– అన్నదాత కన్నీరు కనిపించడం లేదా?
– కటింగ్‌లతో మిల్లర్ల దోపిడీ
– ప్రభుత్వ తీరుపై హరీశ్‌రావు ఆగ్రహం
సిద్దిపేట, ప్రజాతంత్ర, మే 30: రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోందని, కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన వడ్లు పోసి 50 రోజులుగా ఎదురుచూస్తున్న రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన హరీశ్‌రావు, కేంద్రంలో ఇంకా 40 నుంచి 50 లారీల మేర ధాన్యం పేరుకుపోయి ఉండగా ఆరు రోజులకో లారీ పంపడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిల్లర్లు క్వింటాల్‌కు ఐదారు కిలోల వరకు కటింగ్‌లు పెడుతూ రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. తక్షణమే కొనుగోళ్లు వేగవంతం చేసి, కటింగ్‌లు లేకుండా ధాన్యం దిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించారు.రైతులు ఇన్ని రోజులు కష్టపడి పండించిన ధాన్యాన్ని బీ-గ్రేడ్‌గా చూపించి వేల రూపాయల నష్టం కలిగిస్తున్నారని అన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులు ధాన్యం అమ్ముకోవడానికి ఇలాంటి ఇబ్బందులు పడలేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మిల్లర్ల దయాధర్మాలపై వదిలేసిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచగా, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లలో విఫలమై రైతులను రెండు వైపులా నష్టపరుస్తోందని అన్నారు. వెంటనే రైతుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా రైతు ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.
పోచమ్మ ఆశీస్సులతో మంచి రోజులు రావాలి
సిద్దిపేట రూరల్ మండలం తొర్నాలలో నిర్వహిస్తున్న పోచమ్మ దేవాలయ ఉత్సవాల్లో హరీశ్‌రావు పాల్గొన్నారు. గ్రామస్తులు డప్పు చప్పుళ్లు, హారతులతో ఘన స్వాగతం పలకగా, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, గ్రామ దేవత పోచమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, రైతులు పాడిపంటలతో సస్యశ్యామలంగా ఉండాలని ప్రార్థించారు.తొర్నాల గ్రామ దేవాలయ నిర్మాణానికి తాను ఆర్థిక సహాయం అందించడంతో పాటు గ్రానైట్, సిమెంట్ వంటి నిర్మాణ సామగ్రి కూడా సమకూర్చినట్లు తెలిపారు. గ్రామంలో కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్లు, గ్రామ ఆర్చ్ పునర్నిర్మాణం, మొక్కజొన్న పరిశోధనా కేంద్రం, పాలిటెక్నిక్ కళాశాల వంటి అభివృద్ధి కార్యక్రమాలు తమ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని గుర్తుచేశారు.కాళేశ్వరం జలాలు రావడంతో గ్రామంలో వ్యవసాయం అభివృద్ధి చెందినప్పటికీ, ప్రస్తుతం రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికే ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రైతులకు మళ్లీ మంచి రోజులు రావాలని పోచమ్మ తల్లిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
సాగునీటి సమస్యల పరిష్కారానికి శ్రీకారం
హరీశ్‌రావు శనివారం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. రైతుల సాగునీటి సమస్యలను పరిష్కరించే దిశగా రాఘవపూర్లోని ఇంద్రగూడెం తూము మరమ్మత్తు పనులను హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.వ్యవసాయానికి నీరే ప్రాణాధారమని పేర్కొన్న హరీశ్‌రావు, రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా నిరంతరం కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
‘రైతు డిస్కం’ పేరుతో పగటిపూట విద్యుత్
సమస్య వస్తే పావుగంటలో స్పందించిన బీఆర్ఎస్ పాలన ఎక్కడ.. రైతులను గాలికొదిలేసిన ఈ కాంగ్రెస్ పాలన ఎక్కడ అంటూ రైతులు ఆవేదన చెందుతున్నారని హరీష్‌రావు అన్నారు. నంగునూరు మండలం మీదుగా వెళ్తూ మార్గమధ్యలో ముండ్రాయిలో ఆగి రైతులతో ముచ్చటించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను రైతులు చెప్పుకున్నారు. వారి ఆవేదనను విన్న హరీశ్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై మండిపడ్డారు. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తున్న రైతు డిస్కం వల్ల రైతుల ఉచిత విద్యుత్‌కు ఉరితాడు పడబోతోందన్నారు. రైతు డిస్కంకు సోలార్ పవర్ మాత్రమే కేటాయిస్తారు.. అంటే పొద్దున సూర్యుడు వచ్చిన తర్వాతే మోటార్లు ఆన్ అవుతాయి, సాయంత్రం 5 గంటలకు ఎండ పోగానే మోటార్లు బంద్ అవుతాయి.. దీనివల్ల రైతులకు 7 నుంచి 8 గంటల కరెంటు మాత్రమే వస్తుంది అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక్కడి భూముల ధర ఎకరాకు రూ.50 లక్షలు పలికేది.. కాంగ్రెస్ పాలనలో పాతాళానికి పడిపోయాయని అన్నారు. రూ.30 లక్షలకు ఇస్తామన్నా కొనే నాథుడు లేడన్నారు. తన కొడుకు పైలట్ చదువు ఫీజు కట్టడానికి భూమి అమ్ముకుందామంటే ఎవరూ కొనట్లేదని స్వయంగా మాజీ సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేయడం ఈ ప్రభుత్వ అసమర్థతకు అద్దం పడుతోందన్నారు. రైతులను ఆదుకుంటామని గొప్పలు చెప్పిన ఈ ప్రభుత్వం రాగానే రైతుబంధుకు ఎగనామం పెట్టిందని విమర్శించారు. చాలామందికి రైతుబంధు రాలేదు, మూడు ఎకరాల వరకే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇంకోవైపు యూరియా దొరకక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. నాడు కేసీఆర్ పాలనలో రైతులు పండించిన పంటను ఏ రకమైన ఇబ్బంది లేకుండా కొనుగోలు చేశాం. కానీ నేడు కొనుగోలు కేంద్రాల్లో ఏ-గ్రేడ్ అనేది లేకుండా చేసి కటింగ్ పేరుతో రైతులను నిలువునా దోచుకుంటున్నారు. పంట పండించడానికి ఒక కష్టం అయితే ఆ పంటను అమ్ముకోవడానికి రైతులు నానా తిప్పలు పడాల్సి వస్తోంది. బీఆరఎస్ ప్రభుత్వంలో ఏ చిన్న సమస్య వచ్చినా ఒక్క మెసేజ్ పెడితే పావుగంటలో పరిష్కారం అయ్యేదని, ఇప్పుడు పట్టించుకునే నాథుడే లేడని రైతులు వాపోవడం బాధాకరమని అన్నారు. మీ తరఫున ప్రతిరోజూ మీడియా వేదికగా నేను ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నాను. మీ సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం మెడలు వంచి మీ పక్షాన నిలబడి కొట్లాడుతాను అని హరీష్‌రావు అభయమిచ్చారు.
——————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.