శంషాబాద్‌లో నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్‌

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 : పోలీసులు, అధికారులు పటిష్ఠమైన చర్యలు చేపట్టినా ఫేక్ కరెన్సీ ముఠా ఆగడాలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా శంషాబాద్‌లో నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్‌లో చూసి నకిలీ నోట్లు తయారు చేస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని అరెస్టు చేయగా మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి రూ.2.91 లక్షల విలువ చేసే నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు ప్రింటర్, స్కానర్, లామినేటర్ తదితర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కుటుంబం నకిలీ రూ.500, రూ.200, రూ.100 నోట్లు తయారీ చేస్తూ ఎక్కువగా రాత్రివేళల్లోనే నకిలీ నోట్లు చలామణి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మద్యం దుకాణాలు, పాన్ డబ్బాల వద్ద నకిలీ నోట్లు ఇస్తున్నట్లు తెలుసుకున్నారు. నిందితుల్ని చింతల్ తండా వడ్డిపట్లకు చెందిన రమావత్ రాము అలియాస్ మహ్మద్(36), రమావత్ మోతీలాల్(35), రమావత్ గాంధీ(19) లుగా గుర్తించారు. వీరిలో రాము ఫుడ్ డెలివరీ ఉద్యోగి కాగా మోతీలాల్ ర్యాపిడో డ్రైవర్ గా, గాంధీ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరికి సహకరించిన మరో నిందితుడు నాగోల్- బండ్లగూడకు చెందిన సుధీర్ జాన్ చెలా అలియాస్ వంశీ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఇక శామీర్ పేట్, బాలాపూర్ పరిధిలో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్నారన్న సమాచారంతో హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ (శాÍమీర్‌పేట జోన్) పోలీసులు, బాలాపూర్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఈ ముగ్గురిని అరెస్టు చేశారు. మరోవైపు నకిలీ కరెన్సీ తయారీ వెనుక మరెవరైనా ఉన్నారా, ఈ నోట్లు ఎక్కడెక్కడ చలామణి అయ్యాయి అనే కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న సుధీర్ జాన్ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *