా వ్యాపించే బ్యాక్టీరియా, వైరస్‌లు వేగంగా వృద్ధి చెంది కలరా, టైఫాయిడ్, మలేరియా, డెంగీ వంటి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పూర్వికులు ఈ వ్యాధులను అరికట్టడానికి కొన్ని విలక్షణమైన శాస్త్రీయ పద్ధతులను ఆధ్యాత్మికతతో ముడిపెట్టారు. కుండను స్త్రీ గర్భానికి సంకేతంగా భావిస్తారు. పూర్వం శిశు మరణాలు ఎక్కువగా ఉండడం వల్ల సంతానాన్ని, గ్రామాలను కాపాడాలని బోనాల పూజలు చేసేవారు.

బోనంలో ఉపయోగించే ప్రతి పదార్థానికి వైజ్ఞానిక ప్రాధాన్యం ఉన్నది. బోనానికి ఉపయోగించే మట్టి కుండలోని సహజ ఖనిజాలు ఆహారాన్ని సురక్షితంగా ఉంచుతాయి. కుండ పర్యావరణ హితమైనది. బోనాల కుండలపై పూసే సున్నం, పసుపు ప్రకృతిసిద్ధమైన క్రిమిసంహారకాలుగా పనిచేస్తాయి. పసుపులోని కర్కుమిన్ యాంటీ-బ్యాక్టీరియల్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. బోనాల పండుగ సందర్భంగా వీధుల అంతటా చల్లే వేపాకు కషాయం, పసుపు నీళ్లు గాల్లోని సూక్ష్మజీవులను నశింపజేస్తాయి. వేపలోని అజాడిరాక్టిన్ అద్భుతమైన క్రిమిసంహారక శక్తులను కలిగి ఉంటుంది.

తెలంగాణ ప్రాంతీయ వైవిధ్యంఇతర ప్రాంతాలతో పోలిక

బోనాల సంస్కృతి తెలంగాణ అంతటా విస్తరించి ఉన్నా, ఇతర ప్రాంతాల్లోనూ స్వల్ప తేడాలతో జరుపుకుంటారు. తెలంగాణలో బోనాలు ఇండ్ల వద్దే మట్టి కుండలలో వండి తలపై మోసుకెళ్లే సంప్రదాయం ఉండగా, ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతాలలో ఈ ఆచారాలు కొద్దిగా భిన్నంగా ఉంటాయి. తెలంగాణలో ప్రధానంగా ఇండ్లలోనే కొత్త మట్టి కుండలో లేదా ఇత్తడి పాత్రలో వండుతారు. బోనం కుండలకు సున్నం, పసుపు పూసి వేపాకులతో అలంకరిస్తారు. అమ్మవారికి మైల తీర్చడానికి లేదా తృప్తి పరచడానికి కల్లు సాక పోస్తారు. ఇక్కడ ప్రధాన దేవతలు మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, నూకాలమ్మ. ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల ప్రాంగణంలోనే సామూహిక పొయ్యిలపై పొంగళ్లు వండుతారు. బోనాలకు వేర్వేరు రకాల మట్టి పాత్రలు, వెయ్యికండ్ల దుత్తలు (రంధ్రాల కుండలు) వాడతారు. ఇక్కడ కల్లు సాక పోసే సంప్రదాయం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రధాన దేవతలు పోలేరమ్మ, గంగమ్మ, అంకాలమ్మ, మావురమ్మ, చౌడేశ్వరి.

  వర్తమాన సామాజిక-రాజకీయ ప్రాధాన్యం

2014 లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం బోనాల ఉత్సవాలను అధికారిక ‘రాష్ట్ర పండుగ’గా గుర్తించింది. ఈ గుర్తింపు ద్వారా జానపద సంస్కృతికి, శ్రామిక వర్గాల ఆచారాలకు ప్రభుత్వ పరంగా అత్యున్నత గౌరవం లభించింది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ప్రభుత్వం తరఫున మంత్రులు, ఉన్నతాధికారులు నగరంలోని ప్రధాన దేవాలయాలకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ప్రస్తుత సంవత్సరం  జూలై 16న ప్రారంభమయ్యే బోనాల పండుగ తొలి బోనం జులై 19 కోసం గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి ఆలయం వద్ద పురాతన కోట పరిధిలో క్యూ లైన్లు, పారిశుధ్యం, తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. జూలై 20, 21, 22న జరిగే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం (20న ఎదుర్కోలు, 21న కల్యాణం, 22న రథోత్సవం) కోసం దేవాదాయ శాఖ, జీహెచ్ఎంసీ, పోలీస్ విభాగాల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 2, 3న జరిగే సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలు, రంగం కోసం భక్తుల రద్దీని తట్టుకునేందుకు భారీ బారికేడ్లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు.

ఆగస్టు 9న లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల (ముగింపు ఉత్సవాలు) కోసం ఫలహారం బండ్ల ఊరేగింపు, శాంతిభద్రతల పరిరక్షణ కోసం షీ టీమ్స్ ను ఏర్పాటు చేశారు. పాత జీహెచ్ఎంసీ పరిధిలోని 3427 దేవాలయాలకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో రూ. 15,05,41,150 విడుదల చేశారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి భక్తులు సులభంగా హైదరాబాద్ రావడానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో కనిపించడంలేదనే విమర్శలు వస్తున్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ, జీహెచ్ఎంసీ, పోలీస్, మెట్రో వాటర్ బోర్డ్, విద్యుత్ శాఖ వంటి అన్ని విభాగాల అధికారులు పరస్పరం సమన్వయంతో వ్యవహరిస్తున్నారని మంత్రులు చెబుతున్నారు. గోల్కొండ, ఉజ్జయిని మహంకాళి, చిలకలగూడ కట్ట మైసమ్మ, హరిబౌలి అక్కన్న-మాదన్న వంటి నగరంలోని 30 కి పైగా ప్రధాన దేవాలయాలకు ప్రభుత్వం అధికారికంగా పట్టువస్త్రాలను సమర్పిస్తుందంటున్నారు. శతాబ్దాల చారిత్రక పరిణామక్రమం కలిగిన ఆషాఢ బోనాలు నేడు కేవలం ఒక ఆధ్యాత్మిక క్రతువుగానే కాకుండా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, జీవన విధానానికి, సాంస్కృతిక అస్తిత్వానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. పాత కాలపు మాతృదేవతారాధన నుంచి నేటి ఆధునిక రాష్ట్ర ఉత్సవం వరకు బోనాల పండుగ ప్రయాణం అద్భుతమైనది. నిరంతరాయమైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *