పేదల జీవితాలను ఉద్ధరించిన ఈశ్వరీబాయి

– ఆమె జీవితం ఆదర్శప్రాయం
– ఈశ్వరీబాయి జయంత్యుత్సవాల్లో మంత్రి వివేక్‌
– స్పీకర్‌ ప్రసాద్‌ చేతుల మీదుగా మంత్రి సీతక్కకు ఈశ్వరీబాయి అవార్డు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1: ఈశ్వరీబాయి జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం.. అట్టడుగు వర్గాలు, మహిళల అభ్యున్నతి కోసం అలుపెరగని పోరాటం చేశారు.. పేదల జీవితాలకు దైర్యం ఈశ్వరీబాయి.. విద్యతోనే విముక్తి అని నమ్మి ఒక గురువుగా విద్యా బోధన చేశారు అని కార్మిక శాఖ మంత్రి వివేక్‌ కొనియాడారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, ప్రముఖ సంఘ సేవకురాలు, మాజీ ఎమ్మెల్యే ఈశ్వరీబాయి మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఈశ్వరీబాయి 107వ జయంతి ఉత్సవాలను స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్కకు ఈశ్వరీబాయి మెమోరియల్‌ అవార్డును స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌, మంత్రి వివేక్‌, మాజీ మంత్రి గీతారెడ్డి, ఇతర ప్రముఖులు అందజేశారు. మహిళలు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ రంగాల్లో మహిళా సాధికారత, సామాజిక న్యాయం, అట్టడుగు వర్గాల అభివృద్దిలో సీతక్క కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేశారు. మహిళలకు ఉచిత విద్య అందించారని, కౌన్సిలర్‌గా, ఎమ్మెల్యేగా అపారమైన సేవలందించారని చెప్పారు. మహిళా సాధికారతకు ప్రతిరూపంగా సీతక్క నీలుస్తున్నారని, ఆమెకు ఈశ్వరీబాయి స్మారక అవార్డు ఇవ్వడం గొప్ప విషయమని అన్నారు. అలాగే ఈశ్వరీబాయి బాటలోనే గీతారెడ్డి నడుస్తున్నారని, గీతా నర్సింగ్‌ హోమ్‌లో పేదలకు ఉచితంగా వైద్య సేవలందించడం అభినందనీయమని అన్నారు. ఎన్నో దఫాలు గీతారెడ్డి మంత్రిగా పనిచేసినా ఆమె కెరీర్‌లో చిన్న మచ్చ లేదని, ఈశ్వరీబాయి చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. ప్రజలకు సహాయపడుతూ, సొసైటీకి తిరిగి ఇవ్వాలన్న ఆలోచన ఆదర్శప్రాయమన్నారు.
నేటి నాయకులకు ఆదర్శవంతురాలు : స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌
తాను చెప్పాలనుకున్న విషయాలను సూటిగా చెప్పిన ధైర్యవంతురాలు ఈశ్వరీ బాయి నేటి రాజకీయ నాయకులకు ఆదర్శవంతురాలన్నారు. మహిళలు రాజకీల్లోకి వచ్చేందుకు ప్రేరణగా నిలిచారని, కడదాకా సిద్ధాంతం మీద నిలబడ్డ ఆదర్శవంతురాలు ఈశ్వరీబాయి అని, దళితులు, మహిళల ఉద్ధరణ కోసం తన జీవితాన్ని ధార పోశారని కొనియాడారు.
జై భీమ్‌.. జోహార్‌ ఈశ్వరీబాయి : మంత్రి సీతక్క
ఈశ్వరీబాయి అవార్డు తనకు ఇవ్వడం ద్వారా మరింత బాధ్యత పెంచారని, ఆమె స్ఫూర్తి కీర్తిని తనలాంటివారు ముందుకు తీసుకెళ్లాలని తనకు అవార్డు ప్రదానం చేశారని అనుకుంటున్నానని మంత్రి సీతక్క అన్నారు. ఈశ్వరీబాయి మెమోరియల్‌ ట్రస్ట్‌ నిర్వాహకులు గీతారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈశ్వరీబాయి స్పూర్తితో తమ పనితనాన్ని మరింత మెరుగుపరచుకుంటామన్నారు. ఈశ్వరీ బాయి చరిత్ర అందరికీ ఆదర్శప్రాయమన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఈశ్వరీబాయి నమ్మిన సిద్ధాంతాలను కడవరకు కొనసాగించిన ఆదర్శమూర్తి. వారి స్ఫూర్తిని కొనసాగిస్తూ పనిచేస్తామన్నారు. ఆదివాసీ గూడేల నుంచి వచ్చిన తమలాంటి వారికి రాజ్యాంగం గొప్ప వరమని, అంటరానితనం, అవమానాల నుంచి ఎదిగొచ్చిన బిడ్డ ఈశ్వరీబాయి అమ్మాయిలకు ఉచిత విద్యా బోధన చేశారని, ప్రజాసేవలో తన ముద్ర వేశారని అన్నారు. ఆదివాసీలను అమిత్‌ షా విపరీతంగా అవమానిస్తున్నారని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అణచివేస్తున్నారని ఆరోపించారు. అంబేద్కర్‌ని కొలిస్తే ఏమొస్తుందని అమిత్‌ షా మాట్లాడడం బాధాకరమన్నారు.
అంబేద్కర్‌ సంఘాల నేత జేబీ రాజు
హక్కులు దక్కించుకోవాలంటే అంబేద్కర్‌ మార్గమే తన మార్గమని ఈశ్వరీబాయి చివరివరకు ప్రయాణించారని, సిద్ధాంత నిబద్ధతకు నిలువెత్తు రూపమని అంబేద్కర్‌ సంఘాల నేత జేబీ రాజు అన్నారు.అంబేద్కర్‌ తర్వాత అసెంబ్లీలో బడ్జెట్‌ మీద సుదీర్ఘ ప్రసంగం చేసి ఈశ్వరీబాయి రికార్డు సృష్టించారని, అమ్మాయిలకు ఇంటర్‌ కాలేజీల్లో ఫీజు లేకుండా అప్పటి ముఖ్యమంత్రి వెంగళరావును ఒప్పించిన నేత ఈశ్వరీబాయి అని చెప్పారు. ఈశ్వరీబాయి ఫైర్‌ బ్రాండ్‌ అయితే మంత్రి సీతక్క ఐరన్‌ లేడీ.. మంచిగా ఉన్నప్పుడు ఎవరైనా సేవ చేస్తారు.. కానీ సాధారణ ఆదివాసీ మహిళగా విప్లవాన్ని సృష్టించడానికి తన వంతు పాత్ర పోషించారని, ఏ హోదాలో ఉన్నా సీతక్క నిత్యం ప్రజా సేవలోనే ఉన్నారని తెలిపారు. అలాంటి సీతక్కకు ఈశ్వరీబాయి మెమోరియల్‌ అవార్డు దక్కడం సంతోషమన్నారు. ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే గణేష్‌, టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మల జగ్గారెడ్డి, సంగీత నాట్య అకాడమీ అధ్యక్షురాలు అలేఖ్య పుంజాల, కార్పొరేటర్‌ విజయ రెడ్డి తదితరులు హాజరయ్యారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page