– సంస్కరణలు, వనరుల సమీకరణ, రుణాల పునర్వ్యవస్థీకరణపై ప్రత్యేక దృష్టి
– నిధుల వినియోగ పురోగతిపై శాఖల వారీగా డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి బడ్జెట్లో కేటాయించిన సబ్ ప్లాన్ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించడానికి వేగం పెంచాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. కేటాయింపులకు అనుగుణంగా నిధుల వ్యయాన్ని వేగవంతం చేయడంతోపాటు నిధుల వినియోగంలో వెనుకబడిన శాఖలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ఆర్థిక శాఖలో సంస్కరణలు, ఆదాయ వనరుల సమీకరణ, రుణాల పునర్వ్యవస్థీకరణపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు. సచివాలయంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో భట్టి విక్రమార్క ఎస్సీ, ఎస్టీ ప్రోగ్రెస్ సబ్‌ప్లాన్ అమలు, శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు, ఇప్పటివరకు జరిగిన వ్యయం, రాష్ట్ర ఆర్థిక నిర్వహణకు సంబంధించిన అంశాలను సమీక్షించారు. కేటాయించిన నిధులు నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా ఖర్చయ్యేలా సంబంధిత శాఖలు బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, సామాజిక, ఆర్థిక సాధికారత కోసం కేటాయించిన నిధుల వినియోగంలో ఎలాంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన కేటాయించిన సబ్ ప్లాన్ నిధులు ఆయా వర్గాల సంక్షేమం, అభివృద్ధికి సమర్థవంతంగా ఉపయోగపడేలా శాఖలవారీగా వ్యయ ప్రణాళికలను పటిష్టంగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు. చట్ట నిబంధనలు, బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా సాధారణ పద్దుల తరహాలోనే ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక పద్దుల కింద కేటాయించిన నిధులను కూడా పూర్తిస్థాయిలో వినియోగించాలని ఆదేశించారు. నిధుల వినియోగంలో వెనుకబడిన శాఖలతో ఆర్థిక శాఖ అధికారులు ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహించి ఖర్చుల పురోగతిని వేగవంతం చేయాలని సూచించారు. ఈ మేరకు ముందుగా ఖర్చులో ఎక్కువ అంతరం ఉన్న మొదటి ఐదు శాఖలు వ్యవసాయం, వైద్యం, ఇంధనం, పురపాలక, పంచాయతీరాజ్, సాంఘిక సంక్షేమం, పరిశ్రమలు, గిరిజన సంక్షేమ, తరువాత క్రమంలో ఇతర శాఖల కార్యదర్శులతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. కేటాయించిన నిధులు, ఇప్పటివరకు జరిగిన వ్యయం, మిగిలిన నిధుల వినియోగానికి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించి నివేదిక రూపొందించాలని సూచించారు.
ఆర్థిక సంస్కరణలతో ఆదాయ వనరుల పెంపు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసేందుకు అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకోవడంతోపాటు అదనపు ఆదాయ మార్గాలను గుర్తించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. బడ్జెట్ రూపకల్పనలో వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటూ వ్యయ నియంత్రణ, నిధుల సద్వినియోగం, అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన ఆర్థిక వనరుల లభ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఆర్థిక శాఖలో అమలు చేస్తున్న సంస్కరణలు, ప్రభుత్వ ఆదాయ వనరుల సమీకరణకు చేపడుతున్న చర్యలు, రుణాల పునర్వ్యవస్థీకరణపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర ఆర్థిక నిర్వహణ దీర్ఘకాలిక ప్రయోజనాలకు అనుగుణంగా ఉండేలా పటిష్టమైన ప్రణాళికలు రూపొందించాలని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
నిపుణుల సలహాలతో మెరుగైన ఆర్థిక నిర్వహణ
ఆర్థిక నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలను పాటించేందుకు అనుభవజ్ఞులైన కన్సల్టెంట్లు, ఆర్థిక రంగ నిపుణుల సేవలను వినియోగించుకోవాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. వారి సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. బడ్జెట్ కేటాయింపులు, నిధుల వ్యయం, అభివృద్ధి కార్యక్రమాల అమలు మధ్య సమన్వయం ఉండేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ఫైనాన్స్, ప్లానింగ్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్, ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ సిక్తా పట్నాయక్, ఇతర ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





