కోల్‌కతా హోటల్‌లో అగ్నిప్రమాదం

– అర్ధరాత్రి వేళ ఘ‌ట‌న.. 9మంది మృత్యువాత
– మృతులు బంగ్లాదేశీయులుగా గుర్తింపు

కోల్‌కతా, ఆగస్టు 19 : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని మీర్జా గాలిబ్ వీధిలో ఉన్న ఓ హోటల్‌లో మంగళవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఆ దుర్ఘటనలో ఓ చిన్నారి సహా తొమ్మిదిమంది చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. రాత్రి 1.45 నిమిషాలకు ప్రమాదం చోటుచేసుకున్నది. అగ్నిమాపక సిబ్బందితోపాటు పోలీసులు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గాయపడిన వారిని సమీప హాస్పిటల్‌కు తరలించారు. దట్టమైన పొగ కమ్ముకోవడంతో పై అంతస్తులకు చేరుకోవడానికి అగ్నిమాపక సిబ్బంది ఇబ్బందిపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. న్యూ మార్కెట్ ప్రాంతంలోని ప్రీ స్కూల్ వీధిలో ఈ హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మృతిచెందిన వారందరూ బంగ్లాదేశీయులేనని అగ్నిమాపక శాఖ తెలిపింది. వైద్యం కోసం వారు కోల్‌కతాకు వచ్చారని అధికారులు తెలిపారు. ఏసీ పేలడంతో మూడో అంతస్తులో మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఘటనకు గల కారణం ఇంకా వెల్లడించలేదు. మంటలు చెలరేగగానే హోటల్‌లోని కొందరు బయటకు పరుగుతీశారు. అగ్నికీలలు చుట్టూ ఉన్న ఇళ్ల వైపు వ్యాపించడంతో ప్రజలు హాహాకారాలు చేశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చారు. దట్టమైన పొగ వ్యాపించడంతో సహాయ కార్యక్రమాలకు ఇబ్బంది కలిగిందని ఓ పోలీసు అధికారి తెలిపారు. కాగా, రెండు రోజుల క్రితం బిర్భూమ్ జిల్లాలోని ఓ హోటల్ అగ్నిప్రమాదం సంభవించి ఎనిమిదిమంది మరణించగా పలువురు గాయపడిన విషయం విదితమే.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *