– ఆన్‌లైన్, ఆఫ్ లైన్ ద్వారా సలహాలు. సూచనలు స్వీకరణ
– ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కేకే
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16 : తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియలో భాగంగా ఈ నెల 23 నుండి అమరజ్యోతి కేంద్రంగా వివిధ వర్గాలతో సంప్రదింపులు నిర్వహించాలని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ నిర్ణయించింది. విద్యార్థి జేఏసీ ప్రతినిధులు, కళాకారులు, రచయితలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, అడ్వకేట్లు, డాక్టర్స్ తదితర వర్గాలతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు, సూచనలు కమిటీ స్వీకరించనున్నది. హైదరాబాద్‌లోని తెలంగాణ అమరవీరుల స్మారకం అమరజ్యోతిని కమిటీ సభ్యులు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా అమరజ్యోతి ప్రాంగణంలో నిర్మించిన వివిధ గదులను పరిశీలించిన కమిటీ సభ్యులు ప్రత్యేకంగా ఆడియో-విజువల్ రూమ్‌ను సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కమిటీ చైర్మన్ కె.కేశవరావు నేతృత్వంలో కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. 2001 నుండి 2014 వరకు రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న ప్రజా సంఘాల ఉద్యమకారులు, ఉద్యమకారుల సంక్షేమ కమిటీలు, ఇతర వర్గాలతో రాజకీయాలకు అతీతంగా విస్తృతస్థాయిలో చర్చలు జరిపి ఉద్యమకారుల గుర్తింపునకు అవసరమైన సూచనలు, సలహాలను దశలవారీగా సేకరించాలని కమిటీ నిర్ణయించింది. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో సూచనలు స్వీకరించనున్నారు. ఆన్‌లైన్ విధానంలో ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయడంతోపాటు, ఆఫ్‌లైన్ విధానంలో ఉద్యమకారులు తమ ప్రాతినిధ్యాలు సమర్పించేందుకు ప్రత్యేక అధికారులను నియమించి అందిన అభిప్రాయాలు, వివరాలను నమోదు చేసేలా చర్యలు చేపడుతున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





