హెల్త్ కేర్ ఇన్నోవేషన్స్ కేంద్రంగా హైదరాబాద్

– రాబోయే ముప్పును ముందే అంచనా వేసే స్థాయికి వైద్య రంగం
– ఏఐ ఎప్పటికీ వైద్యుడికి ప్రత్యామ్నాయం కాదు
– ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఏఐ ఇన్ హెల్త్ కేర’లో మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13 : హెల్త్ కేర్ ఇన్నోవేషన్స్ కేంద్రంగా హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలపాలన్నదే తమ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా, ఆవిష్కర్తలను ప్రోత్సహించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ‘ఎకో సిస్టం’ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. హైటెక్ సిటీలోని యశోదా హాస్పిటల్‌లో రెండ్రోజులపాటు నిర్వహించనున్న ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఏఐ ఇన్ హెల్త్ కేర’ను ఆయన శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఏఐ ఏదో ఒక రంగానికి మాత్రమే పరిమితం కాలేదని, అన్నింటికీ విస్తరించి మానవ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు. ముఖ్యంగా వ్యాధి నిర్ధారణ దశకే పరిమితం కాకుండా రాబోయే ముప్పును ముందే అంచనా వేసే స్థాయికి వైద్య రంగాన్ని చేర్చిందన్నారు. అలాగే ప్రతి రోగికి ప్రత్యేక వ్యక్తిగత వైద్య సంరక్షణను అందించే సాధనంగా మారిందన్నారు. అయితే ఏఐ ఎప్పటికీ వైద్యుడికి ప్రత్యామ్నాయం కాలేదని స్పష్టం చేశారు. సాంకేతికతకు మానవీయ విలువల్ని జోడించినప్పుడే సమాజానికి మేలు జరుగుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల జనాభా పెరుగుతున్న తరుణంలో క్యాన్సర్, గుండె జబ్బులు వంటి క్లిష్టమైన ఆరోగ్య సవాళ్లకు సరికొత్త పరిష్కారాలు, ఆవిష్కరణలు రావాల్సిన అవసరముందన్నారు. అందుకు హైదరాబాద్‌ను ఒక లాంచ్ ప్యాడ్‌గా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. అకాడెమియా, ఇండస్ట్రీ మధ్య బలమైన అనుసంధానం ఏర్పడినప్పుడే ఏఐ హెల్త్ కేర్ ఆవిష్కరణలు సామాన్యుడికి అందుతాయన్నారు. భవిష్యత్తు సవాళ్లను ముందే ఎదుర్కొనేలా కొత్త ఆలోచనల్ని ప్రోత్సహించే ఇన్నోవేషన్ ఆధారిత వ్యూహాలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. ఆవిష్కరణలు కేవలం ల్యాబ్‌లకే పరిమితం కాకుండా సమాజంలో నిజమైన మార్పును తీసుకొచ్చేలా ఆవిష్కర్తలు, స్టార్టప్స్‌కు మార్గనిర్దేశం చేస్తున్నామన్నారు. పరిశోధనలకు ఊతమిచ్చేలా దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత డేటా ఎక్స్‌ఛేంజ్‌ను ప్రారంభించామన్నారు. లైఫ్ సైన్సెస్‌లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ‘వన్ బయో’ పేరిట ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామన్నారు. స్టార్టప్స్‌కు అండగా నిలిచేందుకు ‘ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ ’ను ఏర్పాటు చేశామని మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. హైదరాబాద్ వేదికగా గ్లోబల్ హెల్త్ టెక్ విప్లవంలో భాగస్వామ్యం కావాలని నిపుణులు, ఆవిష్కర్తలు, కంపెనీలు, స్టార్టప్స్‌ను సాదరంగా ఆహ్వానించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *