తెలంగాణపై తప్పుడు వ్యాఖ్యలు త‌గ‌వు

– బీజేపీ నాయకులపై ప్రొఫెసర్ కోదండరాం ఆగ్రహం
– మే 12న జేఎస్ ప్లీనరీ.. పోస్టర్ ఆవిష్కరణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య సందర్భం లేకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తప్పుడు ఆరోపణలు చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని తెలంగాణ జన సమితి(టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.  టీజేఎస్ రాష్ట్ర నాల్గవ ప్లీనరీ పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని గుర్తు చేశారు. ఇంగిత జ్ఞానం లేకుండా బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులకు తెలంగాణ ఏర్పాటును ముడిపెడుతూ తేజస్వి సూర్య అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. పార్లమెంటులో ఎంపీ మాట్లాడుతున్న సమయంలో కేంద్ర మంత్రులు, ఆ పార్టీ ఎంపీలు ఆయనను నిలవరించకపోవడం బాధాకరమన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు సుష్మా స్వరాజ్, వెంకయ్య నాయుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. గతంలో కూడా నరేంద్ర మోదీ రాష్ట్ర ఏర్పాటును కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తేజస్వి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించి ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, డీలిమిటేషన్ బిల్లుపై స్పందిస్తూ సీట్ల కేటాయింపు జనాభా ప్రాతిపదికన జరుగుతుందని, అది 2011 జనాభా లెక్కల ప్రకారమా లేదా 2026 జనాభా లెక్కల ప్రకారమా అన్న విషయంలో స్పష్టత అవసరమని అన్నారు. 2026 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేపట్టాలని కోరారు. ఈ ప్రక్రియ ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య అసమానతలను పెంచే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలకు సముచిత భాగస్వామ్యం ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. దేశ ప్రయోజనాలను పక్కనబెట్టి డీలిమిటేషన్ బిల్లు తీసుకురావడం బాధాకరమన్నారు. తమ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో సీట్లు పెంచుకుని ఆధిపత్యాన్ని పెంచుకోవాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఆమోదించకపోవడం ఇదే ధోరణికి ఉదాహరణ అన్నారు. మే 12న టీజేఎస్ 4వ ప్లీనరీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్లీనరీలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. అనంతరం పార్టీ కార్యాలయం ఎదుట తేజస్వి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *