మహావీర్ జైన్ సంస్థ సేవలు అభినందనీయం
మాది పీపుల్స్ ఫ్రెండ్లీ గవర్నమెంట్
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా సేవలు అందిస్తున్న సామాజిక సంస్థలకు ప్రజా ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం ఆయన శంషాబాద్ రోడ్ లోని సిటాడెల్ కన్వెన్షన్ లో 30వ అంతర్జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సామాజిక పరివర్తన కోసం ఎటువంటి లాభాపేక్ష లేకుండా మహావీర్ జైన్ సంస్థ పనిచేయడం అభినందనీయమని అన్నారు. చిన్నారులు, మహిళల సాధికారికత కోసం, వైద్య సహకారం అవసరమైన వారికి మహావీర్ సంస్థ ఉచితంగా సేవలు అందించడం గొప్పవిషయమని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం కూడా విద్యార్థులు, మహిళలు, వైద్య రంగాల్లో విశిష్ట కృషి చేస్తుందని తెలిపారు. మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడానికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికైనా ఉచితంగా ప్రయాణం చేసే వెసులుబాటు కల్పించామని చెప్పారు.
మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రతి సంవత్సరం 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని అందులో భాగంగా మొదటి సంవత్సరం 19 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇప్పటికే స్వయం సహాయక సంఘాలకు అందించినట్లు తెలిపారు. ఇలా ఐదు సంవత్సరాల్లో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకు పోతున్నట్లు తెలిపారు. ఉచితంగా నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాది 5వేల కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంరక్షణకు రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచామన్నారు. పది లక్షల వరకు నిరుపేదలు రూపాయి కూడా చెల్లించకుండా ఉచితంగా వైద్య సహాయం అందిస్తున్నట్టు వివరించారు.
దేశ రాజధాని దిల్లీలో విపరీతమైన కాలుష్యం మూలంగా నివాసానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఆ పరిస్థితులు హైదరాబాద్‌లో తలెత్తకుండా క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతున్నామని, ఇందులో భాగంగా కాలుష్య కారకమైన పరిశ్రమలను హైదరాబాద్ నగరం నుంచి ఔటర్ రింగ్ రోడ్డు బయటకు తరలిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి పదివేల కోట్లు బడ్జెట్లో కేటాయించామని చెప్పారు. రాష్ట్రంలో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి కొత్త విద్యుత్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీసుకురాబోతుందని వివరించారు. తమది పీపుల్స్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని భట్టి విక్రమార్క అన్నారు.





