– ప్రజాప్రతినిధులమని చూడకుండా దాడి
– దాడులను ఖండించాల్సిన ప్రభుత్వ పెద్దలు మౌనంగా ఉన్నారు
– మహిళా కమిషన్, ఎన్‌హెచ్ ఆర్సీకి బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల ఫిర్యాదు
– తక్షణం డీజీపీని నివేదిక కోరతామన్న మహిళా కమిషన్ చైర్ పర్సన్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : ప్రభుత్వ దుర్మార్గపు పాలనపై ప్రజల పక్షాన పోరాడాల్సిన తాము తమను రక్షించుకునేందుకు, తమ సమస్యను పరిష్కరించుకునేందుకు పోరాడాల్సిన దుస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై ప్రజాప్రతినిధులమని కూడా చూడకుండా తన గొంతు నులమగా, సహచర ఎమ్మెల్యే చీర లాగి అత్యంత అవమానానికి గురిచేశారని కన్నీటిపర్యంతమయ్యారు. అసెంబ్లీ ప్రాంగణంలో తమ మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి, పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ దిల్లీ వేదికగా పోరును ముమ్మరం చేసింది. మహిళా ప్రజాప్రతినిధులపై పోలీసుల దురుసు ప్రవర్తన, తమను అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకోవడం, శాసనసభ్యుల హక్కులకు భంగం కలిగించడంపై బీఆర్ఎస్ ప్రతినిధి బృందం శుక్రవారం జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహట్కర్ను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అనంతరం జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయ భారతిని కలిసి ఫిర్యాదు చేశారు. మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకోవడం, పోలీసుల చేత అవమానించడం, శాసనసభ్యులుగా తమ హక్కులకు విఘాతం కలిగించేలా వ్యవహరించడం వంటి అంశాలను కమిషన్ల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసుల దాడులపై స్పందించాల్సిన ప్రభుత్వ పెద్దలు మౌనంగా ఉంటున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఘటనలకు సంబంధించిన అన్ని సీసీటీవీ ఫుటేజీలను భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తగిన రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు. తక్షణం డీజీపీని నివేదిక కోరతామని మహిళా కమిషన్ చైర్ పర్సన్ హామీ ఇచ్చారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమకు అవమానం జరిగిందని సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నాలుగు రోజులుగా జరుగుతున్న పరిణామాలను దేశం మొత్తం గమనిస్తోందన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు సమస్యలపై సభలో చర్చ జరగాలని ముఖ్యమంత్రి చెప్పారని, అయితే సమావేశాల ప్రారంభ రోజునే తమను అసెంబ్లీలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించాక అసెంబ్లీలో అడుగుపెట్టకముందే పోలీసులు తమను నిలువరించారని చెప్పారు. నల్ల దుస్తులు ధరించడాన్ని కారణంగా చూపి అడ్డుకున్నారని, అయితే తమ దుస్తులపై ఎలాంటి అభ్యంతరకరమైన రాతలు లేవని స్పష్టం చేశారు. తమను అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకునే అధికారం పోలీసులకు ఎవరు ఇచ్చారు అని ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల పురుష పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్రంగా అవమానకరంగా ఉందని, చీర, జుట్టు పట్టుకుని లాగారని, ఇతర ఎమ్మెల్యేలను కింద పడేసి తొక్కారని ఆరోపించారు. అసెంబ్లీ ప్రాంగణంలో మహిళా ప్రజాప్రతినిధుల పట్ల ఇలాంటి ఘటన జరగడం అత్యంత దురదృష్టకరమన్నారు. ‘మా మనసులు గాయపడ్డాయి.. భారమైన గుండెలతో మాట్లాడుతున్నాం.. మహిళలుగా మాకు అవమానం జరిగింది.. శాసనసభ్యులుగా మా హక్కులకు భంగం కలిగింది’ అని సబిత ఆవేదన వ్యక్తం చేశారు. తమపై దాడి జరిగి వంద గంటలు దాటినా కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని ఆరోపించారు. మరోవైపు తమపైనే కేసులు నమోదు చేయడం రాజకీయ నాటకమని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ ఫిర్యాదు చేసినా న్యాయం జరగనందునే దిల్లీకి వచ్చామని తెలిపారు.
మా సమస్యలపై ఫిర్యాదు చేయాల్సి వచ్చింది
సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ శాసనసభ్యులపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును పూర్తి వివరాలతో జాతీయ కమిషన్లకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ప్రజల సమస్యలను సభలో ప్రస్తావించాల్సిన తాము ఇప్పుడు తమపై జరిగిన దాడి గురించి మాట్లాడాల్సిన పరిస్థితి రావడం అత్యంత దారుణమని అన్నారు. ‘ప్రజా సమస్యలపై మా గొంతు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు.. అందుకే మమ్మల్ని అసెంబ్లీకి రాకుండా అడ్డుకుంటున్నారు.. రాష్ట్రంలో న్యాయం జరగలేదని భావించి దిల్లీకి వచ్చాం’ అని సునీత అన్నారు. మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేయించి తిరిగి తమపైనే కేసులు నమోదు చేయడం బాధాకరమన్నారు. తమకు జరిగిన అవమానంపై అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని, స్పీకర్ స్పందించి ఉంటే ఆయనకు చేతులెత్తి నమస్కరించేవాళ్లమని అన్నారు.
పథకం ప్రకారమే అడ్డుకున్నారు : జగదీశ్‌రెడ్డి
ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత జరుగుతున్న అప్రజాస్వామిక ఘటనలను రాష్ట్ర ప్రజలతోపాటు దేశం మొత్తం చూస్తోందన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ను శాసనసభకు రాకుండా పథకం ప్రకారం అడ్డుకున్నారని ఆరోపించారు. మహిళా ప్రజాప్రతినిధులపై దాడులు చేయించడం ద్వారా ప్రజాస్వామ్యానికి మాయని మచ్చలా వ్యవహరించారన్నారు. తమ ఎమ్మెల్యేలపై భౌతిక దాడులకు పాల్పడ్డారని, హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా తమపై కేసులు పెట్టారని ఆరోపించారు. ఎమర్జెన్సీ రోజులను తలపించేలా కాంగ్రెస్ ప్రభుత్వ నైజం బయటపడుతోందని ఆయన విమర్శించారు. అధికారులు పూర్తిగా ముఖ్యమంత్రి, మంత్రుల కనుసన్నల్లో పనిచేస్తున్నారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటిపై దాడికి పెద్ద సంఖ్యలో వ్యక్తులను ఉసిగొల్పి ఎస్కార్ట్ ఇచ్చి పంపారని ఆరోపించారు. కేసీఆర్ ఇంటి వద్దకు వెళ్లిన తమ ఎమ్మెల్యేలను అరెస్టు చేశారన్నారు. మహిళా ప్రజాప్రతినిధులను అడ్డుకునేందుకు పురుష పోలీసులను, పురుష ప్రజాప్రతినిధులను అడ్డుకునేందుకు మహిళా పోలీసులను ఉపయోగించడం శిఖండి రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని భయపడి సస్పెండ్ చేశారు : పల్లా
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగు రోజులుగా హైడ్రామా జరుగుతోందన్నారు. అన్ని అంశాలపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ సభను కొద్ది రోజులకే పరిమితం చేసి ప్రతిపక్ష సభ్యులను సభకు రాకుండా చేశారని విమర్శించారు. భూ కుంభకోణాలు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, ప్రభుత్వ వైఫల్యాలు సహా అన్ని అంశాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని నిలదీస్తారని, సమాధానం చెప్పలేకనే కుట్రపూరితంగా తమను సస్పెండ్ చేసినట్లు ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటిపై దాడికి ఎమ్మెల్యేలు, విప్‌లను పంపి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజకీయంగా రాక్షసానందం పొందారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు పతనం దగ్గరపడిందని వ్యాఖ్యానించారు.
రేవంత్ దాష్టీకాలను రాహుల్ కట్టడి చేస్తారా? : ఎంపీ వద్దిరాజు
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలోని పరిణామాలపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరుపై సోనియాó, రాహుల్ గాంధీలకు లేఖలు రాశామని తెలిపారు. రేవంత్‌రెడ్డి చేస్తున్న దాష్టీకాలను రాహుల్ గాంధీ కట్టడి చేస్తారా లేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రజల తరఫున ప్రశ్నించే ప్రతిపక్ష హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. మహిళా ప్రజాప్రతినిధుల గౌరవం, శాసనసభ్యుల హక్కులను కాపాడాలని కోరారు. కమిషన్ల సభ్యులను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి దివికొండ దామోదర్ రావు, ఎమ్మెల్సీ వాణిదేవి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ లీగల్ సెల్ బృందం నుంచి బీఎస్ ప్రసాద్, సోమా భరత్, లలితా రెడ్డి తదితరులు కూడా ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





