గురుకుల విద్యార్థుల సంక్షేమమే తొలి ప్రాధాన్యం

– సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి
– హాస్టళ్లు, తరగతి గదుల ఆకస్మిక పరిశీలన
– నీటి సమస్య పరిష్కారానికి కలెక్టర్‌కు ఆదేశాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16: గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన వసతి, భోజనం, తాగునీరు, పారిశుధ్య సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించే ఉద్దేశంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని చైతన్యపురి మహిళా న్యాయ కళాశాల, ఇబ్రహీంపట్నం రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల, సరూర్‌నగర్ బాలికల గురుకుల పాఠశాలను మంత్రి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడిన మంత్రి వారి విద్యాభ్యాసం, హాస్టల్ నిర్వహణ, భోజనం, తాగునీరు, పారిశుధ్యం, భద్రత, బోధన తదితర అంశాల గురించి తెలుసుకున్నారు. మూడు విద్యాసంస్థలు ఒకే ప్రాంగణంలో ఉండటం వల్ల తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థినులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి మిషన్ భగీరథ పైప్‌లైన్ ద్వారా శాశ్వత తాగునీటి సౌకర్యం కల్పించాలని, అప్పటివరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యత, మెనూ అమలు, పరిశుభ్రత ప్రమాణాలపై ఆరా తీశారు. మెనూ ప్రకారమే రుచికరమైన, నాణ్యమైన భోజనం అందిస్తున్నారని విద్యార్థినులు మంత్రికి తెలిపారు. ఏ చిన్న సమస్య ఉన్నా నిర్భయంగా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. విద్యార్థుల అభిప్రాయాలు, సూచనలు ప్రభుత్వానికి ఎంతో విలువైనవని అన్నారు. ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో తమ పిల్లలను గురుకుల విద్యాసంస్థలకు పంపిస్తున్నందున వారి విశ్వాసాన్ని నిలబెట్టేలా అంకితభావంతో పనిచేయాలని మంత్రి సూచించారు. విద్య ద్వారానే సమాజంలో సమానత్వం సాధ్యమవుతుందని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చూపిన మార్గంలోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. గురుకుల విద్యాసంస్థలు సామాజిక మార్పుకు కేంద్రాలుగా నిలవాలిలని, ప్రతి ఉపాధ్యాయుడు తమ బాధ్యతను సేవాభావంతో నిర్వర్తించి విద్యార్థులను ఉన్నత లక్ష్యాల వైపు నడిపించాలని మంత్రి సూచించారు. తనిఖీలో టీజీఎస్‌డబ్ల్యూఆరఈఐఎస్ (ఎఫఏసీ) కార్యదర్శి కె.శారద, స్టేట్ ఆఫీసర్ నిర్మల, ప్రిన్సిపాల్ సరూర్‌నగర్ గర్ల్స్ స్కూల్ కృష్ణ ప్రభ, లా, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.

దివ్యాంగుల కార్యాలయం, వసతి గృహంలో మంత్రి తనిఖీ

రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమం, వారి విద్యాభివృద్ధి, జీవన ప్రమాణాల మెరుగుదలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ స్పష్టం చేశారు. నల్లగొండ ఎక్స్ రోడ్స్‌లోని దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుల కార్యాలయం, ప్రభుత్వ దివ్యాంగుల వసతి గృహం, పాఠశాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మమేకమైన మంత్రి మూగ-చెవిటి విద్యార్థులు సంకేత భాష ద్వారా తమ సమస్యలను వివరించగా ఎంతో శ్రద్ధగా ఆలకించారు. విద్యార్థులకు అవసరమైన ప్రతి సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. విద్యార్థుల అవసరాలన్నింటపై ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని అధికారులను ఆదేశించారు. శాఖలో ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని మంత్రి తీవ్రంగా పరిగణించారు. ఖాళీ పోస్టుల వివరాలు, అవసరమైన బోధనా సిబ్బంది, ఇతర సౌకర్యాలపై వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని సహాయ సంచాలకుడు, విద్యాసంస్థ ప్రిన్సిపాల్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దివ్యాంగ విద్యార్థుల విషయంలో విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు అనే మూడు అంశాలకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వసతి గృహంలోని ఆహారం, పారిశుధ్యం, తాగునీరు, వైద్య సేవలు, తరగతి గదులు, బోధన సౌకర్యాలు, విద్యార్థుల భద్రత వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించిన ప్రతి సమస్యను మానవీయ దృక్పథంతో పరిష్కరించాలని, విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే ప్రతిపాదనలను ఆలస్యం చేయకుండా ప్రభుత్వానికి పంపాలని మంత్రి అధికారులను ఆదేశించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *