కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన బోర్డు
˜మొత్తం 1,532 పరీక్ష కేంద్రాల ఏర్పాటు
˜సిసి కెమరాలతో కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షణ
˜నిమిషం నిబంధన ఎత్తివేత..5 నిముషాల వరకు అనుమతి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 4: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొదటి, ద్వితీయ సంవత్సరం కలిపి దాదాపు పది లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో అబ్బాయిలు 4,97,528 మంది ఉండగా.. అమ్మాయిలు 4,99,443 మంది ఉన్నారు. మొత్తం 1,532 కేంద్రాల్లో జరగనున్న పరీక్షల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. ఈసారి పరీక్షా కేంద్రాల గుర్తింపు కోసం హాల్ టిక్కెట్లపై క్యూర్ కోడ్‌లను సైతం ముద్రించటం విశేషం. ఇక పేపర్ లీకేజీ, మాస్ కాపీయింగ్ వంటి సమస్యలు తలెత్తకుండా సీసీ కెమెరా సర్వైలెన్స్, పెద్ద సంఖ్యలో స్క్వాడ్‌లను సైతం ఏర్పాటు చేశామని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య వివరించారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహాణకు బోర్డ్ సర్వం సిద్ధం చేసిందన్నారు. మొదటి సంవత్సరం పరీక్షలు.. మార్చి 5వ తేదీ బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అలాగే ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 6వ తేదీ నుంచి మొదలవనున్నాయి.
ఈ పరీక్షలు ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు ఇంటర్మీడియట్ పరీక్షలకు ఈసారి కూడా ఒక్క నిమిషం ఆలస్యమనే నిబంధనను ఎత్తివేస్తున్నట్లు ఇంటర్ బోర్డు ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ పరీక్ష ప్రారంభమైన ఐదు నిమిషాల వరకు అంటే.. ఉదయం 9.05 గంటల వరకు విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని బోర్డు స్పష్టం చేసింది. పరీక్షా కేంద్రానికి కాస్త ముందుగా చేరుకుంటే ఒత్తిడి, ఆందోళనకు గురయ్యే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయని బోర్డు అధికారులు విద్యార్థులకు సూచించారు. ఇక నిబంధనల ప్రకారం ఉదయం 8.45 గంటల నుంచి 9 గంటల మధ్య.. విద్యార్ధులకు ఓఎంఆర్ పత్రాన్ని అందజేస్తారు. వీటిని విద్యార్థులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఈసారి ఇంటర్ హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రించారు. దీనిని స్కాన్ చేస్తే పరీక్షా కేంద్రం లొకేషన్ సులువుగా తెలుసుకోవచ్చు.ప్రశ్నపత్రంపై సీరియల్ నెంబరు ముద్రిస్తున్నారు. దీంతో ఏ నెంబర్ ఉన్న పేపర్.. ఏ విద్యార్థికి వెళ్తుందో సులువుగా తెలుస్తుంది. ఒకవేళ అది బయటకు వొచ్చినా వెంటనే ఏ పరీక్షా కేంద్రం, ఏ విద్యార్థిదనే విషయాన్ని సులభంగా గుర్తించవచ్చు. ఈ పరీక్షల వేళ.. స్మార్ట్ వాచ్‌లతోపాటు అనలాగ్ వాచ్‌లను సైతం నిషేధిస్తున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈసారి పరీక్షల వేళ.. చేతి గడియారాలనూ కూడా అనుమతించడం లేదు. ఇంటర్ బోర్డు కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)ని ఏర్పాటు చేశారు.
అన్ని పరీక్షా కేంద్రాల్లోని సీసీ కెమెరాలను ఈ కేంద్రంతో అనుసంధానించారు. మొత్తం 75 మంది సిబ్బంది.. ఈ పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించనున్నారు. విద్యార్ధుల పరీక్షలకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే ఈ హెల్ప్‌లైన్ నెంబరు 92402 05555 ను సంప్రదించవచ్చునని బోర్డు కార్యాలయం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌డియట్ పరీక్షలు ప్రారంభమైనాయి. మార్చి 1వ తేదీ నుంచి మొదటి సంవత్సరం, మార్చి 3వ తేదీ నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమైనాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు.. హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకొనేందుకు వాట్సప్ నెంబర్‌ను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.





