– అవకతవకల వార్తలు పరిశీలించి చర్యలు తీసుకోండి
– ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13 : సింగరేణి సంస్థలో అవకతవకలు, అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ ఇటీవల మీడియాలో కొన్ని కథనాలు, వార్తలు ప్రచురితమయ్యాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ దృష్టికి తీసుకొచ్చారు. ఈమేరకు ఆయన ఒక లేఖ రాశారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంలో నడుస్తున్న సింగరేణి కాలరీస్ కంపెనీకి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో సింగరేణి కీలకమైనది. దేశంలోని బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి గణనీయమైన పాత్ర పోషిస్తూ దేశ ఇంధన భద్రతకూ విశేషంగా దోహదపడుతోంది. ఇలాంటి సంస్థ నిరంతర అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం అనేవి అత్యంత ప్రాధాన్యమైన అంశాలు. ఈ సందర్భంలో ఇలాంటి అవకతవకలు, అక్రమాలకు సంబంధించిన వార్తల్లోని నిజానిజాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోకపోతే సింగరేణి ప్రయోజనాలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. దాదాపు రూ.1,600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు అదృశ్యమైందని, దీనివల్ల సంస్థకు గణనీయమైన ఆర్థిక నష్టం సంభవించినట్లు ఈ పత్రికల కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.51,500 కోట్లకు పైగా బకాయిల కారణంగా సింగరేణి ఆర్థికంగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న తరుణంలో ఇలాంటి వార్తలు సంస్థ ఆర్థిక స్థిరత్వాన్ని మరింతగా దెబ్బతీసే ప్రమాదం ఉంది. వీటిని తక్షణమే పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టకపోతే సింగరేణి ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం పడటమేకాక సంస్థ భవిష్యత్ అభివృద్ధి, స్థిరత్వానికి కూడా ఆటంకం కలగవచ్చు.. అందువల్ల వాస్తవాలను పరిశీలించి ఆరోపణల్లోని నిజానిజాలపై సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నాను. అలాగే సింగరేణి సమర్థవంతమైన నిర్వహణ కోసం తగిన సేఫ్ గార్డ్స్, మెకానిజం, ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ సరిగ్గా అమలవుతోందా అనే అంశాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉంది.. ఈ సమీక్షలో టెక్నాలజీ బేస్డ్ మానిటరింగ్ టూల్స్ వినియోగించడం అవసరమని భావిస్తున్నాను.. అలాగే సమయానుగుణంగా సమీక్షలను నిర్వహించడం ద్వారా లోపాలను ప్రారంభ దశలోనే గుర్తిస్తే వెంటనే పరిష్కరించేందుకు వీలవుతుంది. ఈ ప్రయత్నం ద్వారా వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను తొలగించడమే కాక భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా నిరోధించడంతోపాటు సంస్థ సామర్థ్యం, పారదర్శకత, విశ్వసనీయతను మరింత బలోపేతం అవుతుంది.. సంస్థ సజావుగా పనిచేయడంలో సంస్థ కోసం ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం విషయంలోనూ మీరు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరుతున్నాను అని ఆ లేఖలో ప్రస్తావించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





