– గతంలో జరిగిన రిజిస్ట్రేషన్లు ఇప్పుడెందుకు జరగడంలేదు?
– ప్రజల్లో ప్రభుత్వం పట్ల విశ్వాసం పోతున్నది
– రాత్రికి రాత్రే భూమిపై హక్కును తొలగించారు
– హెచ్‌సీయూ భూములు బోంబే స్టాక్ ఎక్చేంజ్‌లో తాకట్టు
– హిల్ట్ పాలసీ ద్వారా భూములను కొల్లగొట్టే యత్నం
– సిరిపూర్ కాగజ్ నగర్‌లో 30వేల ఎకరాలు 22ఎ కిందికి
– 30 వేల ఎకరాల పాలిటెక్నిక్ భూములను తనఖా పెడుతున్నారు
– 22ఎ కిందికి పోయిన ప్లాట్లు, అపార్ట్ మెంట్ల వాసుల బతుకులు ఆగమాగం
– ప్రభుత్వ నిర్వాకంపై విరుచుకుపడ్డ హరీష్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: అసిఫాబాద్ జిల్లా నుంచి హైదరాబాద్ వరకు ఎవరి నోట విన్నా 22ఏనే. అన్ని జిల్లాల్లో ఈ సమస్య ఉందని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. దీనిపై తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరిస్తూ, 1908లో బ్రిటిష్ గవర్నమెంటులో 22ఏ ప్రకారం భూములను నిషేధించే అధికారం ప్రభుత్వానికి ఉందని ఇందులో దేవాదాయ, వక్ఫ్, భూదాన్, ప్రభుత్వ, పోరంబోకు, అసైన్డ్ భూములను ఎవరూ ఆక్రమించకుండా ఉండడం దీని ఉద్దేశమన్నారు. ప్రస్తుతం మనం 22ఏ1ఎ గవర్నమెంటు, పోరంబోకు, 22ఏ1బి పేదలకు పంచిన అసైన్డ్ భూములు, 22ఏ1సి దేవాదాయ, వక్ఫ్, 22ఏ1డి సీలింగ్ యాక్ట్ ద్వారా పొంది భూములు…ఇట్ల ప్రభుత్వ అవసరాలు, ప్రజల అవసరాలకు అనుగుణంగా పెట్టుకున్నామన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఒక్కో ఊర్లో కాలనీలకు కాలనీలే 22ఏ కిందికిపోయిన్.. ఒక్కో కాలనీలో 2 వేల ఇండ్లు, 5 వేల ఇండ్లు ఇందులోకి పోయాయి. మరి గతంలో జరిగిన రిజిస్ట్రేషన్లు ఇప్పుడెందుకు జరగట్లేదని ప్రశ్నించారు. తెలంగాణలో భూమిపై హక్కులున్న మనుషులు ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కోల్పోతున్నారన్నారు. రాత్రికిరాత్రి ఒక్క చిన్న గీతతో ప్రజల భూముల హక్కును తీసేసిండు.. ఆ ఆస్తుల విలువను జీరో చేసిండన్నారు. గతంలో హైడ్రా, ప్రస్తుతం 22ఏ… ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయన్నారు. పొంగులేటి, రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారులు. కానీ మీరు ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నరు. భూమి అనేది ప్రజల హక్కు అనే సోయిని మర్చిపోవద్దని, లక్షల మంది ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు. 22ఎ వల్ల పిల్లల చదువులు, పెళ్లిల్లు ఆగిపోతున్నయ్.. నల్లగొండ జిల్లాలో ఓ పెళ్లి ఇలా ఆగిపోతే ఊరోళ్లంత కలిసి పెళ్లి చేసిన సంగతి గుర్తుచేశారు. హెచ్సీయూలో 400 ఎకరాల భూమిని గవర్నమెంటు కబ్జా పెట్టే ప్రయత్నం చేసింది.. విద్యార్థులు పోరాడి కాపాడుకున్నరు. కానీ ఆ 400 ఎకరాలు బాంబే స్టాక్ ఎక్చేంజ్‌లో కుదవ పెట్టి 9.5 శాతం వడ్డీకి 10 వేల కోట్ల అప్పు తీసుకున్నారు. ఇందులో బ్రోకర్‌కు 200 కోట్ల లంచం ఇచ్చారని ఆరోపించారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో 8 వేల ఎకరాలను హెచ్ఎండీఏ ద్వారా బాంబే స్టాక్ ఎక్చేంజ్ 10 వేల కోట్ల అప్పు తీసుకున్నారు. ఉర్దూయూనివర్సిటీ భూములను సూట్ పెట్టారు. అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాలు తీసుకున్నరు. లగచర్లలో భూములు రేవంత్ తన అల్లుడికి కట్టబెట్టిండని ఆరోపించారు. 30 వేల ఎకరాల పాలిటెక్నిక్ భూములను తనఖా పెట్టి లోన్లు తీసుకురావడానికి స్కిల్ యూనివర్సిటీ తీసుకొస్తున్నారు. హిల్ట్ పీ పాలసీలో కూడా అంతే.. ఆ భూములను కొల్లగొట్టడానికి ప్రయత్నం తప్ప మరోటి కాదన్నారు. హైడ్రా వెనక ఉన్నదీ అదే.. బడా బాబుల ఇండ్లు కనపడవు.. రేవంత్ రెడ్డి తమ్ముడి ఇల్లు కనపడవు.. మూసీ వెనక కూడా అదే ఉంది.. మూసీ వెంట ఎస్టీపీలను పూర్తి చేస్తే అయిపోతది. 3 వేల ఎకరాల రియల్ ఎస్టేట్ వ్యాపారం. మెట్రో నిర్ణయం ద్వారా 280 ఎకరాల భూమి ఎల్ఎన్టీ నుంచి తీసుకోవాలి. ఇట్ల ఏంచేసినా భూమే.. 22ఏ వెనక కూడా భూమే ఉందన్నారు. ప్రజలు ఓపెన్‌గా 30 పర్సెంట్ గవర్నమెంట్.. అని చెప్తున్నరు..ఊర్లకు ఊర్లు.. ఇండ్లు, ప్రజల ఆస్తులు, అపార్టుమెంట్లు అన్ని ఇందులో పెట్టారన్నారు. రాత్రి నీదైన భూమి, పొద్దున కాదు. ఆలేరు ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఇంట్ల ఉంటున్నవ్ కదా పో అంటున్నడు. మరి అమ్ముకోవాలంటే ఏంది పరిస్థితి. సంగారెడ్డిలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌కు తాత నుంచి ఆస్తి వచ్చింది. ఆ స్థలంలో పాత ఇల్లు కూలకొట్టి బ్యాంకు లోను కోసం పోతే 40 లక్షలు సాంక్షన్ అయ్యింది. తర్వాత మున్సిపల్ ఆఫీసుకు డిజైన్ అప్రూవ్ చేసుకోవడానికి పోతే నిషేధిత భూమి అన్నరు. ఇల్లు లేదిప్పుడు.. రోడ్డున పడ్డడు. ప్రొటెక్షన్ ఆఫ్ ప్రాపర్టీ రైట్స్ అనేది ప్రభుత్వం కనీసం ధర్మం. కానీ రెవెన్యూ మంత్రి, ముఖ్యమంత్రి ప్రజలు పాడైనా పర్వాలేదు మా ఆస్తులు పెరగాలి అనేది కోరుకున్నరు. కొమురం భీం జిల్లా నుంచి మల్లయ్య అనే కుటుంబం వచ్చింది.. ఆయన కేసీఆర్‌కు ఓటేయక తప్పు చేసిన అంటుండు. ఆయనకున్న 9 ఎకాలు ముగ్గురు కొడుకులకు 3 ఎకరాలు చేద్దామనుకుండు కానీ చేతల పాసుబుక్కున్నా అమ్ముకునే హక్కు లేదు. లక్షల కుటుంబాల అవస్థ ఇది. ప్రభుత్వం ఏమంటుంది.. కొత్తగా 22ఏలో పెట్టలేదు.. ధరణి నుంచి ఉన్నవే అంటది. ఇది పచ్చి అబద్ధం.. సారీ చెప్పడం కాదు.. రిజైన్ చేయాలి.. నీకా అర్హత లేదు.మరి అప్పుడు రిజిస్ట్రేషన్లే అయినయ్ ఈ 9 నెలల నుంచి సమస్య అని రాష్ట్రమంతా కూస్తుంటే ఇంకా బీఆర్ఎస్ మీద పడి ఏడుస్తరా? ఇట్లనే కాలం వెల్లదీస్తరా అని ప్రశ్నించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు పంపిన నిషేధిత జాబితాలకు సంబంధించిన లేఖలు అన్ని మీ ముందు ఉంచుతున్నాం.
ఇందులో ఆసిఫాబాద్ ప్రత్యేకం. ఎందుకంటే సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో 30 వేల ఎకరాలు, పేద రైతులు. వాళ్లకు ఏం తెలుసు ఏ అధికారి దగ్గరకు పోవాలి. మంచిర్యాలలో 11 వేల ఎకరాలు ఇట్ల దారుణం. కలెక్టర్లు ఆధారాలతో సహా నిరూపించినం చీము నెత్తురు ఉంటే పొంగులేటి రాజీనామా చేయాలి. ఇవన్నీ అసెంబ్లీలో పెడితే తలకాయ ఏడపెట్టాల్నో తెలవక మమ్మల్ని సస్పెండ్ చేశారు. 22ఏ అనేది ప్రభుత్వ భూముల కాపాడడానికి. భూభారతి పోర్టల్లో వక్ఫ్ భూముల వివరాలు లేవు.. దేవాదాయ భూములు లేవు.. అసైన్డ్ భూముల వివరాలు లేవు..మరి దేని కోసం మీరు 22ఏ తెచ్చిర్రు? ధ రణిలో ఈ వివరాలన్నీ ఉండె.. అంటే దీని వెనక ఏదో కుట్ర ఉందన్నారు. కానీ ప్రైవేటు భూముల్నిపెట్టిర్రు.. కష్టపడికొనుక్కున్న భూములను పెట్టిర్రు. కలెక్టర్ల మెడమీద కత్తి పట్టి 15 రోజుల్ల లిస్టు పంపాలని ఒత్తిడి చేయడంతో..అది సాధ్యం కాక.. ఆ ఒత్తిడి భరించలేక పాత డేట్ల బంజారీహిల్స్, జూబ్లీహిల్స్, నగరంలోని అనేక ప్రాంతాల్లో ప్రభుత్వమే అమ్మిన భూములను కూడా ఇందులో పెట్టిర్రు.. షేక్ పేట్ లాంటి ఊరికి ఊరినే 22ఏలో పడింది. పద్ధతిపాడు లేకుండా.. వెరిఫికేషన్ లేదు బాధ్యత లేదు.. దీన్ని చూస్తే ఓ పథకం ప్రకారం వీటిని నిషేధిత జాబితాలో పెట్టినట్లు తెలుస్తుంది. మేడ్చల్‌లో 100 ఎకరాలు నిషేధిత జాబితాలో.. ఇందులో 5 వేల కుటుంబాలు నివసిస్తున్నయ్. అమీన్పూర్.. 1500 ఎకరాలు 22ఏలో.. అందులో ఇండ్లు, అపార్టుమెంట్లు 50 వేల ఉన్నయ్. వీళ్లంతా ఆగమయ్యారన్నారు. మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, కొమురంభీంలో నేను లేపలేనన్ని అప్లికేషన్లు వచ్చినయ్. 10 వేల దరఖాస్తులు.. అసెంబ్లీలో పొంగులేటి టేబుల్ మీద పెట్టి నిలదీద్దాం అనుకున్నం. కానీ మమ్మల్ని సస్పెండ్ చేషిర్రు.. అయినా ఇడిషిపెట్టం.. కచ్చితంగా బీఆర్ఎస్ దీని మీద పోరాడతది. భూదాన్ 20 ఎకరాలు ఉంటే ఊరిని మొత్తం 22ఎలో పెట్టారు. కరీంనగర్ రేకుర్తి.. పొన్నం, పొంగులేటి, కేంద్రమంత్రిని కలిసినా తీస్తలేదు.. అంటే ప్రభుత్వానికి తెలవక కాదు.. 30శాతం వసూలు చేయాలనేది అసలు లక్ష్యం.
కలెక్టర్ గ్రీవెన్స్2కు రాట్లేదు.. టోల్ ఫ్రీ లేవట్టెటోడే లేడు. ఎమ్మార్వోను కలవమంటున్నరు.. ప్రజలను ఆడుకుంటున్నరు. హౌసింగ్ సొసైటీలకిచ్చిన భూములు 22ఏలో పడ్డయ్. జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీ భూములు కూడా 22ఏ పడ్డయ్.. రేవంత్ రెడ్డి ఇల్లు కూడా అండ్ల పడ్డది. దాన్ని తెల్లారేసరికి తీసేశారు మరి ప్రజల భూముల్ని కూడా అట్ల తీసేయక ఎందుకు ఇబ్బంది పెడుతున్నవని ప్రశ్నించారు. సింఫొనీ కాలనీ.. 4 వేల కుటుంబాలు.. ఆగమాగమయ్యాయి. పొంగులేటి తప్పు చేసి అధికారుల మీద రుద్దడమేంది? 33 జిల్లాల కలెక్టర్లు ఎందుకు తప్పు చేస్తరు.. తప్పు నీది.. మరెందుకు ఒక్క అధికారి మీద కూడా చర్య తీసుకోలేదు..ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పకుండా గవర్నమెంటే తొలగించాలి..దీన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టాలని డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 4 నెలల కిందనే యాదాద్రి జిల్లాలలో 40 వేల ఎకరాలు పెట్టినట్లు రేవంత్ రెడ్డికి చెప్పిన అని తెలిపిండు. మరి అప్పటి నుంచి ఎందుకు రివ్యూ చేయలేదు. సో ఇద్దరి డైరెక్షన్లో జరిగింది. 22ఏను అడ్డంపెట్టుకుని ఏ రకంగా స్కామ్స్ చేస్తున్నరో కూడా చూడొచ్చు. నాదర్గుల్ స్కాం అలాంటిదే.. దీన్ని బీఆర్ఎస్ బయటపెట్టింది. రెవెన్యూ మంత్రి కొడుకు హర్షారెడ్డి డైరెక్టర్‌గా ఉన్న కంపెనీకి 373 ఎకరాల భూములను ధారాదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నరు.
అంతే కాదు సబితక్క నియోజకవర్గం మహేశ్వరం నుంచి రైతులొచ్చిర్రు.. మా తాత ముత్తాతల నుంచి వస్తున్న భూముల్లోకి పోనీయట్లేదు. అక్కడున్న గుట్టలకు క్షషర్లు పెట్టిర్రు.. ప్రవేటు సైన్యమొచ్చింది.. రేకులు అడ్డంపెడుతున్నరు. చెరువులు, చెరువుల్లోకి నీళ్లు పోయే కాలువలు ధ్వంసం, గుట్టలు ధ్వంసం అవుతున్నయ్.. అయినా ప్రభుత్వం పట్టించుకోట్లేదు. ఏక్యూ స్వేయర్ కోహినూర్ గ్రూప్ అగ్రికల్చర్ సీలింగ్ ల్యాండ్‌ను రిజిస్టర్ చేసుకున్నరు. సీలింగ్ ల్యాండ్‌లో సీలింగ్ డిసైడ్ అయ్యేదాక గవర్నమెంటు ఆధీనంలో ఉండాలి..కానీ సీలింగ్ డిక్లెయిర్ కాకుండా ఆర్డీవో చేతిలో ఉండాల్సిన భూమి..క్రిస్టల్ మాన్షన్ డైరెక్టర్.. క్రిస్టల్ మాన్యషన్‌లో హర్షారెడ్డి డైరెక్టర్, శిల్పా ఇన్ఫ్రా ఇందులో కూడా డైరెక్టర్ సింగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. హర్షారెడ్డి డైరెక్టర్లు. అంటే ఇట్ల సీలింగ్ భూములను కూడా కబ్జా చేస్తున్నరు. బీఆర్ఎస్ పార్టీ ఈ విషయాన్నీ బయటకు తీసింది.. ఏప్రిల్ 5న ప్రెస్మీట్ పెట్టి 10న మన ఎమ్మెల్యేలు కలెక్టర్ నారాయణ రెడ్డికి కంప్లైంట్ చేసిర్రు. దాంతో ఏప్రిల్ 12న బోర్డు తీసేషిర్రు.. కానీ సెప్టెంబరులో మళ్లీ కోహినూర్ బోర్డు వచ్చింది. దీని వ్యాల్యూ 10 వేల కోట్ల రూపాయలు.భూభారతిలో కూడా ఇది గవర్నమెంటు ల్యాండ్ అనేదే ఉంది.. ఫిజికల్‌గ పోతే ప్రైవేటు చేతిలో ఉంది. గవర్నమెంటే రిజిస్ట్రేషన్ చేస్తుంది.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా దాన్ని ప్రైవేటు ల్యాండ్ అంటున్నడు. కానీ ఆర్డీవో మార్చి 17, 2025న సుప్రీం కోర్టులో ఆ ల్యాండ్ గవర్నమెంటుదే అని సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసిండు. అయినా ఆర్డీవో కానీ, రంగనాథ్ కానీ ఆ భూమి దగ్గరకు పోరు.. దాన్ని హ్యాండోవర్ చేసుకోరు. ఇదంతా పొంగులేటి అరాచకం.. అనుముల తిరుపతి రెడ్డి కూడా తక్కువేం కాదు. రేవంత్ రెడ్డి తమ్ముడి విషయం 1967లో లక్ష్మీ నారాయణ లీలాబాయికి, తర్వాత చెట్టిలింగంకు అమ్మేశారు.. నుంచి 1985 వరకు ఇద్దరి చేతులు మారింది. పసుమాములు, విలేజ్ అబ్దుల్లాపూర్ మెట్ మండలం. కానీ 1967లో అమ్మిన వ్యక్తి మనుమడిని పట్టుకుని సేల్ డీడ్ చేసుకున్నడు తిరుపతి రెడ్డి. దీని మీద బీఆర్ఎస్ గవర్నమెంటు ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లా కోర్టులో ఓడిపోయారు. నాలా కన్వర్షన్లు, పట్టా పాసుపుస్తకాల కోసం పోయినా కానీ కాంగ్రెస్ గవర్నమెంటు వచ్చిన 5 నెలల్లో ఆ భూమికి పాస్ బుస్కులొచ్చినయ్ నాలా కన్వర్షన్2కు అప్లై చేశారు. కానీ అప్పటికే ప్లాట్లు అయ్యి ఇండ్లు కూడా కట్టుకున్న భూమిని దాని మీద ఉన్న కేసులను చూడకుండా నాలా కన్వర్షన్ ఇచ్చారు. మే 2024ల ఓపెన్‌గా కబ్జా పెడుతున్నరు.. ఇప్పుడు ఇండ్లు కట్టుకున్నోళ్లతో సెటిల్మెంట్లకు దిగుతుర్రు. విట్టల రాధ ఆమె క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది.. ఆమెకు గజ్వేల్‌లో 2 ఎకరాల 10 గుంటల భూమి ఉంది. ఆమె భర్త బాలకృష్ణ నుంచి ఆమెకు వచ్చింది.. ఎవరైనా భూమిని అమ్మాలంటే స్లాట్ బుక్ చేసుకుని. థంబ్ వేసి అమ్మడం కానీ కొనడం కానీ జరగదు.. కానీ అసలు ఆమె ప్రమేయం లేకుండా ఆమె భూమి సాధు నర్సమ్మ అనే పేరు మీదికి పోయింది. సాధు నర్సమ్మ తన కొడుకు లివాన్ రెడ్డికి ఆగస్టు 13న ఎకరా 5 గుంటలు రిజిస్ట్రేషన్ చేసింది. 14న కూతరు వంగ స్వప్పకు ఎకరా 5 గుంటలు చేసింది. అంటే రాధ భూమి రాధకు తెలవకుండా వేరే వాళ్ల మీదకు పోయింది. వాళ్లు ఎమ్మార్వోకు కంప్లైంట్ చేస్తే సారీ చెప్పిండు.. దాంతో కలెక్టర్ దగ్గరకు పోయిర్రు.
అక్కడ కంప్లైంట్ తీసుకుని సరిచేస్తమని చెప్పిర్రు.. అంటే ఇట్ల వందల వేల కోట్ల విలువైన భూములు భూభారతి వల్ల ఒకరి ఆస్తులు ఇంకొకరి పేరు మీదికి పోతున్నయ్. అంటే వీళ్లు తీవ్రంగా కష్టపడి తెచ్చిన భూభారతి చేస్తున్న అద్భుతాలివి. డైమండ్ హిల్స్.. గవర్నమెంటు ప్రొహిబిటెడ్ లిస్టులో ఉంది.. సుప్రీం కోర్టులో కేసు ఉంది. కానీ ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ అయ్యింది. ఈ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్లు అప్లికేషన్లు పెట్టినా పట్టించుకునే అధికారులు లేరు. ఇబ్రహింపట్నం మండలం రాందాస్ పల్లిలో 400 ఎకరాల పట్టా భూమి ఉంది. దీంట్లో 40 ఏండ్ల కిందట గవర్నమెంటు 100 ఎకరాలు కొనుక్కొని వెట్టి కార్మికులకు పంచింది.ఆ వంద ఎకరాలను ప్రొహిబిటెడ్ ల్యాండ్‌లో పెట్టకుండా మిగిలిన 300 ఎకరాలు ప్రొహిబిటెడ్ ల్యాండ్‌లో పెట్టిర్రు. ఆర్డీవో కూడా దీన్ని పొరపాటున ప్రొహిబిటెడ్‌లో పెట్టిన అని చెప్పిండు అయినా దాన్ని తీయట్లేదు. ఈ రైతులు పొంగులేటిని కూడా కలిసిండు అయినా ప్రయోజనం లేదు. రాఘవ 18 ఫిబ్రవరి.. రాఘవ కన్‌స్ట్రక్షన్ కు టీజీఐఐసీ భూమి 19న రిజిస్ట్రేషన్. ఇది కూడా ప్రభుత్వ భూమే మరి వాళ్లకు అయిన భూమి మిగతా ప్రజలకు ఎందుకు కాట్లేదు. ఇంకా చాలా మంది బాధితులు ముందుకు రాట్లేదు.. ఇంకో రెండేండ్లు ఆగండి మీరే వస్తరు అప్పుడు అన్ని ఆధారాలు ఇస్తం అంటున్నరు. కొంపల్లిలో రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నంక 22ఏలో పడ్డది.
దాంతో ఎమ్మార్వో, కలెక్టర్ ఆపైకి పోతే కమిషన్ తీసుకున్నారు. రావిరాల, గోపన్ పల్లి, బుద్వేల్, పుప్పలగూడ, పఠాన్ చెరులో శిల్పా మోహన్ రెడ్డి పేరుతో మస్తు అక్రమాలు జరుగుతున్నయ్ అవన్నీ సమయం వచ్చినప్పుడు ఆధారాలతో బయటపెడతం. ఖానామెట్ భూమి ప్రొహిబిషన్ లిస్టులో ఉంది. కానీ సెప్టెంబర్ 11న ఉదయం 9 గంటలకు అక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీన్ని రెవెన్యూ మినిస్టర్ రాఘవ, అపర్ణ అనే బోర్డు త్వరగా వెలిసే అవకాశం ఉంది. రాత్రిరాత్రి పేదల గుడిసెలు పడగొట్టే హైడ్రా ఇక్కడ ఎందుకు స్పందించదు? జనగాం చుట్టుపక్కల జిల్లాలోని ఆరేడు మండలాల్లో రైతులు కట్టిన చలానాలు రెవెన్యూ అధికారులు దొబ్బేసి అందులో పది శాతం కట్టి రిజిస్ట్రేషన్లు చేశారు. దీని మీద ఇప్పటికీ చార్జిషీట్ లేదు.. లోతైన పరిశోధన లేదు. గవర్నమెంటు ఆదాయం ఇంత పెద్ద ఎత్తున పోతే ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. ఇది భూభారతి కాదు.. భూహారతి.. భూభారతిని, 22ఏను అడ్డం పెట్టుకుని వేల కోట్ల ప్రజల ఆస్తులనుకొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నరు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పెట్టిన భూములను పెట్టినట్లు 22ఏ నుంచి తొలగించాలి. జూబ్లీహిల్స్‌లో రేవంత్ రెడ్డి ఇల్లును ఎట్లయితే 22ఏ నుంచి రిలీజ్ చేషిర్రో ప్రజల ఆస్తులను కూడా అట్లనే రిలీజ్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





