ప్రశ్నాపత్రాల లీకేజీ నివారణకు పాలనా సంస్కరణలు అవసరం

భారతదేశంలో పోటీ పరీక్షలు కేవలం విద్యా వ్యవస్థలో భాగం మాత్రమే కాదు; కోట్లాది మంది యువత భవిష్యత్తును నిర్ణయించే కీలక ప్రక్రియ. వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించే నీట్ (NEET), వివిధ ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షలు, రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్షలు, నియామక పరీక్షలు వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీల బారిన పడటం దేశ పరీక్షా వ్యవస్థ విశ్వసనీయతపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది. ప్రశ్నాపత్రం లీక్ కావడం అనేది కేవలం ఒక నేరం మాత్రమే కాదు; అది నిజాయితీగా శ్రమించిన లక్షలాది మంది విద్యార్థులను …వారి తల్లితండ్రుల ఆశలను కొల్లగొట్టే వ్యవస్థ చేస్తున్న నేరం..ఆ నేరానికి కారణమైన వారిని నిర్దాక్షిణ్యంగా అతి తీవ్రమైన శిక్ష విధించాలి. గత కొన్నేళ్లలో వెలుగులోకి వొచ్చిన ఘటనలు చూస్తే ప్రశ్నాపత్రాల లీకేజీలు యాదృచ్ఛిక సంఘటనలు కావని స్పష్టమవుతోంది. వీటి వెనుక సంఘటిత నేర ముఠాలు, పరీక్షల నిర్వహణలోని లోపాలు, కొందరు అధికారుల కుమ్మక్కు, సాంకేతిక భద్రతలోని బలహీనతలు ఉన్నాయనే ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. పరీక్ష రద్దు, మళ్లీ నిర్వహణ, కోర్టు కేసులు, విచారణలు—ఈ ప్రక్రియ అంతా ప్రభుత్వంపై ఆర్థిక భారం మోపడంతో పాటు విద్యార్థులపై తీవ్రమైన మానసిక ఒత్తిడిని పెంచుతోంది. కోట్లాది రూపాయల ప్రజాధనం తిరిగి పరీక్షల నిర్వహణకు ఖర్చవుతుండగా, విద్యార్థులు కోచింగ్, ప్రయాణం, వసతి వంటి ఖర్చులను మరోసారి భరించాల్సి వొస్తున్నది.

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పరీక్షా వ్యవస్థలలో ఒకటి. ప్రతి సంవత్సరం కోట్లాది మంది పరిమితమైన సీట్లు, ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలపై విశ్వాసం దెబ్బతింటే అది కేవలం విద్యా రంగానికే కాదు, దేశ పరిపాలనా వ్యవస్థపై ప్రజల నమ్మకానికీ దెబ్బతీస్తుంది. ప్రతిభకు బదులుగా అక్రమాలకు అవకాశముంటుందనే భావన యువతలో పెరిగితే ప్రజాస్వామ్య వ్యవస్థకు కూడా అది ప్రమాదకర సంకేతమే.ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రశ్నాపత్రాల లీకేజీల వ్యవహారంలో కొన్ని దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. నందన్ నిలేకని నేతృత్వంలోని సంస్కరణల కమిటీ ఏర్పాటు, కఠినమైన చట్టాలు, భారీ జరిమానాలు, పరీక్షల నిర్వహణలో కొత్త ప్రమాణాల రూపకల్పన వంటి చర్యలు ప్రతిపాదించింది . అయితే కేవలం శిక్షలు పెంచడం లేదా కొత్త చట్టాలు తీసుకురావడం మాత్రమే సమస్యకు శాశ్వత పరిష్కారం కాదనే విషయాన్ని గుర్తించాలి.

ఇప్పుడు అందరి దృష్టి సాంకేతిక పరిజ్ఞానంపై పడింది. గుప్తీకరించిన (ఎన్‌క్రిప్టెడ్) డిజిటల్ ప్రశ్నాపత్రాల పంపిణీ, పరీక్ష కేంద్రాలకు ఆఖరి నిమిషంలో డిజిటల్ డెలివరీ, బయోమెట్రిక్ ధృవీకరణ, కృత్రిమ మేధ (AI) ఆధారిత పర్యవేక్షణ, సీసీటీవీ విశ్లేషణ వంటి పద్ధతులు భద్రతను గణనీయంగా పెంచగలవు. అయితే సాంకేతికత కూడా సర్వరోగ నివారిణి కాదు. వ్యవస్థలో అవినీతి, బాధ్యతారాహిత్యం, అంతర్గత కుమ్మక్కు కొనసాగితే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా దుర్వినియోగం చేసే అవకాశాలు ఉంటాయి.అందువల్ల పరిష్కారం ద్విముఖంగా ఉండాలి. ఒకవైపు ఆధునిక సాంకేతిక భద్రతను అమలు చేయాలి. మరోవైపు పరీక్షల నిర్వహణలో పారదర్శకత, బహుస్థాయి భద్రత, స్వతంత్ర పర్యవేక్షణ, బాధ్యులపై వేగవంతమైన విచారణ, కఠిన శిక్షలు తప్పనిసరి. ప్రశ్నాపత్రాల ముద్రణ నుంచి పరీక్ష ముగిసే వరకు ప్రతి దశను డిజిటల్ ట్రాకింగ్‌లోకి తీసుకురావడం, సిబ్బంది ఎంపికలో కఠిన ప్రమాణాలు పాటించడం, పరీక్షా సంస్థలపై స్వతంత్ర ఆడిట్ నిర్వహించడం కూడా అవసరం.

అంతేకాదు, పరీక్షల వ్యవస్థను పూర్తిగా జ్ఞాపకశక్తి ఆధారిత విధానం నుంచి విశ్లేషణాత్మక, సామర్థ్యాధారిత మూల్యాంకన విధానాల వైపు మళ్లించడం కూడా దీర్ఘకాలిక సంస్కరణల్లో భాగం కావాలి. ఒకే పరీక్షపై విద్యార్థుల భవిష్యత్తు పూర్తిగా ఆధారపడే పరిస్థితిని తగ్గించడం ద్వారా కూడా అక్రమాలకు అవకాశాలు కొంతవరకు తగ్గుతాయి. పరీక్షల భద్రత అనేది కేవలం సాంకేతిక సమస్య కాదు; అది పాలనా నిబద్ధత, సంస్థాగత నిజాయితీ, ప్రజల విశ్వాసానికి సంబంధించిన అంశం. కోట్లాది మంది యువత తమ ప్రతిభపై నమ్మకంతో పరీక్షా హాలులోకి అడుగుపెడతారు. ఆ నమ్మకాన్ని కాపాడటం ప్రభుత్వాల రాజ్యాంగబద్ధ బాధ్యత. సాంకేతిక పరిజ్ఞానం ఒక బలమైన ఆయుధమే అయినప్పటికీ, దానికి పారదర్శక పాలన, బాధ్యతాయుతమైన వ్యవస్థ, అవినీతిపై రాజీలేని వైఖరి తోడైతేనే ప్రశ్నాపత్రాల లీకేజీలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయగలుగుతాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *