రణరంగంగా గాంధీ భవన్

– మంత్రుల సమక్షంలోనే నేతల బాహాబాహీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27: హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ సమావేశంలో ఘర్షణ చోటుచేసుకుంది. గాంధీ భవన్‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్, ప్రభుత్వ సలహాదారు వీహెచ్, ఎమ్మెల్సీలు బల్మూమూరి, అద్దంకి దయాకర్‌ల సమక్షంలోనే నేతలు ఫిరోజ్‌ఖాన్, ఉస్మాన్ అల్ హజీ బాహాబాహీకి దిగారు. ప్రొటోకాల్ విషయంలో వీరి మధ్య గొడవ జరిగింది. అజహరుద్దీన్ పక్కన కూర్చునే అంశంలో వివాదం చెలరేగింది. ఈ క్రమంలో ఉస్మాన్ అల్ హజీ నెట్టివేయడంతో ఫిరోజ్‌ఖాన్ కిందపడిపోయారు. ఈ ఘర్షణను అడ్డుకునేందుకు సీనియర్ నేత వీహెచ్ యత్నించగా ఆయన్ను కూడా నెట్టివేసేలా వ్యవహరించడంతో నేతలు అడ్డుకున్నారు. ఈ పరిణామంతో మంత్రి అజహరుద్దీన్ అక్కడి నుంచి వెళ్లిపోగా సమావేశం ముగిసినట్లు మంత్రి పొన్నం ప్రకటించారు. ‘సర్’ ప్రక్రియపై చర్చించేందుకు బుధవారం ఏర్పాటు చేసిన ఈ సమావేశం తీవ్ర ఉద్రిక్తతకు వేదిక అయింది. మంత్రి మహ్మద్ అజారుద్దీన్ పక్కన కూర్చునే విషయంలో ఫిరోజ్‌ఖాన్, కార్వాన్ ఇన్‌చార్జ్ ఉస్మాన్ ఆల్ హాజ్రీల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. మొదట మాటల యుద్ధంతో ప్రారంభమైన ఈ గొడవ కాస్తా శృతిమించి ఒకరి చొక్కాలు ఒకరు పట్టుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే ఆగ్రహంతో ఉస్మాన్.. ఫిరోజ్‌ఖాన్‌ను గట్టిగా తోసేయడంతో ఆయన  కిందపడిపోయారు. గాంధీభవన్‌లో సీనియర్ నేతల సమక్షంలోనే ఈ రసాభాస జరగడంతో అక్కడున్న పార్టీ శ్రేణులు షాక్‌కు గురయ్యారు. ఈ గొడవ మరింత పెద్దది కాకుండా ఉండేందుకు అక్కడే ఉన్న సీనియర్ నేత వీహెచ్ జోక్యం చేసుకుని ఇరువర్గాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆవేశంలో ఉన్న నేతలు వీహెచ్‌ను కూడా పక్కకు తోసేసేందుకు ప్రయత్నించడంతో వాతావరణం మరింత వేడెక్కింది. వెంటనే అప్రమత్తమైన మిగతా నాయకులు, భద్రతా సిబ్బంది ఇరువర్గాలను విడదీయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *