మోర్తాడ్‌లో హైవేపై రైతుల ధర్నా

– ధాన్యం కొనుగోళ్లు, తరుగు దోపిడీపై నిరసనలు
– అధికారులు స్పందించడం లేదన్న మాజీ మంత్రి వేముల

నిజామాబాద్, ప్రజాతంత్ర, మే 11: ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలని, తరుగు దోపిడీని అరికట్టాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో రైతులతో కలిసి జాతీయ రహదారిపై సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సమస్యలపై కలెక్టరుకు, మంత్రులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదన్నారు. దొడ్డు రకం ధాన్యానికి గ్రేడ్ వన్ ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కల్లాల్లో ధాన్యాన్ని తరలించేందుకు లారీల కొరతను తీర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. లేదంటే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. వడ్ల కొనుగోళ్ల పక్రియ నత్తనడకన సాగుతున్నదని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. పంటను అమ్ముకోవడానికి రైతులు నెల రోజులుగా ఇబ్బందులు పడుతున్నారని, దీనికి ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. మూడు రోజులుగా పలు కొనుగోలు కేంద్రాలను స్వయంగా సందర్శించానని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకరావడానికి రైతు నిరసన, ధర్నా కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేస్తామని ప్రకటించి కేంద్రాలు తెరిచేసరికి 15 రోజులు, గన్నీ బ్యాగులు వచ్చేసరికి వారం, కాంటా పెట్టేసరికి మరో వారం అన్నట్లు 20 రోజులపాటు జాప్యం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వ జాప్యం భరించలేక రైతులు గత్యంతరం లేక ప్రైవేట్ వ్యక్తులకు రూ.1,750 నుంచి రూ.1900లకే అమ్ముకుంటున్నారని, దీంతో ఎకరాకు సుమారు రూ.15వేలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని, తరుగు పేరుతో 40 కిలోలకు 5 కిలోల అదనపు వడ్లు (క్వింటాలుకు 12.5 కిలోలు) దోచుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో 1.5 కిలోలు మాత్రమే ఉండేదని గుర్తు చేశారు. వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని, రవాణాకు లారీలను పెంచాలని, గన్నీ బ్యాగుల కొరత తీర్చాలని, తరుగును తగ్గించి, పాత పద్ధతిలోనే వడ్లు సేకరించాలని, దొడ్డు రకానికి గ్రేడ్ -1 రేటుతోపాటు రూ.500 బోనస్ వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేసే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని రైతులు, బీఆర్‌ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *