– ఎనిమిదిచోట్ల ఆస్తులపై ఆకస్మిక దాడులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 : హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ గంజాయి డాన్ నీతూ బాయ్‌కి ఈడీ షాక్ ఇచ్చింది. ఆమెకు సంబంధించిన ఇళ్లు, ఆస్తులపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తక్కువ కాలంలో గంజాయి దందాతో కోట్లు సంపాదించిందని, ఆ డబ్బును హవాలా మార్గాల ద్వారా తరలించిందనే ఆరోపణలతో హైదరాబాద్‌లోని ఎనిమిదిచోట్ల ఈడీ తనిఖీలు జరుగుతున్నాయి. ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన కేసు ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో ఈడీ ఈ చర్యలు చేపట్టింది. నీతూబాయి గంజాయి అమ్మకాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించినట్లు, ఆ డబ్బును హవాలా మార్గాల ద్వారా తరలించి వివిధ ఆస్తులు, లావాదేవీల రూపంలో మార్చినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. అందుకే ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, ఆస్తుల వివరాలపై ప్రత్యేక దృష్టి సారించి సోదాలు చేస్తున్నారు. సోదాల్లో కీలక పత్రాలు, నగదు లావాదేవీల రికార్డులు, ఆస్తులకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ కార్యకలాపాలు పూర్తయిన తర్వాతే ఈడీ అధికారులు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. గంజాయి వ్యాపారం నుంచి వచ్చిన అక్రమ ఆదాయాన్ని రికవరీ చేసే అంశంపై దృష్టి సారించి ఈ చర్యలు జరుగుతున్నాయి. ఈ సోదాలు నీతూబాయి నెట్‌వర్క్‌ను పట్టుకునేందుకు దోహదం చేస్తాయని భావిస్తున్నారు. ఇప్పటికే గంజాయి కేసులో పట్టుబడి జైలు పాలైనప్పటికీ మళ్లీ గంజాయి దందా కొనసాగిస్తూ పోలీసులకు, ఈగల్ టీమ్‌కు నీతూబాయ్ సవాల్ విసిరింది. హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలోని నానక్‌రాంగూడా లోధా బస్తీలో ఉన్న తన ఇంటి ముందు రోడ్డు ఆక్రమించి నిర్మించిన కిరాణా దుకాణం, రేకుల షెడ్డును మున్సిపల్ అధికారులు ఇటీవల కూల్చివేశారు. ఈ దుకాణం కేంద్రంగా ఐటి ఉద్యోగుల, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు నీతూబాయ్ గంజాయి సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




