పారిశుధ్య‌ కార్మికుల కష్టంతోనే స్వచ్ఛ సిద్దిపేట

– ఆ కార్మికుల క‌ష్టంతోనే సిద్దిపేటకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు
– పారిశుధ్య‌ కార్మికుల శ్రమ, నల్లా ఆపరేటర్ల కష్టాలు తీర్చాం
– పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలి
– జీతాల పెంపునకు అసెంబ్లీలో పోరాడతాం
– మాజీ మంత్రి హరీష్ రావు

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: ఇవాళ సిద్దిపేటకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు, జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందంటే అది ఒక హరీశ్ రావు గొప్పతనం కాదు.. ఉదయాన్నే లేచి చలికి, వానకు ఇబ్బందులు పడినా పట్టించుకోకుండా చీపుర్లు పట్టి ఊడ్చే అక్కాచెల్లెళ్ల రెక్కల కష్టం వల్లే అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య‌మంత్రులుగా ఉన్న‌పుడు పారిశుధ్య కార్మికులకు మూడు నెలలు, ఆరు నెలలైనా జీతాలు రాకపోతుండే.. జీతాల కోసం ఎర్రజెండాలు పట్టుకుని ఆర్డీవో ఆఫీస్ ముందు, కమిషనర్ ఆఫీస్ ముందు కార్మికులు నిత్యం ధర్నాలు చేసే దుస్థితి ఉండేది.. నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ.8,300 మాత్రమే ఔట్‌సోర్సింగ్ జీతం ఉండేది.. అది కూడా కాంట్రాక్టర్ల చేతుల్లో పడి కార్మికులకు సకాలంలో అందేది కాద అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో పట్టణ పారిశుధ్య కార్మికులను సోమవారం కలిసి ఆయన ఆత్మీయంగా ముచ్చటించారు. వారితో కలిసి టిఫిన్ చేసి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం దసరా పండుగను పురస్కరించుకుని తన సొంత ఖర్చులతో కార్మికులను ఘనంగా సత్కరించి, దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఊరందరికీ నిరంతరం సేవ చేస్తున్న కార్మికులకు ఒకరోజు స్వయంగా బట్టలు పెట్టి, కలిసి టిఫిన్ చేసి తన వంతుగా సేవ చేద్దామనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చా న‌న్నారు. సిద్దిపేటలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేసిన తర్వాత పారిశుధ్య కార్మికుల పని భారం చాలా తగ్గిందన్నారు. పందుల పెంప‌కందారుల‌ను ఒప్పించి, ఉపాధి చూపించి, పందులను పూర్తిగా తొలగించడంతో సిద్దిపేట నిజమైన స్వచ్ఛ సిద్దిపేటగా మారిందని చెప్పారు. కార్మికులకూ శ్రమ తగ్గిందన్నారు. చెత్త కుండీలన్నింటినీ తొలగించి తడి, పొడి చెత్త కోసం ఆటోలు ఏర్పాటు చేశాం.. కార్మికులకు ప్లాస్టిక్ వంటి రీసైక్లింగ్ ద్వారా అదనంగా రూ.300 నుంచి రూ.500 వరకు ఆదాయం వచ్చే వెసులుబాటు కూడా కల్పించాం.. కార్మికుల శ్రమను తగ్గించేందుకు మూడు పెద్ద స్వీపింగ్ మిషన్లు కొనుగోలు చేసి మెయిన్ రోడ్లను వాటి ద్వారా శుభ్రం చేయిస్తూ కార్మికులకు ఉపశమనం కల్పించాం అని ఆయ‌న తెలిపారు. నల్లా ఆపరేటర్ల గోస కూడా గతంలో తీవ్రంగా ఉండేదని, ఎల్ఎండి పైప్‌లైన్ వేసినా గాలులు వచ్చినప్పుడు కరెంట్ పోవడం వల్ల సమయానికి నీళ్లు వచ్చేవి కావని, దాంతో 11 గంటలకో, రాత్రి 12 గంటలకో, తెల్లవారుజామున 5 గంటలకో నల్లాలు తిప్పాల్సి వచ్చేదని గుర్తు చేశారు. దీంతో ప్రజలు తిట్టేవారని, నల్లా ఆపరేటర్లు తీవ్ర ఇబ్బందులు పడేవారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సిద్దిపేట నెత్తిమీద కుండలా మల్లన్న సాగర్ నిర్మించుకున్నాం.. మల్లన్న సాగర్ నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు రావడం వల్ల కరెంట్‌తో పనిలేకుండా గేటు ఎత్తగానే సిద్దిపేటకు పరుగులు పెడుతున్నాయి అని చెప్పారు. ఇప్పుడు ఉదయం 7 గంటలకు, 9 గంటలకు ఖచ్చితమైన సమయానికి నల్లాలు వస్తున్నాయన్నారు .పారిశుధ్య కార్మికురాలు నర్సమ్మ అడిగినట్లు ధరలు విపరీతంగా పెరిగిన మాట వాస్తవం. ఇళ్ల కిరాయిలు పెరిగాయి, కాబట్టి జీతం పెంచాలని కార్మికులు అడగడంలో ఎలాంటి తప్పు లేదు. తాను మంత్రిగా ఉన్న సమయంలో కార్మికుల జీతాన్ని రూ.8,300 నుంచి రూ.12,000 కు, ఆ తర్వాత రూ.14,000 కు, కరోనా సమయంలో ఒక్కసారే రూ.1,000తో పాటు మొత్తం రూ.16,600 వరకు పెంచుకుంటూ వచ్చామ‌న్నారు. కాంట్రాక్టర్లు, దళారుల దోపిడీని పూర్తిగా రద్దు చేసి ఏడేడుగురు కార్మికులను ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి ప్రభుత్వమే నేరుగా మీ ఖాతాల్లో జీతాలు పడేలా విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాం అని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా కార్మికులకు ఒక్క రూపాయి కూడా జీతం పెంచలేదని హ‌రీష్ రావు విమ‌ర్శించారు. కాంగ్రెస్ వాళ్లు తులం బంగారం ఇస్తామన్నారు, మహిళలకు నెలకు రూ. 2,500 ఇస్తామన్నారు. ఇప్పుడేమో ఎవరికీ ఏమీ ఇవ్వడం లేదు. కేసీఆర్ హయాంలో ప్రభుత్వ దవాఖానలో కాన్పు అయితే కేసీఆర్ కిట్ ఇచ్చి, రూ. 12,000 అందించి, సర్కారు వాహనంలో ఇంటి వద్ద దింపేవారం.. ఇప్పుడు కనీసం మందులు కూడా సరిగ్గా దొరకని పరిస్థితి ఏర్పడింది. సఫాయి కార్మికుల మాదిరిగానే నల్లా ఆపరేటర్లు, మొక్కలు నాటే కార్మికులను కూడా గ్రూపుల పరిధిలోకి తీసుకొచ్చి డైరెక్ట్ జీతాలు ఇవ్వాలని కోరుతున్నారన్నారు. మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాల పీఎఫ్, ఈఎస్ఐ లేదా అకౌంట్ సమస్యలను వెంటనే మున్సిపల్ అధికారులు, చైర్మన్ కూర్చుని పరిష్కరించి వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ అందమైన సిద్దిపేట నిర్మాణం వెనుక కార్మికుల రెక్కల కష్టమే అసలైన అలంకారమ‌ని అన్నారు. విపరీతంగా పెరిగిన ధరల వల్ల పారిశుధ్య కార్మికులు, పేదలు బతకడం కష్టంగా మారినందున‌ పారిశుధ్య కార్మికుల జీతాలను ప్రభుత్వం తక్షణమే పెంచాలని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కార్మికుల పక్షాన గట్టిగా నిలదీస్తానని హ‌రీష్ రావు హామీ ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *