ముగిసిన గ్రామ సభలు

  • నిరసనలు, ఆందోళనలు
  • చివరి రోజు గ్రామసభల్లో కొన‌సాగిన ఆగ్ర‌హ జ్వాల‌లు
  • మంత్రి సీతక్క ఇలాఖాలో ఆత్మహత్యాయత్నం

(మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర‌, ప్ర‌త్యేక ప్ర‌తినిధి ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామసభల చివరి రోజు కూడా రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమ‌య్యాయి. పంచాయతీరాజ్‌, ‌గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క ఇలాఖాలో మరింత గందరగోళ వాతావరణం ఏర్పడింది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెంలో కుమ్మరి నాగేశ్వర్‌రావు అనే వ్యవసాయకూలీ ఆత్మహత్యాయ‌త్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నాగేశ్వర్‌రావు చేసుకున్న దరఖాస్తును  అధికారులు తిరస్కరించడంతో అధికారులు, గ్రామస్తులు చూస్తుండగానే ఆయ‌న‌ వెంట తెచ్చుకున్న పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో అక్కడ కొంతసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వెంటనే సమీప దవాఖానకు తరలించడంతో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. గతంలో ప్రజాపాలన కార్యక్రమంతోపాటు, అనేకసార్లు ప్రభుత్వ పథకాలకోసం చేసుకున్న తన ద‌రఖాస్తులను ఎవరూ పట్టించుకోకపోవడంతోనే విసుగు చెంది తాను ఈ చర్యకు పాల్పడినట్లు నాగేశ్వర్‌రావు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది ఒక్క నాగేశ్వర్‌రావు వ్యథ కాదు, గత మూడు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వివిధ గ్రామ సభల్లో పలువురు తమ ఆవేదనను, ఆక్రందనను, అసంతృప్తిని, నిరసనలను వ్యక్తం చేస్తున్న సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ ‌మండలం మొగిలిపేట గ్రామంలో కూడా ఇలాంటి సంఘటనే జ‌రిగింది.

ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తనపేరు లేదని మొగిలిపేట గ్రామ మాజీ సర్పంచ్‌ ‌నాగరాజు తన శరీరంపై పెట్రోల్‌ ‌పోసుకుని ఆత్మహత్యకు యత్నించడం కూడా తీవ్ర‌ గందరగోళానికి దారితీసింది.  గ్రామ సభలు నిర్వహిస్తున్న అధికారులు ముందుగా ప్రభుత్వ పథకాలకు అర్హుల జాబితాను చదివి వినిపిస్తుండ‌గా తమ పేరు లేకపోవడంతో తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్న వారితో ఈ సమావేశాలు రసాభాసగా మారుతున్నాయి. ప్రకటించిన జాబితాలో అర్హులను వదిలి అనర్హులను ఎలా చేర్చారంటూ కొన్ని గ్రామాల్లో నిలదీయడంతో అధికారులకు లబ్దిదారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

కాగా తమకు అనుకూలమైన వారి పేర్లనే జాబితాలో చేర్చారంటూ ప్రతిపక్ష బిఆర్‌ఎస్‌ ‌పార్టీకి చెందిన కార్యకర్తల ఆరోపణలను కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు తోసివేసే క్రమంలో ఇరువర్గాల మధ్య‌ దూషణలు, ఆరుపులు, కేకలతో సభల నిర్వహణలో తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. ఖమ్మం జిల్లా బిఎం బంజారా గ్రామంలో అనర్హులను జాబితాలో చేర్చారన్న విషయంలో బిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌కార్యకర్తల మధ్య‌ పెద్ద వివాదమే జరిగింది. అలాగే మేడ్చల్‌లోని గోధమకుంటలో కూడా అదే పరిస్థితి. వీటితోపాటు హుజూరాబాద్‌ ‌నియోజకవర్గంలోని కమలాపూర్‌లో ఎంఎల్‌ఏ ‌పాడి కౌశిక్‌రెడ్డిపై కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు టమాటాల‌తో దాడి చేయడం కాసేపు ఉద్రిక్తతకు దారి తీసింది.

నిర్మల్ జిల్లా తాపూరు మండలకేంద్రంలో, యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటలో, జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ ‌నియోజకవర్గంలోని మనోపాడు మండల కేంద్రంలో, నిజామాబాద్‌ ‌జిల్లా వేల్పూర్‌ ‌మండలం నడికుడలో కాంగ్రెస్‌, ‌బిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తల మధ్య‌ వాగ్వాదం, అధికారుల నిలదీత లాంటి సంఘటనలు జరిగాయి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రకటించిన పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వొస్తున్నది. కాగా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నాలుగు ప్రధాన పథకాలను ఈనెల 26న అమల్లోకి తీసుకు వచ్చే క్రమంలో అసలైన లబ్దిదారులను గుర్తించేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గత మూడు రోజులుగా గ్రామసభలను నిర్వహిస్తోంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయభరోసా, కొత్త రేషన్‌ ‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల‌ లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం ఈ గ్రామసభలను నిర్వహిస్తున్నది. అయితే ఈ సందర్భంగా అధికారులు తమ వెంట తెచ్చుకున్న లబ్ధిదారుల జాబితాను గ్రామసభలో ప్రకటించడం పెద్ద దుమారాన్నిలేపింది. ఆ జాబితాలో తమ పేర్లు కనిపించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఆత్మహత్యాయత్నాలు, ఏడ్పులు, పెడబొబ్బలు చివరకు వేడుకోళ్లు చోటుచేసుకున్నాయి. గతంలో దరఖాస్తులు చేసుకోని వారి నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అధికారుల మాటలను పట్టించుకునే పరిస్థితిలో ఆశావహులు లేరు.

అధికారులు ప్రకటించింది తుది జాబితాగా గ్రామస్తులు భావించడమే ఈ గొడ‌వ‌ల‌కు కారణమైంది. ఇక తమకు అ జాబితాలో చేరే అవకాశం లేదని, ప్రభుత్వ పథకాలను పొందే అవకాశం లేదన్న అనుమానంతో రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాల్లో ప్రజలు అధికారులపై తిరగబడడంతో గ్రామ, వార్డు సభలన్నీ ర‌సాభాస‌గా మారాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్న సభలు కూడా ఇందుకు అతీతమేమీకాదు. బాన్సువాడ ఎమ్మెల్యే, ‌మాజీమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్న సభలో కూడా రైతులు నిలదీశారు. రుణమాఫీ విషయంలో రైతులు నిలదీయటంతో త్వరలోనే అందరికీ అందుతాయని దామోదర వారికి అభయమిచ్చే వరకు రైతులు ఆయనను వదలలేదు.

ఇదిలాఉంటే ఈ గందరగోళానికి ప్రతిపక్ష బిఆర్‌ఎస్‌ ‌కారణమంటున్నారు రాష్ట్ర మంత్రులు. అనవసరంగా ప్రజల్లో అనుమానాలను రేకెత్తిస్తూ, వారిని ఉసిగొల్పు తున్నారంటూ వారు బిఆర్‌ఎస్‌ ‌నాయకులను తీవ్రంగా విమర్శిస్తున్నారు. గ్రామసభలో అధికారులు చదివి వినిపిస్తున్న జాబితానే చివరి జాబితా కాదని, అర్హులైన వారి దరఖాస్తులను స్వీకరించి తుది జాబితాను తయారు చేస్తామని మంత్రి పొంగులేటి, సీతక్క పలుమార్లు ప్రజలకు విజ్ఞప్తిచేయడాన్ని, మాజీ మంత్రి,  సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీష్ రావు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికే నాలుగు వందల రోజుల పాటు ప్రజలను మోసంచేసిన ఈ ప్రభుత్వానికి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించ‌లేద‌ని.. మళ్ళీ మళ్ళీ దరఖాస్తులను కోరడం కోతల కోసమేనని హరీష్‌తోపాటు బిజెపి కూడా ఆరోపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *