హామీలకు పాలనకు పొంతన లేదు

\కాంగ్రెస్ సర్కార్‌ను సాగనంపడమే ఉత్తమం
గజ్వేల్ బీజేపీ సభలో ఈటల వ్యాఖ్య
సిద్దిపేట, ప్రజాతంత్ర, మే 5: అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న పనులకు ఎక్కడా పొంతన లేదని ప్రజలు చెప్పుకొనే పరిస్థితి వచ్చిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎన్ని శాపనార్థాలు పెట్టినా వేస్ట్ అని, మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ఓడిస్తే తప్ప మనకు మన:శాంతి లేదని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో బీజేపీ నేతల సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ రిటైర్ ఉద్యోగులకు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద నగదు చెల్లించకపోవడంతో కోర్టు జోక్యం చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేసే పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వాన్ని ఎలా నడుపుతున్నారో వాళ్లకే తెలియాలన్నారు. గ్రాణ ప్రాంతాల్లో చిన్న పనులు చేసుకునే కాంట్రాక్టర్లకు బిల్లులు అందక గతంలోనే కాదు నేడు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని ఎంపీ ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లకే కాంగ్రెస్ పార్టీ ప్రజలచేత ఛీ కొట్టించుకునే పరిస్థితులు వచ్చాయన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే ఏకైక మార్గం బీజేపీ అధికారంలోకి రావడమేనన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారన్నారు. పశ్చిమ బెంగాల్‌లో అరాచకం, దుర్మార్గాలు జరిగినా ఇది నా జాగీరు అంటూ అహంకారంతో పాలించిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీని ప్రజలు ఓడించారని తెలిపారు. తమిళనాడులో స్టాలిన్‌పై ఒక సామాన్యుడు గెలిచాడంటే డీఎంకే ప్రభుత్వంపై ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టమైందని అన్నారు. తమిళనాడు ఫలితాలు దేశ రాజకీయ పార్టీలకు కనువిప్పు కావాలని తాను కోరుకుంటున్నానన్నారు. కుటుంబ రాజకీయాలు నడిపేవారు ఈ రాష్ట్రానికి తామే ఓనర్లమనే పద్ధతిలో అన్నీ వాళ్లే చేసుకునే వారికి, రూ.లక్షల కోట్ల స్కాంలు చేసి డబ్బులు సంపాదించి వాటితో ఎన్నికల్లో గెలవాలని కుట్ర చేసే వారికి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అత్యుత్తమ ఉదాహరణ అని రాజేందర్ చెప్పారు. తమిళనాడు ఎన్నికల ఫలితాలపై లోతుగా ఆలోచించాల్సిన విషయమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు ఎంత అప్రమత్తంగా, ఎంత చురుకుగా ఉన్నారో ఈ ఫలితాలనుబట్టి మనకు అర్థమవుతోందని ఈటల అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *