– భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
– రహదారుల విస్తరణకు కార్యాచరణ సిద్ధం చేయాలి
– పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలి
– మంత్రి అనసూయ సీతక్క
ములుగు, ప్రజాతంత్ర ,జులై 16:మేడారం మహా జాతరకు విచ్చేసే కోట్లాదిమంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. తాడ్వాయి మండలం మేడారంలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేడారంలో అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించా రు. తదుపరి మేడారం ఇంగ్లీష్ మీడియం ఆశ్రమ పాఠశాలలో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి హరిత హోటల్‌లో మేడారం అభివృద్ధి పనులపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మేడారం–తాడ్వాయి, పస్రా–మేడారం, చిన్నబోయినపల్లి–కొండాయి–ఊరట్టం రహదారుల విస్తరణకు యుద్ధ ప్రాతిపదికన అంచనాలు సిద్ధం చేసి, అవసరమైన అనుమతులను త్వరితగతిన పొందేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వనదేవతల దర్శనానికి వచ్చే భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. క్యూ లైన్లను ఆధునికీకరించడంతో పాటు ఆలయ పరిసర ప్రాంతాల్లో డ్రైనేజీ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.జంపన్న వాగు పరిసర ప్రాంతాలను సుందరీకరించి, జంపన్న వాగుపై చెక్‌డ్యామ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. దీని ద్వారా భక్తులకు ఏడాది పొడవునా పుణ్యస్నానాలు ఆచరించేందుకు నీరు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు.ప్రధాన రహదారుల ఇరువైపులా, డివైడర్ల మధ్య పచ్చదనాన్ని పెంపొందించేలా పెద్దఎత్తున మొక్కలు నాటాలని, నూతనంగా ఏర్పాటు చేయనున్న స్మృతి వనాన్ని సహజసిద్ధమైన పచ్చదనంతో అభివృద్ధి చేయాలని సూచించారు. భక్తుల కోసం కాటేజీలు, విశ్రాంతి కేంద్రాల ఏర్పాటుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.ఆలయ పరిసరాలతో పాటు మొత్తం మేడారం ప్రాంతాన్ని పారిశుధ్య కార్మికుల ద్వారా నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని, దుకాణదారులు తమ పరిసరాలను పరిశుభ్రంగా నిర్వహించేలా అధికారులు పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. రహదారులపై చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు వేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, రవాణా, వైద్య సేవలు, భద్రత తదితర అన్ని మౌలిక సదుపాయాలను ముందస్తుగా సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.ప్రకృతిని మనం రక్షిస్తే ప్రకృతి మనలను రక్షిస్తుందనే భావనతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలని సూచించారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా వాతావరణ సమతుల్యతను కాపాడడంతో పాటు భావితరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించవచ్చన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం, విద్యాసంస్థ, గ్రామం, ఇంటి పరిసరాల్లో విస్తృతంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించే ఉద్యమంగా వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడమే కాకుండా అవి పెరిగి పెద్ద వృక్షాలుగా మారే వరకు సంరక్షించడం ప్రతి పౌరుడు నైతిక బాధ్యతగా వ్యవహరించాలన్నారు.అనంతరం జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ మేడారం అభివృద్ధి పనులన్నింటినీ నిర్దేశించిన గడువులో నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో వనదేవతల దర్శనం, జిల్లా అభివృద్ధి పైలాన్ ప్రారంభోత్సవం, నూతన సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమాల్లో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో, జిల్లా అటవీ అధికారి వికాస్ మీనా, అదనపు కలెక్టర్లు, సిహెచ్ మహేందర్ జి,సంపత్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి,ఆర్ డి ఓ కృష్ణవేణి, జిల్లా అధికారులు, ఆలయ పూజారులు, కాంట్రాక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




