– సిద్దిపేట ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన ఉదయ్ నాగరాజు
– మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశంసలు
– బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ కు ఎన్నికైన సందర్భంగా సన్మానం
సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 12: బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ లార్డ్స్ కు ఎన్నికైన సిద్దిపేట ముద్దుబిడ్డ ఉదయ్ నాగరాజు పౌర సన్మాన కార్యక్రమం సిద్దిపేటలోని విపంచి కళా నిలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్ర మానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరై ఉదయ్ నాగరాజును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ ఉదయ్ తన పేరుకు తగ్గట్లే సార్థకత తీసుకొచ్చారని, తెలంగాణ ఉదయం బ్రిటన్లో వెలుగొందుతున్నారని ప్రశంసించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి బ్రిటన్ పార్ల మెంటుకు ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తి ఉదయ్ రాజే అని, కేవలం 47 ఏళ్ల చిన్న వయసులోనే దేశ చట్టసభకు ఎన్నికైన తొలి భారతీయుడు కావడం మనందరికీ గర్వకారణం అన్నారు. ఒక చిన్న పల్లెటూరులో పుట్టి బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికయ్యే స్థాయికి ఎదగడం వెనుక ఆయన అపారమైన కృషి, పట్టుదల ఉన్నాయన్నారు. కలలు కనాలి, వాటిని సాకారం చేసుకోవాలి అనడానికి ఉదయ్ జీవితమే ఒక ఉదాహరణ అని, యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి మనిషిలో ఒక అద్భుతమైన సామర్థ్యం ఉంటుందని, దానిని వెలికితీసి కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని స్పష్టం చేశారు. ఉదయ్ తో తనకు రెండున్నర దశాబ్దాల అనుబంధం ఉందని హరీశ్ రావు గుర్తుచేసుకున్నారు. ఆయన వివాహానికి కూడా తాను హాజరయ్యానని, ఆయన ఎంపీ కాకముందు లండన్ లోని వారి ఇంటికి కూడా వెళ్లానని పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడ మనమంతా ఎలాగైతే పోరాడామో లండన్ లో ఉదయ్ నాగరాజు కూడా మాతృభూమి కోసం ఉద్యమానికి అంతేస్థాయిలో మద్దతు తెలిపి తన వంతు భాగస్వామ్యం అందించారని కొనియాడారు. లండన్ లో ఉంటున్నప్పటికీ వారి అమ్మాయి అక్కడ భరతనాట్యం, కూచిపూడి నేర్చుకుంటోందని, వారు ఎంతో దూరంలో ఉన్నా మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను మరువకుండా పాటిస్తుండటం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఉదయ్ నాగరాజుకి సన్మానం చేయడం అంటే సిద్దిపేట ప్రజలకు, తెలంగాణకే కాకుండా యావత్ భారతీయులకు గర్వకార ణం అన్నారు. భవిష్యత్తులో బ్రిటన్ లో ఆయన మరిన్ని ఉన్నతమైన పదవులు పొందాలని, అక్కడి ప్రజలకు గొప్ప సేవలు అందించాలని మనసారా కోరుకుంటూ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని హరీశ్ రావు ఆకాంక్షించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



