– ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాల్లో రాష్ట్రం అవకాశాల ఖని
‘ యూఎస్ నేషనల్ కాలేజ్ వార్’ ప్రతినిధుల భేటీలో మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16 : ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా దూసుకెళ్తున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా అమెరికా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించాలని ఆ దేశ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో యూఎస్ నేషనల్ కాలేజ్ వార్ బృంద సభ్యులతో ఆయన గురువారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. డ్రోన్లు, కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, ఏరోస్పేస్ కాంపోనెంట్స్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, సైబర్ సెక్యూరిటీ, స్పేస్ టెక్నాలజీ, ఏఐ ఇన్ డిఫెన్స్, శాటిలైట్స్ సిస్టమ్స్ అండ్ అడ్వాన్స్‌డ్ కమ్యూనికేషన్స్‌లో రాష్ట్రాన్ని గ్లోబల్ లీడర్‌గా తీర్చిదిద్దేలా తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందన్నారు. రాకెట్ల తయారీ నుంచి అత్యాధునిక డ్రోన్ల వరకు, యుద్ధ విమానాల విడిభాగాల నుంచి శాటిలైట్ల వరకు అన్నింటిలోనూ ‘మేడిన్ తెలంగాణ’ మార్క్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోందన్నారు. ఈ రంగం (ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్)లో తెలంగాణ ఏటా 30 శాతానికి పైగా వృద్ధిని రేటును నమోదు చేస్తోందన్నారు. అలాగే 2024-26 మధ్య కాలంలో ఎగుమతుల్లో 103 శాతం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్(సీఏజీఆర్) నమోదయిందన్నారు. లాక్హీడ్ మార్టిన్, బోయింగ్, సాఫ్రాన్, ఎయిర్ బస్, డస్సాల్ట్ ఏవియేషన్ తదితర ప్రపంచ దిగ్గజ ఏరోస్పేస్ కంపెనీలతో డీఆర్డీవో, భెల్, మిధాని, బీడీఎల్, ఆర్‌సీఐ, హాల్ తదితర కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. ఇవేకాక ప్రిసిషన్ ఇంజనీరింగ్, డ్రోన్లు, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 1,500 కంటే ఎక్కువ ఎంఎస్ఎంఈలు తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేస్తున్నాయన్నారు. ప్రపంచంలోనే అత్యంత ‘కాస్ట్ ఎఫెక్టివ్ ఏరోస్పేస్ సిటీ’గా హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వరుసగా ఐదుసార్లు ‘బెస్ట్ స్టేట్ ఫర్ ఏరోస్పేస’ అవార్డును గెలుచుకుని గ్లోబల్ ఏరోస్పేస్ మ్యా ప్‌లో తెలంగాణ ఒక శక్తిమంతమైన కేంద్రంగా మారిందన్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఏరో స్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాలకు అవసరమైన ఎకో సిస్టంను అభివృద్ధి చేస్తున్నామన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఈ రంగానికి అవసరమైన రెడీ టూ స్కిల్ వర్క్ ఫోర్స్‌ను అందిస్తున్నామన్నారు. పెట్టుబడులకు మాత్రమే కాదు, సాంకేతికత, పరిశోధన, తయారీ, నైపుణ్యాభివృద్ధిలో అమెరికాకు నమ్మకమైన దీర్ఘకాల వ్యూహాత్మక భాగస్వామిగా నిలిచేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్, స్పేస్ టెక్నాలజీ తదితర రంగాల్లో అమెరికా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలతో కలిసి పని చేస్తామన్నారు. తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని, రాబోయే రోజుల్లో ఆ దిశగా అడుగులు వేస్తామని స్టేట్ డిపార్ట్‌మెంట్ మినిస్టర్ కౌన్సిలర్ పాల్ నరైన్ పేర్కొన్నారు. అమెరికా-తెలంగాణ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు చొరవ చూపుతామన్నారు. కార్యక్రమంలో కెప్టెన్ ఫ్రాంక్ ఒకటా(నేవీ), రెనో బామ్‌ఫోర్డ్(డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ), లెఫ్టినెంట్ కల్నల్ జాన్ కయాంగ్యాంగ్(ఆర్మీ), రెబెక్కా కింగ్(డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ), లెఫ్టినెంట్ కల్నల్ మైఖేల్ కూబ్(ఎయిర్ నేషనల్ గార్డ్), జోస్ సలాస్(డిఫెన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఏజెన్సీ), టీజీఐఐసీ ఎండీ శశాంక, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




