ఉపాధి అవకాశాలను విస్తృతంగా పెంచాలి

– రోజూ 15 లక్షల మంది కూలీలకు పనులు
– పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ సమీక్షలో మంత్రి సీతక్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5 : గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తృతంగా పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉపాధి హామీ పనుల్లో రోజుకు సుమారు తొమ్మిది లక్షల మంది కూలీలు పాల్గొంటున్నారని, ఈ సంఖ్యను తక్షణం 15 లక్షలకు పెంచేలా సమగ్ర కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో పనుల ప్రణాళికను వేగవంతం చేయడంతోపాటు అవసరమైన అనుమతులు, సాంకేతిక ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేసి మరిన్ని పని దినాలు సృష్టించాలన్నారు. ప్రతి జిల్లాలో కూలీలకు నిరంతరం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సీఈవోలు, డీఆర్‌డీవోలు, డీపీవోలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ వింగ్, మిషన్ భగీరథ అధికారులతో వరంగల్ పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 15వ ఆర్దిక సంఘం నిధుల వినియోగం, ఉపాధిó హామీ, సెర్ప్, ఇతర కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు.  15వ ఆర్థిక సంఘం నిధులను కేవలం అనుమతించిన పనులకే వినియోగించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిధులను మళ్లించిన ఘటనలపై సంబంధిత అధికారులు వెంటనే నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీల్లో పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బకాయిలను అత్యవసరంగా చెల్లించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.1590 కోట్ల మేర బకాయిలు ఉండటం ఆందోళనకరమని, వీటిని క్లియర్ చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. గ్రామ పంచాయతీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పథకం అమలులో వేగం పెంచాలని మంత్రి స్పష్టం చేశారు. ఏప్రిల్, మే నెలలకు కేంద్రం మంజూరు చేసిన ఆరు కోట్ల పని దినాల్లో ఏప్రిల్‌లో కోటిన్నర పని దినాలు సాధించడం సానుకూలమని, మే నెలలో పూర్తి లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో పనులు నిరంతరంగా కొనసాగాలని, ఎక్కడా నిలిచిపోకూడదని మంత్రి హెచ్చరించారు. పనితీరు తక్కువగా ఉన్న జనగామ, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, ఖమ్మం జిల్లాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి మండలానికి ప్రత్యేక అధికారులను నియమించి వారు క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. కూలీలకు వేతనాల చెల్లింపుల విషయంలో పురోగతి సాధించినట్లు మంత్రి తెలిపారు. కేంద్రంతో సమన్వయం ద్వారా రూ.462 కోట్ల నిధులు విడుదల చేయించామని, ఏప్రిల్ 15 వరకు పెండింగ్ చెల్లింపులు పూర్తయ్యాయని చెప్పారు. సెర్ప్ కార్యక్రమాల కింద మహిళా భవనాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సూచించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి జిల్లా మహిళా సమాఖ్యల భవనాలను పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సుమారు ఐదు వేల గ్రామీణ మహిళా భవనాల పనులను త్వరితగతిన పూర్తిచేయాలని, అలాగే మహిళా సంఘాల కోసం నిర్మిస్తున్న 46 గోదాముల నిర్మాణాన్ని విస్తరించాలని ఆదేశించారు. గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా 1,900 గ్రామ పంచాయతీ భవనాలు, 1450 అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కాన్ఫరెన్స్‌లో స్పెషల్ సీఎస్ దానకిశోర్, కమిషనర్ దివ్యా దేవరాజన్, స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మి, మిషన్ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్ రెడ్డి, ఇంజనీరింగ్ విభాగం ఈఎన్‌సీ జోగారెడ్డి, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *