– మహిళా బిల్లుపై బీజేపీ చీఫ్ రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16: మహిళల రాజకీయ ను మరింత బలపరిచేందుకు వారికి 2029 నుంచి చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే దృఢసంకల్పంతో చట్ట సవరణను కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు తెలిపారు. చందానగర్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దీంతోపాటు డీలిమిటేషన్ ప్రక్రియను కూడా ముందుకు తీసుకొస్తున్నామన్నారు. ఎన్నో ఏళ్లుగా మహిళలు కలగంటున్న సమాన ప్రాతినిధ్యం ఈ చట్టంతో సాకారం కాబోతోందన్నారు. ఈ చారిత్రక నిర్ణయం సందర్భంగా మహిళల తరఫున, ప్రజల తరఫున ప్రధాని మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, రాష్ట్రంలోని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. 2008లో మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీసుకురావడానికి ప్రయత్నించగా ఆ సమయంలో తన మిత్రపక్షాలైన జనతాదళ్, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీలు పార్లమెంటులో బిల్లు ప్రతులను చింపివేసి ఈ చట్టాన్ని అడ్డుకున్నాయని తెలిపారు. అప్పటి కాంగ్రెస్ నాయకత్వం, ముఖ్యంగా సోనియా గాంధీ స్పష్టమైన వైఖరిని వ్యక్తం చేయలేదని విమర్శించారు. అంతకుముందు రాజీవ్ గాంధీ మహిళా రిజర్వేషన్లు తీసుకొస్తామని హామీ ఇచ్చినా అమలు కాలేదన్నారు. ఈరోజు కాంగ్రెస్ నాయకుల ప్రవర్తనను గమనిస్తే వారు మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోందని ఆయన విమర్శించారు. కొత్తకొత్త ప్రతిపాదనలతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తూ మహిళా రిజర్వేషన్ల అమలును అడ్డుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్, ఇండీ అలయెన్స్ పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే ఈ చట్టం సాధ్యమైందని, 2029 నుంచి ఇది అమల్లోకి వస్తే దేశ రాజకీయాల్లో మహిళల పాత్రను విస్తృతంగా పెంచుతుందని చెప్పారు. దేశ జనాభా 140 కోట్లకు చేరిన నేపథ్యంలో సీట్ల సంఖ్యను కూడా సుమారు 50 శాతం మేరకు పెంచే అవకాశం డీలిమిటేషన్ బిల్లు కల్పిస్తోందన్నారు. అందులో 33 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించడం ద్వారా సరైన ప్రాతినిధ్యం సాధ్యం అవుతుందన్నారు. ఈ చట్టం వల్ల ఏ రాష్ట్రానికో, ఏ ప్రాంతానికో నష్టం జరుగుతుందనే ప్రచారం తప్పు అంటూ కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని రామచందర్‌రావు విజ్ఞప్తి చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




